అరాచకాల వెనుక చంద్రబాబు, పురందేశ్వరి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పిరెడ్డి వెల్లడి
సాక్షి, అమరావతి: ‘ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ముందెన్నడూ ఎరుగని రీతిలో ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో దాడులు, అల్లర్లు జరిగాయి, ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, ఇందుకు కారణాల్ని పరిశీలిస్తే.. ఈ దాడుల వెనుక చంద్రబాబు, ఆయన వదిన పురందేశ్వరి ధ్వంసరచన కుట్రే కనిపిస్తోందని’.. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శాసనమండలి విప్ లేళ్ల అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘టీడీపీ రౌడీమూకలంతా రాజ్యాంగ విలువలను, ప్రజాస్వామ్య సూత్రాల్ని పక్కనబెట్టి యథేచ్ఛగా బరితెగించి దాడులకు దిగాయి.
ఈ మూకలు అంతగా రౌడీయిజం చెలాయిస్తూ, వైఎస్సార్‌సీపీ కేడర్‌ను లక్ష్యంగా చేసుకుని దౌర్జన్యాలు చేస్తున్నా, పోలీసుయంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాం.. చంద్రబాబు, పురందేశ్వరి కలిసి ఎన్నికల కమిషన్, పోలీసు యంత్రాంగం ద్వారా ఎన్నికల ప్రక్రియను అడ్డగోలుగా తమకు అనుకూలంగా చేసుకోవడానికి ప్రయత్నించారన్నది ఈసీ చర్యలతో రుజువైందని’.. అప్పిరెడ్డి వివరించారు. ‘ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల టార్గెట్‌గా జరిగిన పెత్తందార్ల దాడులివి.
వదిన మరుదులు పురందేశ్వరి, చంద్రబాబుల ధ్వంసరచన కుట్రకు ఐఏఎస్, ఐపీఎస్‌లు బలయ్యారు. పోలీసులే పాత్రధారులుగా తాడిపత్రి, నరసరావుపేట దుర్ఘటనలు జరిగాయి. కేంద్ర పోలీసు పరిశీలకుడు దీపక్‌మిశ్రా కనుసన్నల్లోనే ఈ దాడులు జరిగాయి. మేం అధికారంలోకి రాగానే తప్పుడు అధికారులపై చర్యలుంటాయి..’ అని అప్పిరెడ్డి హెచ్చరించారు. ‘సీఎం జగన్ నాయకత్వమే మళ్లీ రావాలని పేదలు కోరుకున్నారని ఆ వర్గాన్నే టార్గెట్ చేసి దాడులు చేయడం భావ్యమేనా?
ఇప్పటికైనా ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి పనిచేయాలని కోరుతున్నాం. మేము అధికారంలోకి రాగానే విలువల్ని తుంగలో తొక్కి చంద్రబాబు ట్రాప్‌లో పడి, ఆయన కోసం పనిచేసిన వారందరినీ లెక్కగట్టి శాఖాపరమైన విచారణకు పిలిపిస్తాం. ఆధారాలతో సహా రుజువు చేసి వారిపై చర్యలు తీవ్రంగా తీసుకుంటామని హెచ్చరిస్తున్నాం..’ అని అప్పిరెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment