జైపూర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు గడువు సమీపిస్తున్న కొద్దీ పార్టీలో వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఒకవైపు బుధవారం నోటిఫికేషన్ వెలువడనుంది. రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ (71) బరిలోకి దిగడం దాదాపు ఖాయమైంది. ఆయనకు పోటీగా తాజాగా తిరువనంతపురం ఎంపీ శశి థరూర్ కూడా తెరపైకి వచ్చారు. తాత్కాలిక అధినేత్రి సోనియాగాంధీ ఆశీస్సులతో గెహ్లాట్ సోమవారం నామినేషన్ వేయాలన్న నిర్ణయం కూడా అంతర్గతంగా జరిగిపోయింది. అయితే పోటీకి గెహ్లాట్ విముఖంగా ఉన్నారని హస్తిన రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. పార్టీ అధ్యక్షునిగా ఎన్నికై ఢిల్లీ వెళ్తే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది. అప్పుడు చిరకాల ప్రత్యర్థి సచిన్ పైలట్‌ను అధిష్టానం ముఖ్యమంత్రిని చేసే అవకాశముంది.
ఇది గెహ్లాట్‌కు సుతరామూ ఇష్టం లేదు. రాష్ట్రంపై పట్టు వదులుకోవడానికి ఆయన అస్సలు సుముఖంగా లేరట. రాహుల్ భారత్ జోడో యాత్రలో పాల్గొనేందుకు సచిన్ పైలట్ కేరళలో ఉన్నారు. ఈ సమయంలో గెహ్లాట్ ఉన్నట్టుండి మంగళవారం రాత్రి పదింటికి కాంగ్రెస్ శాసనసభాపక్షాన్ని సమావేశపరిచారు. పైలట్ గైర్హాజరీలో ఎమ్మెల్యేలపై తన పట్టును ప్రదర్శించుకోవడమే ఈ భేటీ లక్ష్యమని భావిస్తున్నారు. మధ్యేమార్గంగా సీఎంగా కొనసాగుతూనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పని చేస్తానంటూ అధిష్టానానికి ఆయన ప్రతిపాదించారట. కుదరని పక్షంలో కనీసం పైలట్‌కు బదులు తన విశ్వాసపాత్రున్ని సీఎం చేయాలని కోరుతున్నారట. ఇది అధిష్టానానికి కొత్త తలనొప్పిగా పరిణమించిందని సమాచారం. గట్టి నాయకుడైన పైలట్ సీఎంగా చాన్స్ దక్కనందుకు రెండేళ్ల క్రితమే పార్టీపై తిరుగుబావుటా ఎగురవేశారు. దాంతో సోనియా, రాహుల్ రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది. ఈసారి కూడా ఆయనకు అవకాశం ఇవ్వకపోతే అది రాష్ట్ర పార్టీలో సంక్షోభానికి దారి తీయవచ్చన్నది కాంగ్రెస్ పెద్దల ఆందోళన.
రాహులే అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని గెహ్లాట్ ఇప్పటికీ డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు రాజస్తాన్ పీసీసీతో తీర్మానం కూడా చేయించారు. దాంతో రాజస్తాన్ బాటలోనే పలు రాష్ట్రాల పీసీసీలు రాహుల్ సారథ్యాన్ని కోరుతూ తీర్మానాల బాట పట్టాయి. బుధవారం గెహ్లాట్ ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడి నుంచి కేరళ వెళ్లి రాహుల్ యాత్రలో పాల్గొనే అవకాశముంది. ఈ సందర్భంగా కూడా పోటీకి రాహుల్‌ను ఒప్పించేందుకు మరోసారి ప్రయతి్నస్తారని చెబుతున్నారు.
22 ఏళ్ల తర్వాత పోటీ!
గెహ్లాట్‌తో పాటు థరూర్ కూడా బరిలో దిగితే పోటీ అనివార్యమయ్యేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష పదవికి చివరిసారిగా 22 ఏళ్ల క్రితం ఎన్నిక జరిగింది. 2000 నవంబర్‌లో జరిగిన ఆ ఎన్నికలో జితేంద్ర ప్రసాదపై సోనియా నెగ్గారు. 1997లో శరద్ పవార్‌ను సీతారాం కేసరి ఓడించారు. కాంగ్రెస్‌కు సుదీర్ఘ కాలం సారథ్యం వహించిన రికార్డు సోనియాదే. 1998 నుంచి మధ్యలో రెండేళ్లు మినహా ఇప్పటిదాకా పార్టీ పగ్గాలు ఆమె చేతిలోనే ఉన్నాయి. 2017 నుంచి 2019 దాకా రాహుల్ గాంధీ అధ్యక్షునిగా కొనసాగారు. ఈసారి ఎన్నికకు సోనియా దూరంగా ఉండటం తెలిసిందే. సారథ్యానికి విముఖంగా ఉన్న రాహుల్ చివరి క్షణాల్లో మనసు మార్చుకుంటే తప్ప ఈసారి గాందీయేతర నేతే కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీ షాకింగ్ నిర్ణయం.. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి దూరం!
Comments
Please login to add a commentAdd a comment