పశ్చిమ గోదావరి, సాక్షి: కూటమి తరఫున నరసాపురం సీటు తనదేనని ప్రకటించుకున్న రఘురామ కృష్ణంరాజుకి ఊహించని షాక్ తగిలింది. పొత్తులో భాగంగా బీజేపీ సీటును ఎగరేసుకుపోవడంతో రఘురామ గొంతులో వెలక్కాయ పడ్డట్లయ్యింది. అయినప్పటికీ తన ప్రయత్నాలను మాత్రం మాననలేదు. తాను నమ్ముకున్న చంద్రబాబునే స్వయంగా రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో.. ఈసారి ఎన్నికల్లో రఘురామ పోటీ చేసి తీరతారని, ఈ మేరకు కూటమిలో సంప్రదింపులు జరుగుతున్నాయని ఈనాడు, ఆంధ్రజ్యోతిలు సైతం కథనాలు ఇస్తూ వస్తున్నాయి. బీజేపీ నుంచి నరసాపురం సీటు తీసుకునేందుకు రఘురామ విపరీతంగా పైరవీలు నడిపిస్తున్నట్లు సమాచారం. అదీ కుదరని పక్షంలో ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తారనేది ఆ కథనాల సారాంశం. ఈలోపు తాజాగా రఘురామ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అభ్యర్థిగా పోటీ చేయడమే తన ఆశయమంటూ ప్రకటించుకున్నారు రఘురామ. ‘‘నేను ఎక్కడి నుంచి పోటీ చేస్తాననేది మరో రెండు రోజుల్లో తేలుతుంది. ఢిల్లీ ఎంపీగానో, అమరావతి ఎమ్మెల్యేగానో చూడాలి. పోటీ చేయడమైతే పక్కా. ఎంపీగా బరిలో నిలవాలన్నది నా ఆశ. అసెంబ్లీలో ఉండాలన్నది ప్రజల కోరిక.చాలా మంది నన్ను అసెంబ్లీలో స్పీకర్‌గా చూడాలనుకుంటున్నారు. నేను కోరుకుంటున్న కేంద్రమా, ప్రజలు కోరుతున్న రాష్ట్రమో త్వరలోనే తెలుస్తుంది’’ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
మరోవైపు ఇవాళ నరసాపురంలో పర్యటించనున్న చంద్రబాబు.. రఘురామ పోటీ కోసం జరిగే కూటమి చర్చల్లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. తాను చెబితేనే వైఎస్సార్సీపీని, సీఎం వైఎస్ జగన్‌ను టార్గెట్ చేసిన రఘురామ కోసం ఎలాగైనా సీటు ఇప్పించాలని చంద్రబాబు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నట్లు స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment