గూండారాజ్, దాదాగిరికి మారుపేరైన సమాజ్‌వాదీ పార్టీలో మార్పుని తీసుకువచ్చి యువతరాన్ని ఆకర్షించిన నాయకుడు అఖిలేశ్ యాదవ్. రాజకీయ దురంధరుడైన తండ్రి ములాయం సింగ్ యాదవ్‌నే తన రాజకీయ వ్యూహాలతో మట్టి కరిపించి పార్టీని తన గుప్పిట్లోకి తీసుకున్నారు. దేశంలో అతిపెద్దదైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి 38 ఏళ్ల వయసులో అతి పిన్న వయస్కుడైన సీఎంగా పగ్గాలు చేపట్టి తన సొంతముద్రని కనబరిచారు. నేరాలు ఘోరాలు, గూండాయిజం వెర్రితలలు వేసే యూపీ ప్రజలకు అభివృద్ధి అంటే ఏమిటో తొలిసారి చూపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఛరిష్మాని, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హిందూత్వ ఎజెండాని ఓబీసీ ఓట్లతో ఎదుర్కొనే వ్యూహాలకు పదునుపెడుతూ రెండోసారి సీఎం కుర్చీని అందుకోవాలని తహతహలాడుతున్నారు.
చదవండి: (Punjab Assembly Election 2022: ఆప్‌కు ముప్పు: విజయావకాశాలను దెబ్బతీసేలా)
►1973 జులై 1న ములాయంసింగ్ యాదవ్, మాలతిదేవి దంపతులకు జన్మించారు.
►రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ సైనిక్ స్కూలులో విద్యాభ్యాసం చేయడంతో చిన్నప్పట్నుంచి క్రమశిక్షణ మధ్య పెరిగారు.
►కర్ణాటకలోని మైసూర్ యూనివర్సిటీ నుంచి సివిల్ ఎన్విరాన్‌మెంటల్‌లో ఇంజనీరింగ్ పట్టా తీసుకున్నారు.
►ఆస్ట్రేలియాలోని సిడ్నీలో పర్యావరణంలో మాస్టర్స్ చేశారు.
►సామ్యవాద భావాలున్న అఖిలేశ్‌కు సామాజిక అంశాలపై పరిజ్ఞానం ఎక్కువ. సోషలిస్టు దిగ్గజం రామ్‌మనోహర్ లోహియా గురించి అనర్గళంగా ఎంతసేపైనా మాట్లాడగలరు.
►1999 నవంబర్ 24న డింపుల్‌ను తండ్రి అభీష్టానికి వ్యతిరేకంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు.
►2000 సంవత్సరంలో తొలిసారిగా రాజకీయాల్లో అడుగుపెట్టి తండ్రి ములాయం ఖాళీ చేసిన కన్నౌజ్ నుంచి ఉప ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పుడు ఆయన వయసు కేవలం 27 ఏళ్లు.
►2004, 2009 ఎన్నికల్లో కూడా కన్నౌజ్ నుంచే ఎంపీగా గెలిచారు.
►2012లో సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టారు. అంతకు ముందు పార్టీ యువజన విభాగం బాధ్యతలు కూడా కొన్నాళ్లు నిర్వహించారు.
►2012లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రవ్యాప్తంగా సైకిల్ యాత్ర చేసి పార్టీని విజయతీరాలకు చేర్చారు.
►కేవలం 38 ఏళ్ల వయసులోనే ముఖ్యమంత్రి పదవి చేపట్టి యూపీలో అతి పిన్న వయస్కుడైన సీఎంగా రికార్డు సృష్టించారు.
►2012–2017 మధ్య ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా గ్రామీణాభివృద్ధి, రైతు సంక్షేమంపై ఎక్కువగా దృష్టి పెట్టి యూపీ ముఖచిత్రాన్ని మార్చి.. పరిపాలనాదక్షుడిగా పేరు సంపాదించారు.
►2017 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుటుంబంలో చోటు చేసుకున్న అంతర్గత కలహాలను సమర్థంగా ఎదుర్కొన్నారు. కన్నతండ్రిని కూడా ఖాతరు చేయలేదు. తండ్రి ములాయం, చిన్నాన్న శివపాల్‌సింగ్ యాదవ్‌లను కాదని తానే పార్టీకి జాతీయ అధ్యక్షుడినని ప్రకటించుకున్నారు.
►రెండోసారి సీఎం కావడం కోసం 2017 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో 10 వేల కిలోమీటర్లు మేర తిరిగారు. 800 ర్యాలీలు నిర్వహించారు. కానీ ప్రధాని మోదీ చరిష్మా ముందు నిలువలేకపోయారు.
►2017 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తోనూ, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాయావతికి చెందిన బీఎస్పీతోనూ పొత్తు పెట్టుకొని నష్టపోయారు
►ములాయం మాటల్ని పెడచెవిన పెట్టి మరీ మోదీని ఓడించాలన్న కసితో 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంతో కేవలం అయిదు స్థానాలు మాత్రమే దక్కాయి.
►2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆజమ్‌గఢ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
►గత చేదు అనుభవాలతో ఈ సారి అఖిలేశ్ ఎవరితోనూ పొత్తు లేకుండా ఒంటరి పోరాటానికే సిద్ధమయ్యారు. ఇన్నాళ్లూ యాదవేతర ఓబీసీ ఓట్లను పట్టించుకోని అఖిలేశ్ ఇప్పుడు వ్యూహాత్మకంగా వాటినే నమ్ముకున్నారు.
►స్వామి ప్రసాద్ మౌర్య సహా బీజేపీలో కీలక ఓబీసీ నేతలకు గాలం వేసి ఆ వర్గంలో పట్టుని పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. – నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment