AP Finance Minister Buggana Rajendranath Gives Clartiy On YSRCP Govt Debts - Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అప్పులపై పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు.. టీడీపీ హయాంలోనే అప్పులు రెండింతలు: బుగ్గన

Published Tue, Apr 4 2023 2:32 PM | Last Updated on Tue, Apr 4 2023 3:33 PM

AP Finance Minster Buggana Rajendranath Clartiy YSRCP Govt Debts - Sakshi

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అప్పులపై ప్రతిపక్షాల పత్రికా ప్రకటనలు, కొన్ని పత్రికల్లో వస్తున్న కథనాలు పచ్చి అబద్ధాలని ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2023  మార్చి 31 నాటికి తమ ప్రభుత్వం చేసిన అప్పు రూ. 1,64,725 కోట్లే అని వెల్లడించారు.  టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం రెండింతల అప్పులు చేసినట్లు అధికారిక ప్రకటనలో తెలిపారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రూ 59,729 కోట్లు వేస్‌ అండ్‌ మీన్స్ నిజం కాదా? అని ప్రశ్నించారు.

“ఖజానా ఖాళీ!, రూ.100కోట్ల నిధి మాత్రమే మిగిలింది. ఎక్కడెక్కడ అప్పులొస్తాయో అన్నీ తెచ్చేశాం. ఒక్క రూపాయి కూడా ఇక అప్పు పుట్టదు. వైసీపీ ప్రభుత్వం మొదటి 6 నెలల్లోనే అప్పుదొరకక ఆదాయం లేక ఇంటికి వెళుతుంది” అంటూ గతంలో ఆర్థిక శాఖ మంత్రిగా చేసిన యనమలగారు వేర్వేరు సందర్భాలలో చేసిన వ్యాఖ్యలివి! ఇప్పుడేమో రాష్త్రం అప్పు రూ. 12.5 లక్షల కోట్లు దాటనుందని జోస్యం చెబుతున్నారు. అలాగే చంద్రబాబు గారు కూడా రాష్ట్రం అప్పు రూ. 10.31 లక్షల కోట్లు చేరిందని ఆయనే నిర్ధారించి సభల్లో ఇష్టమొచ్చినట్లు ప్రకటిస్తున్నారు. కొద్ది నెలల క్రితం వరకూ ఆంధ్రప్రదేశ్‌ మరో శ్రీలంకగా, నైజీరియాగా, జింబాబ్వేగా మారబోతోందని ప్రతిపక్ష నేతలు ఇలాగే గగ్గోలు పెట్టారు. టీడీపీ నాయకులలో రాష్ట్ర ఆర్ధిక స్థితిపై సరైన అవగాహన లేక నోటికి వచ్చినట్లు పచ్చి అబద్ధాలు చెప్పడమే పనిగా పెట్టుకున్నారు. ఈ దుష్ప్రచారాలతో రాష్ట్ర  ప్రజలలో ఒక రకమైన గందగోళాన్ని సృష్టించి రాజకీయ లబ్ది పొందాలని విఫల యత్నంచేస్తున్నారు. 

వాస్తవానికి , మే నెల, 2019 లో టీడీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పు రూ.2,71,797 కోట్లు. మార్చి 31 , 2023 నాటికీ రాష్ట్రం అప్పు రూ. 4,36,522 కోట్లు. ఈ లెక్కల ప్రకారం, ఈ నాలుగేళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పులు అక్షరాలా రూ.1,64,725 కోట్లు మాత్రమే.  అప్పు పెరుగుదలని పోల్చి చూస్తే, గత ప్రభుత్వ హయాం లో 2014 -19 లో కేంద్ర ప్రభుత్వ అప్పు Compound Annual Growth Rate (CAGR) 9.89% పెరిగినప్పుడు, మన రాష్ట్ర  అప్పు CAGR 19.02 % పెరిగింది. అంటే, టీడీపీ హయాంలో కేంద్రం కన్నా రాష్ట్రం రెండింతల అప్పులు చేసిందన్నడానికి అధికారిక గణాంకాలే నిదర్శనం. అదే వైసీపీ  ప్రభుత్వ హయాంలో (జూన్ 2019 నుంచి మార్చి 2023)  కేంద్ర ప్రభుత్వ అప్పు CAGR 14.37% పెరిగినప్పటికీ రాష్ట్ర అప్పు మాత్రం CAGR 13.55 శాతమే పెరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అప్పు నెమ్మదిగా పెరిగింది (SLOWER PACE) తప్ప మీరు చెప్పినట్టు కాదు. మీరు చేసినంత అప్పు అసలే లేదు. పైగా మా ప్రభుత్వం ఆ మాత్రం చేసింది కూడా కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కుంటూ సంక్షేమ పథకాలు ఏవీ ఆపకుండా ఉండడానికే..ప్రజలను కాపాడుకోవడానికే. 
 
తలసరి అప్పు రూ. 5.5 లక్షలని, అప్పులపై సంవత్సరానికి లక్ష కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తుందని సొంత లెక్కలు చెబుతూ యనమల గారు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఇవి ముమ్మాటికి ప్రజలను తప్పు దోవ పట్టించే తప్పుడు లెక్కలు, పచ్చి అసత్యాలన్నది వాస్తవం.  సెన్సస్-2011 ఆంధ్రప్రదేశ్ జనాభా 4.96 కోట్లు. ఈ జనాభా ప్రకారం తలసరి అప్పు రూ.88,008 మాత్రమే.  అప్పులపై వడ్డీ చూస్తే  2022 - 23కి రూ. 25,754 కోట్లు మాత్రమే. ఒక మాజీ ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి కూడా కనీస బాధ్యత లేకుండా రూ.లక్ష కోట్లు వడ్డీ కడుతుందని చెప్పడమంటే ముమ్మాటికి ఇది రాజకీయ ప్రయోజనాలు మినహా నిజాలు లేవని ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్ర భవిష్యత్తు ఏమైనా పర్వాలేదు, యువత భవిష్యత్తు నాశనమైనా మాకేం పోదు, పేదవారు కష్టాల ఊబిలో కూరుకుపోయినా  మాకు సంబంధం లేదు, మాకు కేవలం వైసీపీ ప్రభుత్వాన్ని అసత్యాలతో, అనుకూల మీడియాతో భయాందోళనలోకి ప్రజలను నెట్టి ఎలాగైనా తిరిగి అధికారంలోకి రావాలని టీడీపీ పన్నిన దుష్ట పన్నాగం కాక మరేమిటి? 

వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ని, ఓవర్ డ్రాఫ్ట్ (O.D) ని అప్పులలో కలిపి యనమల గారు  కుతంత్రాలను జొప్పించి అర్థరహితంగా మాట్లాడుతున్నారు. ఇది ముమ్మాటికీ ఒక పథకం ప్రకారం వైసీపీ ప్రభుత్వంపై బురద చల్లాలని చేస్తున్న కుయుక్తే. భారతీయ రిజర్వు బ్యాంకు రాష్ట్రాలకు  రోజు వారీ నగదు నిర్వహణకు గాను, వేస్‌ అండ్‌ మీన్స్‌, ఓవర్‌ డ్రాఫ్ట్‌ వసతిని కల్పించింది. దీనిని వాడుకోవడమనేది ఏ ప్రభుత్వానికైనా సర్వసాధారణమైన విషయం. వేస్‌ అండ్‌ మీన్స్,  ఓవర్‌ డ్రాఫ్ట్‌ అనేవి తాత్కాలిక అప్పు మాత్రమే. ‘వేస్‌ అండ్‌ మీన్స్’ మరియు ‘ఓవర్‌ డ్రాఫ్ట్‌’ కింద మన రాష్ట్ర  అప్పు సున్నా. 

టీడీపీ ప్రభుత్వం కూడా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రూ 59,729 కోట్లు వేస్‌ అండ్‌ మీన్స్‌ గా పొందడం వాస్తవం కాదా? అందులో రూ. 139 కోట్లు తిరిగి చెల్లించకుండా వెళ్లి పోయిన మాట వాస్తవం కాదా? అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా 2020–21 సంవత్సరానికి గాను రూ 69,454 కోట్లు వేస్‌ అండ్‌ మీన్స్‌ను ఉపయోగించుకుంది. ఇదేదో ఇపుడే వైసీపీ ప్రభుత్వమే తొలిసారి చేస్తున్నట్లుగా వాస్తవాలను మరుగున పరచి అబద్ధాలను ఎందుకు ప్రచారం చేస్తున్నారో వారికే తెలియాలి.  ఉదాహరణకు కోవిడ్ పరిస్థితుల్లో పేద వాడిని కష్టాల నుండి కాపాడుకోవడం కోసం  నియమిత గడువులోపల ఒక సంక్షేమ పథకానికి నిధులు విడుదల చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వద్ద నిధులు ఉండకపోవచ్చు. అప్పుడు ఆర్బీఐ వద్దకు వేస్‌ అండ్‌ మీన్స్‌కు వెళ్లడం పరిపాటి. రాష్ట్ర ప్రభుత్వానికి రాబడి అధికంగా వచ్చినప్పుడు అది మిగులు బ్యాలెన్స్‌గా కూడా మారొచ్చు. ఇది తెలిసి కూడా అదేదో పెద్ద విషయమైనట్లు టీడీపీ నేతలు చిత్రీకరించే ప్రయత్నం చూడడానికి విడ్డూరంగా ఉంది.

స్థిరమైన అభివృద్ధి లక్షాలలో (SDG) 13వ స్థానంలో ఉందని, ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (DBT) లో ఆంధ్రప్రదేశ్ 13వ స్థానంలో ఉందనే ప్రతిపక్షాల ప్రచారం కూడా నిజం కాదు. ఎక్కడ నుండి ఈ తప్పుడు సమాచారాన్ని కనిపెడతారో, కావాలనే ఈ కాకి లెక్కలు ఎలా సృష్టిస్తారో కూడా చెప్పాలని కోరుతున్నాను. నీతిఆయోగ్, భారత ప్రభుత్వం 2020-21 సంవత్సరంలో ప్రకటించిన ఎస్డీజీ ఇండెక్స్ ప్రకారం, ఈ ర్యాంకింగ్స్‌లో ఆంధ్రప్రదేశ్   72 స్కోరుతో 4వ స్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్  రాష్ట్రం మూడేళ్లలో తన స్కోర్‌ను నిరంతరం మెరుగుపరుచుకుంటూ సత్తా చాటుతోంది. 2018-19లో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్కోర్ 64 నుండి 2020-21నాటికి ఆ స్కోరు 72కి మెరుగుపడడం ఏపీ ప్రభుత్వ విధానాలకు ప్రతిబింబమన్న అసలు నిజం ప్రజలకు తెలియాలి. పైగా  ప్రతిసారి ఈ స్కోరులో భారతదేశ సగటు స్కోరు కంటే ఆంధ్రప్రదేశ్ మెరుగ్గా ఉందని నీతిఆయోగ్ గణాంకాలే తేల్చాయి. 

చంద్రబాబు నాయుడు గారు 2022-23 లో ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం తెలంగాణతో పోల్చితే చాల వెనుకపడి ఉందంటున్నారు. మరి చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019లో తెలంగాణ తలసారి ఆదాయం రూ. 2,09,848/- ఉంటే మరీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం కేవలం రూ. 1,54,031/- ఎందుకు ఉంది. అప్పుడు ఇప్పుడు తక్కువ తలసరి ఆదాయానికి కారణం చంద్రబాబు నాయుడు పాతకకృత్యాలే.  ఓటుకు నోటు కేసు , ఇబ్బడిముబ్బడిగా అప్పులు,వడ్డీలతో ఆర్ధిక విధ్వంసం. ఇవే ఏపీ వెనకబాటుతనానికి కారణం. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికి పోయి హైదరాబాద్ ని రాత్రి రాత్రికి తరలి వచ్చి విజయవాడలో చేరడం, టీడీపీ వాళ్ళు అవినీతి ఊబిలో కూరుకుపోయి చేసిన ఆర్థిక అనర్థాలేనని తెలుగు రాష్ట్రాల  ప్రజలందరికీ బాగా తెలుసు. ప్రస్తుత ధరల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 2,19,518/- (2022-23 AE). భారతదేశం యొక్క తలసరి ఆదాయం రూ. 1,72,000/- (2022-23 AE). అంటే 2022-23లో రాష్ట్ర తలసరి ఆదాయం దేశ తలసరి ఆదాయం కంటే 27.6% ఎక్కువ. తలసరి ఆదాయం అంశంలో  ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో మెరుగ్గా ఉంది.

వైసీపీ ప్రభుత్వం ఖర్చు చేసే ప్రతి రూపాయికి లెక్క ఉంది. ప్రతి పైసా ప్రజలకు అవినీతి లేకుండా వారి ఖాతాలకు జమ అయింది. రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని  నవరత్నాలలో భాగముగా 26 సంక్షేమ పథకాలకు ఎస్సి, ఎస్టి, బీసి, పేద ,మధ్యతరగతి ప్రజలకు నేరుగా సుమారు రూ 2,05,109 కోట్లు డీబీటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది. దేశంలోనే కనీవినీ ఎరుగని విధంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తుంటే ప్రతిపక్షాలు కడుపు మంటతో అర్థం లేని వివర్శలు చేయడం శోచనీయం. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీ సిఫారసు మేరకు, రాజకీయ నాయకుడికి దగ్గరగా ఉన్న అనుకూల వర్గాల వారినే లబ్ధిదారులుగా ఎంచుకున్నారు. వారి లక్ష్యం స్వార్థపూరితం.. కావడం వల్ల అర్హత ఉన్నా కూడా ఫలాలు అందని పేద ప్రజలెందరో నాటి ప్రభుత్వ హయాంలో. కానీ ఇప్పుడు రాజకీయాలకు అతీతంగా, కేవలం అర్హత ఉన్న ప్రతి లబ్ది దారునికి కుల,మత, ప్రాంత,వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది. ఎవరి సిఫారసులు అక్కర లేదు.. కేవలం అర్హతే ప్రామాణికం.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, నిర్వహణ, అప్పులు, వడ్డీ, తలసరి ఆదాయం, ఎస్.డీ.జీ , డీ.బీ.టీ  ఇలా అన్నింటిలో వాస్తవాలు వేరు. యనమలగారు , చంద్ర బాబు నాయుడు గారి దుష్ప్రచారంలో చెప్పే లెక్కలు వేరు. పత్రికా ప్రకటనల్లో రాసే ప్రతి అక్షరం ఓ అబద్ధం.  అప్పులు, వడ్డీలు, తలసరి ఆదాయం, SDG, DBT లెక్కలపై సరైన అవగాహన లేకుండా ప్రభుత్వ ప్రతిష్టను అప్రతిష్టపాలు చేయడమే లక్ష్యంగా లెక్కలన్నీ పూర్తిగా కల్పితం. ప్రతిపక్ష నాయకులు, కొన్ని పత్రికలు స్వార్థంతో చేసిన కపట నాటకాలనడానికి.. పైన పేర్కొన్న వాస్తవ గణాంకాలే ఉదాహరణ. అని మంత్రి బుగ్గన అన్నారు.
చదవండి: వైఎస్సార్‌సీపీకి ఎవరూ నన్ను దూరం చేయలేరు: ఎమ్మెల్యే ఆర్కే

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement