సాక్షి,న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత మేనిఫెస్టోను బీజేపీ విడుదల చేసింది. శుక్రవారం(జనవరి17) ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా మేనిఫెస్టో విడుదల చేశారు. మహిళా సమృద్ధి యోజన పేరుతో ఢిల్లీలో అర్హులైన మహిళలకు ప్రతినెలా 2500 రూపాయలు ఇచ్చే స్కీమ్‌ను అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి కేబినెట్ భేటీలోనే ఆమోదిస్తామని తెలిపారు.
పేద మహిళలకు గ్యాస్ సిలిండర్‌పై 500 రూపాయల సబ్సిడీ ఇస్తామన్నారు. వీటితో పాటు మరిన్ని కీలక హామీలిచ్చారు. ఈ సందర్భంగా జేపీనడ్డా మాట్లాడుతూ ‘దేశ రాజకీయాల్లో సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మార్చారు. గతంలో మేనిఫెస్టోలు ప్రకటించేవారు ఆ తర్వాత వాటిని ప్రకటించిన వాళ్లు కూడా మర్చిపోయారు.
బీజేపీ ‘సంకల్ప పాత్ర’ పేరుతో మేనిఫెస్టోలను ప్రకటించడమే కాకుండా వాటిని నిజం చేసి చూపిస్తుంది. బీజేపీ చెప్పింది చేస్తుంది. చెప్పనిది కూడా చేసి చూపిస్తుంది. మోదీ గ్యారెంటీ..అమలయ్యే గ్యారంటీ.2014లో బీజేపీ ఐదు వందల హామిలిస్తే 499 హామీలు అమలు చేశాం.2019లో 235 హామీలిస్తే 225 అమలు చేశాం. మిగతా హామీలు అమలుచేసే ప్రయత్నంలో ఉన్నాయి.
బీజేపీ మేనిఫెస్టోలో కీలక హామీలివే..
- హోలీ, దీపావళి పండుగల సమయంలో అర్హులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్
- గర్భిణీ స్త్రీల కోసం 21000 రూపాయల సాయం
- ఢిల్లీ బస్తీల్లో 5 రూపాయలకే భోజనం అందించేందుకు అటల్ క్యాంటీన్ల ఏర్పాటు
ఆప్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ..!
కాగా, ఢిల్లీలో ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8న ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో అధికార ఆమ్‌ఆద్మీపార్టీ(ఆప్), బీజేపీ మధ్యే ప్రధాన పోరు జరగనున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పోటీలో ఉన్నప్పటికీ ముక్కోణపు పోరు ఉండబోదన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆప్ ప్రధాన స్కీమ్‌లను ప్రకటించింది. నెలనెలా మహిళలకు నగదు ఇచ్చే స్కీమ్‌తో పాటు 60 ఏళ్లు దాటిన వృద్ధులకు పూర్తి ఉచితంగా వైద్యం లాంటి జనాకర్షక పథకాలను ప్రకటించింది.
ఎన్నికల నేపథ్యంలో ఆప్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఢిల్లీ బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రచారం జరుగుతున్న రమేష్‌బిదూరి సీఎం అతిషితో పాటు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకగాంధీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. రమేష్ బిదూరి కల్కాజి నియోజకవర్గంలో సీఎం అతిషిపై పోటీ చేస్తున్నారు.
ఇదీ చదవండి: ‘సుప్రీంలో ‘ఆప్’ సర్కారుకు ఊరట
Comments
Please login to add a commentAdd a comment