చిత్తూరు, సాక్షి: ఏపీలో రాజకీయాలు ఊహించిన దానికంటే శరవేగంగా మారుతున్నాయి.. ఒక్క పొత్తులో సీట్ల పంపకం విషయంలో తప్ప!. తాజాగా కుప్పం నుంచి టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు పోటీ చేయడానికే జంకుతున్నారనే చర్చ నడుమ.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన అంశం తెరపైకి వచ్చింది. ఆయన రాష్ట్ర రాజకీయాలకే పూర్తిగా దూరం అవుతారనే టాక్ ఒకటి నడుస్తోంది.
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం. టీడీపీకి, చంద్రబాబు నాయుడికి కంచుకోటలా ఉంటూ వస్తోంది. 1989 నుంచి వరుసగా ఏడుసార్లు ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చంద్రబాబు నెగ్గుతూ వచ్చారు. అయితే ఈసారి మారిన రాజకీయ సమీకరణాలు ఆయనలో ఆందోళన రేకెత్తిస్తున్నాయి. కుప్పంలో ఓడిపోతానని భయం ఆయనకు పట్టుకుంది. అందుకు కారణం.. సీఎం జగన్ ఈ నియోజకవర్గం అభివృద్ధిపై దృష్టిసారించడం. దీంతో.. ఆయన మరో నియోజకవర్గానికి షిఫ్ట్ అవుతారనే ప్రచారం జోరుగా నడుస్తోంది. ఈ క్రమంలో తెరపైకి వచ్చిందే పెనమలూరు స్థానం.
కృష్ణా జిల్లా పెనమలూరు స్థానంలో 2009లో కాంగ్రెస్, 2014లో టీడీపీ నెగ్గాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో సాగిన జన ప్రభంజనంతో వైఎస్సార్‌సీపీ ఇక్కడ ఘన విజయం సాధించింది. ఇప్పుడు.. మిగతా నియోజకవర్గాల్లో మాదిరే ఇక్కడా టీడీపీలో వర్గపోరు ఉన్నా.. మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత నియోజకవర్గ ఇంఛార్జి బోడే ప్రసాద్‌కే టికెట్ కేటాయిస్తారంటూ తొలి నుంచి ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇప్పుడు చంద్రబాబు ఈ స్థానంపై కన్నేసినట్లు సమాచారం.
నాయుడుగారూ.. ఇంకెన్నిరోజులు?: ఢిల్లీ అధిష్టానం!
పొలిటికల్ సర్కిల్స్ సమాచారం మేరకు.. బీజేపీతో పొత్తుల చర్చల కోసం టీడీపీ అధినేత మొన్నామధ్య ఢిల్లీ వెళ్లారు. అయితే అక్కడి అధిష్టానం ఆయన్ని రాష్ట్ర రాజకీయాల నుంచి రెస్ట్ తీసుకోమని చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘ఏపీలో టీడీపీ గెలిచే పరిస్థితులు లేవు. మీ వయసు డెబ్భై ఏళ్లు దాటింది. ఇంకెంత కాలం కష్టపడుతారు. పైగా అవినీతి కేసులు చుట్టుముట్టాయి. ఇలాంటి టైంలో వయసురిత్యా రాష్ట్ర రాజకీయాలకు స్వచ్ఛందంగా దూరం జరగండి. కావాలంటే జాతీయ రాజకీయాల వైపు రండి’’ ఆయనకు ఢిల్లీ పెద్దలు సూచించారట. శరద్ పవార్, దేవగౌడ.. ఇలా వయసు మళ్లిన కొందరు నేతల పేర్లను సైతం ఉదాహరించినట్లు కూడా తెలుస్తోంది. అందుకే కుప్పం నుంచి ప్యాకప్ చేసుకోవడంతో పాటు పూర్తిగా.. ఏపీ రాజకీయాలకు చంద్రబాబు గుడ్‌బై చెప్పాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అంతటి అవమానం కంటే ముందు.. అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఆయన భావిస్తున్నారట!.
పెనమలూరులో పోటీ కోసం చంద్రబాబు నాయుడు తొలి నుంచి ఆసక్తి కనబరుస్తున్నారు. ఎన్టీఆర్ సొంత జిల్లా కృష్ణాలో టీడీపీ అభిమానులు ఎక్కువే. పైగా పెనమలూరు సెగ్మెంట్‌లో కమ్మ వర్గ ప్రాబల్యం ఎక్కువగా ఉండడం కూడా చంద్రబాబు ఆసక్తికి మరో కారణంగా స్పష్టమవుతోంది. కానీ, ఆ విషయాన్ని బయటపడనివ్వలేదని అర్థమవుతోంది. ఎందుకంటే.. వర్గ పోరు మరీ ఎక్కువగా ఉంది. అందుకే బోడే ప్రసాద్‌ను ఆ వరుసలో ముందు నిల్చోబెట్టారు. చివరకు ఐవీఆర్‌ఎస్ సర్వేలో వ్యతిరేక ఫలితం వచ్చిందని చెబుతూ బోడేను పక్కన పెట్టేశారు. ఇక్కడా చంద్రబాబు తన వెన్నుపోటు బుద్ధిని ప్రదర్శించారు. స్కిల్ కేసులో జైలుకు వెళ్లిన సమయంలో.. బోడే తనకు సంఘీభావంగా దీక్ష సైతం చేపట్టిన సంగతిని సైతం చంద్రబాబు విస్మరించారు.
Comments
Please login to add a commentAdd a comment