అదేనా మా తప్పు?: టీడీపీకి ఆర్కే రోజా సూటి ప్రశ్న | AP Ex Minister RK Roja Fire On TDP Over Rushikonda | Sakshi
Sakshi News home page

అదేనా మా తప్పు?: టీడీపీకి ఆర్కే రోజా సూటి ప్రశ్న

Published Wed, Jun 19 2024 7:37 AM | Last Updated on Wed, Jun 19 2024 7:41 AM

AP Ex Minister RK Roja Fire On TDP Over Rushikonda

విశాఖపట్నం, సాక్షి: రుషికొండలో గత జగన్‌ ప్రభుత్వం నిర్మించిన కట్టడాలు.. అక్రమ కట్టడాలని ప్రచారం చేస్తు‍న్న టీడీపీకి గట్టి ఎదురు దెబ్బలే తగులుతోంది. చంద్రబాబు మాదిరి జగన్‌ తాత్కాలిక భవనాలు నిర్మించి ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయలేదని.. ప్రజా ధనంతో పటిష్టమైన ప్రభుత్వ భవనాలే నిర్మించారని ఇటు వైఎస్సార్‌సీపీ, అటు నెటిజన్లు కౌంటర్లు ఇస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో ఏపీ పర్యాటక శాఖ మాజీ మంత్రి ఆర్కే రోజా సెల్వమణి ఈ అంశంపై స్పందించారు.  

రుషికొండలో నిర్మించిన కట్టడాలు అత్యద్భుతమని వర్ణించిన మాజీ మంత్రి రోజా.. పర్యాటక శాఖ స్థలంలో పర్యాటక శాఖ భవనాలను నిర్మించడం తప్పా? అని టీడీపీ శ్రేణుల్ని గట్టిగా ప్రశ్ని‍ంచారు. ‘‘విశాఖ నగరాన్ని విశ్వనగరంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్న మా ప్రభుత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భవనం నిర్మించడం తప్పా?. వర్షానికి కారిపోయే అసెంబ్లీని, సచివాలయాన్ని కట్టినవాళ్లకు అత్యంత నాణ్యతతో రుషికొండలో భవనాలు నిర్మించడం చూసి ఓర్వలేకపోవడం సమంజసమేనా?’’ అంటూ సెటైర్లు వేశారు. 

ఇదీ చదవండి: సంక్షేమ పథకాలకు పేర్లు మార్చిన చంద్రబాబు ప్రభుత్వం

.. 2021లోనే కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు సమగ్ర వివరాలిచ్చి రుషికొండ నిర్మాణాలు చేపట్టిన మాట వాస్తవం కాదా..?. 61 ఎకరాల్లో 9.88 ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు చేపట్టం...ఇందులో అక్రమం ఎక్కడుంది..?. విశాఖ ఖ్యాతిని ఇనుమడించేలా, రాష్ట్రానికే తలమానికంగా భవనాలు నిర్మించడం కూడా నేరమేనా..?. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా ఫైవ్ స్టార్ వసతులతో నిర్మాణాలు చేయడం తప్పేనా...?. ఏడు బ్లాకుల్లో ఏమేమీ నిర్మాణాలు, వసతులు ఉంటాయో గతంలోనే టెండర్ డాక్యుమెంట్లలో పొందుపర్చిన మాట వాస్తవం కాదా...

.. హైకోర్టుకు ఈ నిర్మాణాలపై ప్రతి దశలోనూ అధికారులు నివేదిక సమర్పించిన వాస్తవం దాచేస్తే దాగుతుందా..?. ఇన్నాళ్లూ ఇవి జగనన్న సొంత భవనాలని ప్రచారం చేసిన వాళ్లు ఇప్పటికైనా అవి ప్రభుత్వ భవనాలని అంగీకరిస్తారా..? లేదా..?. హైదరాబాద్ లో సొంతిల్లు కట్టుకున్నారని, హయత్ హోటల్ లో లక్షలకు లక్షలు ప్రజల డబ్బులను అద్దెలు చెల్లించిన వాళ్లా...ఈరోజు విమర్శలు చేసేది..?. 

.. లేక్ వ్యూ గెస్ట్‌ హౌస్, పాత సచివాలయం ఎల్ బ్లాక్, హెచ్ బ్లాక్ లలో 40 కోట్లతో హంగులు అద్ది రాత్రికి రాత్రి వాటిని వదిలేసి విజయవాడ వచ్చేసిన వాళ్లా ఈరోజు విమర్శలు చేసేది..?. జగనన్నపైన, మాపైన ఎంత వ్యక్తిత్వ హననం చేసినా రాబోయే రోజుల్లో ప్రజా సమస్యలపై పోరాటంలో వెన్ను చూపేది లేదు...వెనకడుగు వేసేది లేదు.. జై జగన్ అంటూ మాజీ మంత్రి ఆర్కే రోజా తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement