ఎన్టీఆర్, సాక్షి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆ పార్టీలో తాజాగా చేరిన రఘురామ కృష్ణంరాజులకు బీజేపీ ఝలక్ ఇచ్చింది. కూటమి తరఫున సీట్ల మార్పునకు చంద్రబాబు చేసిన ప్రతిపాదనలను బీజేపీ తిరస్కరించింది. దీంతో.. నరసాపురం ఎంపీ టికెట్‌పై రఘురామ పెట్టుకున్న ఆశలు గల్లంతయ్యాయి.
పొత్తులో భాగంగా టీడీపీ, జనసేనలకు సీట్ల పంపంకంతో పాటు బీజేపీ 10 అసెంబ్లీ, 6 ఎంపీ స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించాయి. ఈ క్రమంలో.. బీజేపీ ఇదివరకే అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. అయితే ఆ జాబితాలో మార్పుల కోసం చంద్రబాబు బీజేపీతో మంతనాలు మొదలుపెట్టారు. నర్సాపురం, ఏలూరు ఎంపీ సీట్లతో పాటు 20 సీట్ల దాకా మార్చుకుందామంటూ బీజేపీ ముందర ప్రతిపాదన పెట్టారు.
అయితే.. ‘‘నర్సాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాస వర్మ. ఆయన్ని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఎంపిక చేశారు. అతని తరఫునే మేం ప్రచారం చేయబోతున్నాం’ అని ఏపీ బీజేపీ ఎన్నిలక ఇంఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ తాజాగా ప్రకటించారు. దీంతో.. చంద్రబాబు ప్రతిపాదనను బీజేపీ తిరస్కరించిందనేది స్పష్టమవుతోంది.
ఉండి కూడా ఫసకే?
ఇదిలా ఉంటే.. నరసాపురం ఎంపీ సీటు కోసం రఘురామ కృష్ణంరాజు తీవ్రంగా యత్నించారు. చంద్రబాబుతోనూ సంప్రదింపులు జరిపారు. చివరకు ఉండి అసెంబ్లీ సీటు మాట దక్కించుకుని, టీడీపీలో చేరారు. అయితే పాలకొల్లు టీడీపీ భేటీలో చంద్రబాబు రఘురామ కృష్ణంరాజును ఉండి అభ్యర్థిగా ప్రకటించగానే.. అక్కడి టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. అప్పటికే టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు, మరో టీడీపీ నేత కలవపూడి శివరామరాజు మధ్య ఉండి టికెట్ కోసం కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ మధ్యలో చంద్రబాబు రఘురామ పేరును ప్రస్తావనకు తేవడాన్ని టీడీపీ శ్రేణులు భరించలేకపోయాయి.
ఉండిలో 2019 ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే వేటుకూరి శివరామరాజు (కలవపూడి శివ)ను నరసాపురం ఎంపీ అభ్యర్థిగా నిలిపి, ఆయన అనుచరుడు రామరాజుకు ఉండి టికెట్ ఇచ్చింది టీడీపీ.
ఉండి సీటుకు రఘురామ కృష్ణంరాజు పేరుతో టీడీపీ శ్రేణులు భగ్గుమనడంతో చంద్రబాబు కాస్త మెత్తబడ్డారు. అదే సమయంలో ఉండి సీటు నిర్ణయం ఇంకా జరగలేదంటూ రఘురామ సన్నాయి నొక్కులు నొక్కారు. ఈలోపు రఘురామకు నర్సాపురం ఎంపీ సీటు కోసం చంద్రబాబు ప్రయత్నాలు కొనసాగిస్తూనే వచ్చారు. చివరకు.. బీజేపీ ఆ సీటను వదులుకునేందుకు నో చెప్పేసింది. దీంతో ఇటు నరసాపురం, అటు ఉండి రెండూ రఘురామకు కాకుండా పోయే పరిస్థితి ఏర్పడింది.
మరోవైపు.. ఎమ్మెల్యే సీట్ల మార్పుపైనా బీజేపీ, టీడీపీ అధినేతకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో.. అనపర్తి, జమ్మలమడుగు, తంబళ్లపల్లి సీట్ల మార్పు ప్రతిపాదనపై సందిగ్ధత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment