సాక్షి, ఢిల్లీ: ‘‘చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు మీకు తెలియంది కాదు.. ఆ రాజకీయానికి ఏపీలో మరోసారి మన పార్టీని బలి చేయొద్దు.. ప్లీజ్’’ అంటూ బీజేపీ సీనియర్లు అధిష్టానం వద్ద మొరపెట్టకుంటున్నారు. అయితే అధిష్టానం వాళ్లకు ఎలాంటి హామీ ఇచ్చిందన్నదానిపై మాత్రం స్పష్టత రావాల్సి ఉంది.
ఏపీ బీజేపీలో టికెట్ల లొల్లి ముదురుతోంది. ఇప్పటికే టికెట్ల కోసం ఆ పార్టీ నేతలు ఢిల్లీలో పాగా వేశారు. నిన్న(మంగళవారం) సాయంత్రానికే అభ్యర్థుల జాబితా ప్రకటన ఉంటుందని పార్టీ శ్రేణులు ప్రకటించినప్పటికీ.. సీనియర్లు అధిష్టానం పెట్టడం పంచాయితీ పెట్టడంతో అది నిలిచిపోగా.. మరో రెండ్రోజులపాటు ఈ సస్పెన్స్ కొనసాగనుంది.
పార్టీలో బయటి నుంచి వచ్చినవాళ్లను కాకుండా.. మొదటి నుంచి కష్టపడుతున్నవాళ్లనే పరిగణనలోకి తీసుకోవాలని బీజేపీ సీనియర్లు ఢిల్లీ పెద్దలను కోరుతున్నారు. ఈ క్రమంలో.. చంద్రబాబు తన అనుచరగణంగా పేరున్న సీఎం రమేష్, సుజనా చౌదరి, మరో నేత రఘురామకృష్ణంరాజులతో నడిపిస్తున్న లాబీయింగ్‌లను వివరించే యత్నం చేశారు. అదే సమయంలో దగ్గుబాటి పురందేశ్వరి స్వయంగా రిఫర్ చేసిన కొత్తపల్లి గీత వ్యవహారాన్ని కూడా వివరించినట్లు తెలుస్తోంది.
ఢిల్లీలోనే ఉన్న సీఎం రమేష్, సుజనా చౌదరిలు ఎంపీ టికెట్ల కోసం తీవ్రంగా లాబీయింగ్‌లు చేస్తున్నారు. అనకాపల్లి సీటు కోసం సీఎం రమేష్ అధిష్టానంపై ఒత్తిడి చేస్తుండగా.. ఏలూరు స్ధానం కోసం సుజనా చౌదరి ప్రయత్నిస్తున్నారు. మరోవైపు నరసాపురం ఎంపీ స్థానం ఢిల్లీ పెద్దల చుట్టూ రఘురామకృష్ణంరాజు ప్రదక్షిణలు చేస్తున్నారు. రఘురామ చంద్రబాబు కోసం పని చేసే మనిషంటూ సీనియర్లు ఫిర్యాదులు చేయడంతో.. బీజేపీ అధిష్టానం సైతం ఆయనకి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. అయినప్పటికీ రఘురామ మాత్రం నరసాపురం తనదేనంటూ ప్రకటనలు ఇస్తుండడం గమనార్హం. ఇదిలా ఉంటే.. జీవీఎల్ మాత్రం విశాఖ సీటు కోసం గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.
మరోవైపు దగ్గుబాటి పురందేశ్వరి ఢిల్లీ వెళ్లడం.. విశాఖ ఎంపీ సీటు కోసం కొత్తపల్లి గీత పేరును సిఫార్సు చేశారనే ప్రచారం నేపథ్యంలో సీనియర్లు అప్రమత్తం అయ్యారు. అధిష్టానానికి ఆమె ట్రాక్ గురించి వివరించారు. కొత్తపల్లి గీత 2014లో వైఎస్ఆర్సిపీ అరకు ఎంపీగా గెలిచి పార్టీ ఫిరాయించారు. గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ సీటుకు పోటీ చేసి ఆమె ఎంత దారుణంగా ఓడిందో (కేవలం 1,159 సీట్లు) గుర్తు చేశారు. ఎన్నికల సంఘం గుర్తించని జన జాగృతి అనే పార్టీని బీజేపీలో విలీనం చేసినట్టు చెప్పి.. టికెట్‌కు లాబీయింగ్ చేశారు. గీత సామాజిక వర్గంపై ఇప్పటికే గిరిజన సంఘాల ఫిర్యాదు చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఇదంతా పురందేశ్వరి తన స్వలాభం కోసమే చేస్తున్నారు వివరించారు. దీంతో.. కేసులు ఉండడంతో గీత పేరును.. బీజేపీ అధిష్టానం ఆమె పేరును పరిశీలన నుంచి పక్కకు పెట్టిందని సమాచారం అందుతోంది.
ఈ సందర్భంలో వైఎస్సార్‌సీపీ అనుసరిస్తున్న పద్ధతిని సైతం బీజేపీ సీనియర్లు ఢిల్లీ పెద్దలకు వివరించినట్లు తెలుస్తోంది. నరసాపురంలో వైఎస్సార్‌సీపీలో మొదటి నుంచి ఉన్న సామాన్య కార్యకర్తకే వైఎస్సార్‌సీపీ ఎంపీ సీటు ఇచ్చిందని.. బీజేపీ కూడా అలాంటి నిర్ణయం తీసుకోవాలని వాళ్లు కోరినట్లు తెలుస్తోంది. దీంతో.. బీజేపీలో మొదటి నుంచి ఉన్న శ్రీనివాస వర్మ పేరు ఇప్పుడు తెరపైకి వచ్చింది.
టీడీపీ లీకులపై ఏపీ బీజేపీ గుర్రు
టీడీపీ-జనసేనలతో పొత్తులో భాగంగా.. 10 అసెంబ్లీ స్థానాలు, 6 లోక్‌సభ స్థానాలు తీసుకుంది ఏపీ బీజేపీ. అయితే అభ్యర్థుల్ని మాత్రం ఇంతదాకా ప్రకటన చేయలేదు. మరోవైపు టీడీపీ సైతం ఎంపీ సీట్లను ప్రకటించడం లేదు. అయితే ఇక్కడా చంద్రబాబు తన దుష్ట రాజకీయం ప్రదర్శించారని బీజేపీ సీనియర్లు(అసలు వర్గం) వాపోతున్నారు.
‘అనకాపల్లి, అరకు, ఏలూరు/నరసాపురం, రాజంపేట, హిందూపూర్, తిరుపతి స్ధానాలు బీజేపీవేనంటూ టీడీపీ శ్రేణుల చేత బాబు లీకులు ఇప్పిస్తున్నారు. దీంతో బీజేపీ నేతలు మండిపడుతున్నారు. గెలిచే స్థానాలు తీసుకుందామంటూ ఇప్పటికే బీజేపీ సీనియర్లు బీజేపీ అధిష్టానానికి స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు నేడు బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ భేటీలోనే ఎంపీ అభ్యర్థుల ఎంపిక ఉండొచ్చని బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.
ఏపీ బీజేపీ అసెంబ్లీ స్థానాలు.. చంద్రబాబు చిచ్చు ఇలా..
- బిజెపికి ఓడిపోయే సీట్లని కేటాయించేలా చంద్రబాబు వ్యూహం
- బీజేపీకి టీడీపీ కేటాయిస్తున్న సీట్లు- శ్రీకాకుళం, విశాఖ నార్త్ , కైకలూరు, పాడేరు, అనపర్తి, విజయవాడ వెస్ట్, బద్వేల్, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని స్ధానాలుగా ప్రచారం
- బీజేపీ అడుగుతున్న సీట్లు-విశాఖ జిల్లాలో రెండు స్ధానాలు విశాఖ నార్త్/ పాడేరు/ చోడవరం లేదా మాడుగుల, తూర్పు గోదావరి జిల్లాలో రెండు స్ధానాలు పి.గన్నవరం, రాజమండ్రి, ఉమ్మడి కృష్ణా జిల్లాలో రెండు స్ధానాలు కైకలూరు, విజయవాడ సెంట్రల్, గుంటూరులో ఒక స్ధానం, రాయలసీమ నుంచి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి
- బీజేపీ అడిగిన స్ధానాలలో చోడవరం, మాడుగుల రాజమండ్రి సిటీ, పి.గన్నవరం, విజయవాడ సెంట్రల్, కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి.. ఎనిమిది స్ధానాలలో ఇప్పటికే అభ్యర్ధులని ప్రకటించిన టీడీపీ
- చోడవరం లేదా మాడుగుల స్ధానాలు కోరిన బిజెపి...నిన్న ఏకపక్షంగా ఆ స్ధానాలు ప్రకటించిన చంద్రబాబు
- పాడేరు అసెంబ్లీ స్ధానాన్ని బిజెపికి కేటాయించిన చంద్రబాబు
- రాజమండ్రి స్ధానాన్ని టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని భర్త వాసుకి కేటాయించి అనపర్తిని బిజెపికి అంటగట్టిన చంద్రబాబు
- అనపర్తిలో బిజెపికి అర్బన్ అధ్యక్షుడు కూడా లేడంటున్న బీజేపీ నేతలు
- విజయవాడ సెంట్రల్ అడిగితే విజయవాడ వెస్డ్ కేటాయించిన చంద్రబాబు
- జనసేన నేత పోతిన మహేష్ ఆశలకి గండి కొడుతూ విజయవాడ వెస్ట్ బిజెపికి కేటాయింపు
- కదిరి, శ్రీకాళహస్తి, మదనపల్లి స్ధానాలు ఇవ్వాలని పట్టుబట్టిన బిజెపి...
- బిజెపికి మొండిచేయి చూపి కదిరి, మదనపల్లి, శ్రీకాళహస్తి స్ధానాలని ప్రకటించిన చంద్రబాబు
- హిందూపూర్ లోక్ సభ స్ధానం కోసం విష్ణువర్దన్ రెడ్డి ఆశలు.. లేకపోతే కదిరి అసెంబ్లీ అయినా వస్తుందని భావింవిన విష్ణువర్దన్ రెడ్డి
- చంద్రబాబు రాజకీయంతో విష్ణువర్దన్ రెడ్డి ఆశలపై నీళ్లు
- కదిరిపై ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్ధసారధి మరియు ఆయన తనయుడు యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా వంశీ లకి నిరాశే
- కడప పార్లమెంట్ లో బద్వేలు, జమ్మలమడుగు రెండు అసెంబ్లీ స్ధానాలు బిజెపికి
- బద్వేలు ఉప ఎన్నికలలో డిపాజిట్ కూడా రాలేదని గుర్తు చేస్తున్న బిజెపి సీనియర్లు
- బద్వేలులో టీడీపీకి అభ్యర్ధి లేక బిజెపికి కేటాయింపు
- టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వరదాపురం సూరి కోసం ధర్మవరం, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి కోసం జమ్మలమడుగు సీట్లు బిజెపికి కేటాయించిన చంద్రబాబు
- ఈ ఇద్దరు నేతలు చంద్రబాబు బి టీమ్ అంటూ బిజెపి అధిష్టానానికి సీనియర్ల ఫిర్యాదులు
- రెండున్నర దశాబ్దాలగా టీడీపీ ఓడిపోతున్న సీట్లన్నీ బిజెపికే
- చంద్రబాబు కుటిల రాజకీయాలపై మండిపడుతున్న బిజెపి
- ఢిల్లీలో శివప్రకాష్ జీ కి ఫిర్యాదు చేసిన బిజెపి సీనియర్లు
- కొన్ని సీట్లు మార్చాలంటూ టీడీపీపై ఏపీ బీజేపీ ఒత్తిళ్లు
Comments
Please login to add a commentAdd a comment