న్యూఢిల్లీ:బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోపై ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్)అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. బీజేపీ మేనిఫెస్టోలోని హామీలన్నీ తమ నుంచి కాపీ కొట్టినవేనని ఎద్దేవా చేశారు. దీన్ని బట్టి బీజేపీకి విజన్ లేదని అర్థమవుతోందన్నారు. ఇక ప్రజలు ఇలాంటి విజన్ లేని పార్టీని ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు.
‘గతంలో పీఎం మోదీ ఉచితాలు మంచివి కావన్నారు. ఇప్పుడేమో బీజేపీ మా ఉచిత పథకాలన్నీ కాపీ కొట్టి మేనిఫెస్టోలో పెడుతోంది. ప్రధాని ఇప్పటికైనా ఉచితాలు మంచివేనని,కేజ్రీవాల్ పథకాలు సరైనవేనని ఒప్పుకోవాలి. ఉచితాలు దేవుడు పెట్టే ప్రసాదాలు.కేజ్రీవాల్ అమలు చేసిన పథకాలన్నీ కొనసాగుతాయని నడ్డా చెబుతున్నారు. మరి అలాంటప్పుడు మీకెందుకు ఓట్లేయాలి’అని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
కాగా, బీజేపీ ఢిల్లీ ఎన్నికల మేనిఫెస్టోను ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శుక్రవారం(జనవరి17) ఢిల్లీలో విడుదల చేశారు. ఈ మేనిఫెస్టోలో బీజేపీ ఢిల్లీ ప్రజలకు కీలక హామీలిచ్చింది. మహిళా సమ్మాన్ యోజన పేరిట మహిళలకు నెలనెలా రూ.2500 నగదు, సబ్సిడీపై గ్యాస్ సిలిండర్లు, గర్భిణీ మహిళలకు రూ.21వేలు ఇస్తామని ప్రకటించింది. అయితే ఇవన్నీ తమ పథకాలేనని కేజ్రీవాల్ అంటుండడం గమనార్హం.
ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుండగా 8వ తేదీ ఫలితాలు వెల్లడవుతాయి. ఈ ఎన్నికల్లో ఢిల్లీలో బీజేపీ, ఆమ్‌ఆద్మీపార్టీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ అంతగా ప్రభావం చూపబోదనే అంచనాలున్నాయి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని ఆప్ భావిస్తుండగా ఈసారి ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకోవాలని కృత నిశ్చయంతో బీజేపీ ఉంది.
ఇదీ చదవండి: బీజేపీ ఢిల్లీ మేనిఫెస్టోలో కీలక హామీలివే..
Comments
Please login to add a commentAdd a comment