ప్రశాంత్‌ కిషోర్‌ను ఏకిపారేసిన ఏపీ మం‍త్రి బొత్స | AP Minister Botsa Satyanarayana Counter To Prashant Kishor | Sakshi
Sakshi News home page

ప్రశాంత్‌ కిషోర్‌ను ఏకిపారేసిన ఏపీ మం‍త్రి బొత్స

Published Mon, Apr 8 2024 12:39 PM | Last Updated on Mon, Apr 8 2024 5:14 PM

AP Minister Botsa Satyanarayana Counter To Prashant Kishor - Sakshi

జగన్ లీడర్.. బాబు ప్రొవైడర్!

 పీకేవి.. ప్యాకేజీ మాటలు!

లీడర్‌కు, ప్రొవైడర్‌కు తేడా తెలుసుకుని విశ్లేషణలు చేయ్ పీకే..!

చంద్రబాబు మీద అంత ప్రేమే ఉంటే తాళం వేసుకో

ఏపీపై ఎవడో వాగితే మీకు హెడ్ లైన్సా.. ఏమిటీ నాన్సెన్స్

మేనేజ్‌మెంట్, మోసం, వెన్నుపోటు, బ్రోకరిజం బాబు మార్క్ రాజకీయం!

పురందేశ్వరి బుర్రను చంద్రబాబు మేనేజ్‌ చేస్తున్నాడేమో...!

ఐఏఎస్,ఐపీఎస్‌ల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా ఏమిటీ రాతలు రామోజీ!

ఎన్నికల నిర్వహణ మార్గదర్శి మేనేజర్లుకు అప్పగించాలంటావా, ఏంటి!?

మంత్రి బొత్స సత్యనారాయణ చురకలు

సాక్షి, విశాఖపట్నం: ప్రముఖ ఎన్నికల మాజీ వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌(పీకే)పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు కోసమే ప్రశాంత్‌ కిషోర్‌ ఏపీ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడని, లీడర్‌ అంటే ప్రజల దృష్టిలో వైఎస్‌ జగన్‌ అనే విషయాన్ని గుర్తించాలని పీకేకు మంత్రి బొత్స హితవు పలికారు.  విశాఖలో సోమవారం మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ..

దేశంలో అన్నింటా ముందజలోనే ఏపీ
దేశంలోనే ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారి నాయకత్వంలో గత ఐదేళ్లల్లో అన్నిరంగాల్లోనూ ముందుంది. గౌరవ ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత,  విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశ్రామిక రంగం ఇలా అన్నిరంగాల్లోనూ చేపట్టి విప్లవాత్మక సంస్కరణల ఫలితం రాష్ట్ర అభివృద్ధి సూచికలను నిర్దేశిస్తున్నాయి. నీతి అయోగ్‌ విశ్లేషణ, కేంద్ర నివేదికలు, జీడీపీలోనూ ఎందులో చూసినా, గతంలో 17 నుంచి 18 స్థానాల్లో ఉండే రేటింగ్‌ ఇప్పుడు 4, 5 స్థానాలకు వచ్చింది. గత ఐదేళ్లలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వ పరిపాలనాతీరే ఇందుకు ప్రధాన కారణం. రాష్ట్రంలోని సామాన్య, మధ్యతరగతి వర్గాల అభివృద్ధికి ఫోకస్డ్‌గా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ప్రజల కొనుగోలు శక్తి పెరుగుదల ఇవన్నీ రాష్ట్ర పురోగతి సూచికలను తెలియజేస్తున్నాయి. 

జగన్‌ రియల్‌ లీడర్‌.. బాబు ప్రొవైడర్
ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) అనే రాజకీయ వ్యూహకర్త ఏపీ అభివృద్ధి గురించి ఏదేదో పిచ్చిపట్టినట్టు మాట్లాడారని ఇవాళ పత్రికల్లో చూశాను. ఆయన వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గారు ఒక లీడర్‌. కాగా.. లీడర్‌కు, ప్రొవైడర్‌కూ తెలియని వ్యక్తి పీకే. లీడర్, ప్రొవైడర్‌కు తేడా అంటే ఏంటో నన్నడిగితే నేను సమాధానమిస్తా పీకే..?.

ప్రజలకు సంబంధించిన అంశాలను దీర్ఘకాలికమైన వ్యూహంతో ఆలోచన చేసి విప్లవాత్మక సంస్కరణలతో అమలు చేసేవాడిని లీడర్‌ అంటారు. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి నూటికి నూరుపాళ్లూ చేస్తున్నది అదే. అందుకే, ఆయన్ను లీడర్‌గా ప్రజలంతా ఆరాధిస్తున్నారు. 

అదే పీకే చెబుతున్న ప్రొవైడర్‌ ఎవరంటే, అది చంద్రబాబు నాయుడు. ఆయన తన హయాంలో చేసిందంతా మేనేజ్‌మెంట్‌. బ్రోకరిజం. అలాంటి పనులు చేసేవాడ్ని ప్రొవైడర్‌ అంటారు. కాబట్టే, గత ఐదేళ్లకు ముందున్న అభివృద్ధి పారామీటర్స్‌ కంటే ఈ ఐదేళ్లలో మారిన పారామీటర్లే ఇందుకు నిదర్శనం.  

పావర్టీలైన్, జీడీపీ ఏం చెప్పాయో చూడు పీకే..?
చంద్రబాబు హయాంలో ఉన్నటువంటి పేదరిక శాతం ఎంత..? ఇప్పుడెంత ఉంది..? పావర్టీలైన్‌ తెలుసుకో..విద్యలో ఇవాళ ఏపీ కేరళ రాష్ట్రాన్ని అధిగమించిన సంగతి వాస్తవమా..?కాదా..? జీడీపీ అంశం తీసుకుంటే 16వ స్థానం నుంచి 4వ స్థానానికి వచ్చింది నిజం కాదా..? నిజమైన అభివృద్ధి జరగకపోతే, ఇవన్నీ ఎలా వస్తాయి..? పాతాళభైరవి సినిమాలో మాదిరిగా మంత్రం వేస్తే వస్తాయా..?. పీకే.. నువ్వు చంద్రబాబుకు తాళం కొట్టుకోవాలంటే కొట్టుకో.. మాకేంటి అభ్యంతరం..? ఆయన్ను ఇంద్రుడు చంద్రుడని పొగుడుకో.. కానీ, నీ భాష మీద మాత్రం పట్టుండాలని తెలుసుకో.. లీడర్‌కూ ప్రొవైడర్‌కు తేడా తెలియకుండా మాట్లాడటం మంచిది కాదు.

పీకేవి.. ప్యాకేజీ మాటలు
పీకేకు మీడియా ద్వారా చెబుతున్నదేమంటే, నీకు చంద్రబాబు మీద అభిమానం ఉంటే నీ తాళం, బాజాభజంత్రీలు బహిరంగంగా వాయించుకో.. అంతేగానీ, వారి అసమర్ధతను మా నాయకుడిపై రుద్దితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సహించరు గారు సహించరు. నీ మాటల్ని ఖండిస్తున్నాం. చంద్రబాబులా అక్కడా ఇక్కడా మధ్యవర్తిత్వం చేసి మేనేజ్‌మెంట్లతో పొత్తులు పెట్టుకునే దౌర్భాగ్యం జగన్‌మోహన్‌ రెడ్డి గారికి లేదు. అలాంటి పరిస్థితి ఎప్పటికీ రాదు. ఆయన రియల్‌ లీడర్‌. అందుకే, అంత ధైర్యంగా, మీకు మంచి జరిగితేనే.. భవిష్యత్తుపై మీకు నమ్మకం ఉంటేనే నన్ను మరోసారి దీవించాలని రాష్ట్ర ప్రజలను కోరుతున్నారు. నువ్వు ప్యాకేజీకి ఆశపడి చంద్రబాబుకు ఎన్నికల్లో లబ్ధి చేకూర్చాలని, నువ్వెంత ఆరాటపడినా.. దుష్ప్రచారం చేసినా ఈ రాష్ట్ర ప్రజలు అంత అమాయకులేమీ కాదు.

బీహార్‌ ప్రజలు నిన్నెందుకు తరిమారు..?
 అసలు, ఆంధ్ర రాష్ట్రం గురించి ఏమనుకుంటున్నావు..? నీ ఉద్దేశంలో నీకు ప్యాకేజీ ఇచ్చినోడే నీకు ఇంద్రుడు.. చంద్రుడా..? నువ్వు బీహార్‌ను పరిపాలిస్తానని పాదయాత్ర చేశావుగా.. నిన్నెందుకు పనికిరావని అక్కడి ప్రజలు పక్కకు తరిమారు..? నీలాంటి బ్రోకర్లును పెట్టుకుని నాయకుడిగా ఎన్నుకోవడానికి ప్రజలేం అమాయకులనుకుంటున్నావా..? బీహార్‌ నుంచి నిన్నెందుకు తరిమేశారో సమాధానం చెప్పు. చంద్రబాబు లాగా అన్ని పోసుకోలు మాటలు మాట్లాడటం పరిపాలన కాదు. మేనేజ్‌మెంట్‌ చేసేవాళ్లను, బ్రోకర్లను ప్రజలు భరించలేరు గనుకే ఓడించి ఇంటికి పంపుతారు. 

మాటిచ్చి నిలుపుకోవడమే జగన్‌ నాయకత్వ లక్షణం
రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి గానీ.. ప్రజల సంక్షేమం గురించైనా వాగ్దానాలు చేయడం ఈజీనే. అమలు చేయడమే చాలా కష్టం. మాట ఇవ్వడం ఈజీనే.. ఇచ్చిన మాట నిలబెట్టుకుని ఆచరణలో చూపడమే చాలా కష్టం. అదే మా జగన్‌మోహన్‌రెడ్డి గారు ఏదైతే చెబుతారో.. దాన్ని చేసి చూపి ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటారు గనుకే ప్రజా నాయకుడయ్యారు. అదే, జగన్ గారి నాయకత్వంలో ఉన్న ముఖ్య లక్షణం. అదే ఆయనలో ఉన్న బ్యూటీ ఆఫ్ సీక్రెట్‌. కాబట్టే.. ఇవాళ రాష్ట్రంలో ఏ రంగం చూసినా, పురోగతి బాటలో నడుస్తూ కనిపిస్తోంది. 

ఏపీపై ఎవడో వాగితే మీడియాలో ప్రధాన శీర్షికలా..?
ఆంధ్ర రాష్ట్రం గురించి ఎవడుబడితే వాడు వాగడం.. వాటిని పత్రికల్లో ప్రధాన శీర్షికలుగా ప్రచురించడం.. ఏంటీ ఈ నాన్సెన్స్‌..? పాత్రికేయ సోదరులకూ, ఆయా పత్రికల యాజమాన్యాలకూ రాష్ట్ర జీడీపీ, పావర్టీలైన్, విద్య, వైద్యం, వ్యవసాయంపై నీతిఅయోగ్‌ నివేదికలు ఇవన్నీ తెలియవా ..? అవన్నీ అధికారికంగా కనిపించే అంశాలే కదా..? వాటిని ఎవరు తారుమారు చేసి ప్రచారం చేసుకుంటారు...? కనుక, ఎవడో వాగిన వాంతిని పత్రికల్లో ప్రధాన శీర్షికలతో పెట్టి దుష్ప్రచారం చేయడం ఎంత వరకు సబబు..? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలను అవమానించినట్టేనని భావిస్తున్నాను.  
   
ప్రజలకు భరోసానిచ్చే లీడర్‌ జగన్‌
లీడర్‌ అంటే ఒక స్థైర్యం, ఒక ధైర్యం, ఓటేసే ఓటరుకు ఒక భరోసా.. అది ఈ రాష్ట్రంలో జగన్‌మోహన్‌రెడ్డి గారు కల్పించారు. అదే లీడర్‌ అంటే ఒక మాయ, ఒక మేనేజ్‌మెంట్, ఒక మోసం, ఒక వెన్నుపోటు కాదు. అవన్నీ చేసే బ్రోకర్‌ చంద్రబాబు నాయుడు. సో, అందరూ వీరిద్దరి మధ్య తేడా  ఏంటనేది ఆలోచించాలి. ఆయా వ్యక్తుల పరిపాలనా తాలూకూ వాస్తవాలే వారేంటో చెబుతాయి..? చంద్రబాబు హయాంలో అభివృద్ధి సూచికలు ఎలా ఉన్నాయి..? దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పరిపాలనలో ఎలా ఉన్నాయి..? ఇప్పుడు జగన్‌ గారు అధికారంలో ఎలా ఉన్నాయో తేడా చూసుకోమనండి..? వాస్తవాల ఆధారంగా మాట్లాడితే ఏపీకి నిజమైన నాయకుడు ఎవరనేది తెలుస్తోంది. 

ఐఏఎస్, ఐపీఎస్‌ల ఆత్మస్థైర్యం దెబ్బతీయడం ధర్మమా..?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి బుర్రను చంద్రబాబు మేనేజ్‌ చేస్తున్నారా...? లేక ఆమెనే స్వంతంగా ఆలోచించి పిచ్చిపనులు చేస్తుందా..? రాష్ట్రంలో 22 మంది ఐపీఎస్‌లపై అవినీతి బురద జల్లి వారిని మార్చాలం టూ ఎలక్షన్‌ కమిషన్‌కు లేఖ రాస్తుందా..? బుద్ధుందా..? పూర్తి అసత్య నిరాధారమైన ఆరోపణలతో అంతమంది ఐపీఎస్‌లను చిన్నబుచ్చడం సంస్కారమేనా..? మొన్నటిదాకా వాలంటీర్లపై టార్గెట్‌ పెట్టి చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరి నోటికొచ్చిందల్లా వాగడం.. ఎల్లోమీడియా వాటిని హైలెట్‌ చేయడం, వారిపై లేఖలు రాయడం జరిగింది. మొత్తానికి పింఛన్ల పంపిణీకి వాలంటీర్లను దూరం చేసి ఆ మూడు పార్టీలు గోతిలో పడ్డాయి.

ప్రజాగ్రహం దెబ్బకు తాము చేసిన తప్పిదానికి చెంపలు వాయించుకోలేక, ఇప్పటికీ వారి ఎల్లోమీడియాలో ఏవేవో సాకులు రాయించుకుంటున్నారు. సచివాలయాల సిబ్బంది, వాలంటీర్లంటే జగన్‌ గారి హయాంలో నియామకమైనోళ్లు కాబట్టి మీరు హడావిడి చేశారనుకుందాం. మరి, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను టార్గెట్‌ చేస్తున్నారంటే.. వారు కూడా జగన్‌మోన్‌రెడ్డి గారి హయాంలోనే అపాయింట్‌మెంట్‌లు తీసుకున్నారని మీరు అనుకుంటున్నారా..? వాళ్ల సర్వీసులో చాలామంది చంద్రబాబు హయాంలోనూ పనిచేసిన వారే కదా..? మరి, మీ పట్ల అంత అంకితభావం లేకుండా.. జగన్‌గారి పట్ల అంకితభావం ఉండటానికి గల కారణమేంటి..? ఒక ప్రతిష్టాత్మకమైన ఐఏఎస్, ఐపీఎస్‌ వ్యవస్థను చులకనగా చూడటం భావ్యమా..? దానికి కొన్ని పత్రికలు పుంఖాను పుంఖానులుగా కథనాలు రాయడం ధర్మమా..?అది ఆ అధికారుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కాదా..? 

ఎన్నికల నిర్వహణ మార్గదర్శి మేనేజర్లకు అప్పగించాలని లేఖ రాసుకోండి
ఈనాడు యాజమాన్యానికి నేను చెప్పినట్టు, నాదొక సలహా చెప్పండి. చంద్రబాబు, పురందేశ్వరిల చేత ఎలక్షన్‌ కమిషన్‌కు ఓ లేఖ రాయించుకోండి. ఈ రాష్ట్రంలో ఏ ఒక్క వ్యవస్థ, ప్రభుత్వ సర్వీసు అధికారులపై మాకు నమ్మకం లేదు. కనుక, ఎన్నికల ప్రక్రియను మాకోసం ఈనాడు, మార్గదర్శి మేనేజర్లతోనే నిర్వహించమని కోరండి. ఒక్కో జిల్లా ఎన్నికల బాధ్యతను ఒక్కో మేనేజర్‌కు అప్పగించి జరుపుకోండి.

బూత్‌లలో ఎక్కడైనా తప్పు జరిగితే ప్రజలే మిమ్మల్ని ఈడ్చి ఈడ్చి కొట్టి బయట పారేస్తారు. ఎన్నికలంటే, చంద్రబాబు, పురందేశ్వరి, ఈనాడు, ఆంధ్రజ్యోతికి అంత ఆటలుగా ఉందా..? ప్రజాస్వామ్యంలో ఎన్నికల యంత్రాంగం పట్ల మీరు మరీ అంత నమ్మకం లేకుండా ఉండటం సరికాదు. అదే మా నాయకుడు జగన్‌గారికి, వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులపై, వ్యవస్థలపై, ప్రజలపై నమ్మకం ఉంది. గౌరవం ఉంది. చంద్రబాబు, పవన్‌కళ్యాణ్, పురందేశ్వరితో ఎల్లోమీడియా ఇప్పటికైనా తాము చేస్తున్న తప్పులేంటో తెలుసుకుని ఐపీఎస్‌లు, ఐపీఎస్‌లుకూ, ప్రజలకు క్షమాపణలు చెప్పి, ఇకనైనా బుద్ధిగా నడుచుకోవడం మేలు... అని మంత్రి బొత్స సత్యనారాయణ హితవు పలికారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement