ఢిల్లీ: 2024 ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి పావులు కదుపుతోంది. రేపు ముంబయి వేదికగా 27 పార్టీలు భేటీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్ ఆద్మీ పార్టీ కీలక ప్రకటన చేసింది. 'ఇండియా' కూటమి తరుపున అరవింద్ కేజ్రీవాల్‌ను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది. ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా కేజ్రీవాల్ సరైన వ్యక్తి అంటూ ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక ఖక్కర్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
అరవింద్ కేజ్రీవాల్ దేశానికి ప్రయోజనం చేకూర్చే మోడల్‌ను తీసుకురాగలరని అన్నారు. తమ అభ్యర్థిగా కేజ్రీవాల్‌ను ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఆప్ ఢిల్లీ కన్వినర్ గోపాల్ రాయ్ కూడా ఈ అంశంపై స్పందించారు. కూటమిలో తాము కూడా భాగం అయినందున తమ అభ్యర్థిని ప్రధానిని చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ప్రతి పార్టీ తమ అభ్యర్థే పీఎం కావాలని ఆశించడంలో న్యాయం ఉంటుందని అన్నారు.
ఇండియా కూటమి భేటీ..
ఆగష్టు 31న ఇండియా కూటమిలోని దాదాపు 27 పార్టీలు ముంబయిలో భేటీ కానున్నాయి. ఈ సమావేశంలోనే అశోక చక్రంలేని ఇండియా జెండాను కూటమి జెండాగా ప్రకటించాలనే ప్రతిపాదన ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అలాగే కూటమిలో పార్టీల మధ్య విభేదాలను పక్కకు పెట్టే విధంగా విధివిధానాల రూపకల్పన కూడా చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు రెండు రోజులు చర్చలు జరగనున్నట్లు సమాచారం.
2024 ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కొనే దిశగా కాంగ్రెస్ సహా ప్రధాన ప్రతిపక్షాలు ఇండియా కూటమిగా ఒక్కటయ్యారు. ఇప్పటికే పాట్నాలో మొదటిసారి సమావేశమయ్యారు. ఆ తర్వాత ఇటీవల బెంగళూరు వేదికగా రెండోసారి సమావేశం ముగిసింది. ప్రస్తుతం ముంబయిలో ప్రధాన చర్చలు జరగనున్నాయి.
ఇదీ చదవండి: అధీర్ రంజన్ చౌదరి సస్పెన్షన్ రద్దు..
Comments
Please login to add a commentAdd a comment