భారత్‌లో లోక్‌సభ ఎన్నికల తర్వాత అంతగా ప్రాధాన్యం, జనాసక్తి ఉండేది ఉత్తరప్రదేశ్ ఎన్నికలపైనే. అక్కడ ఏ పార్టీ పరిస్థితేంటి, ఎవరెవరు పొత్తులు పెట్టుకుంటున్నారు... విజయావకాశాలు ఎవరికి ఉన్నాయి? ఏయే కారణాల వల్ల అనేది రాజకీయ పండితుల నుంచి పామరుల దాకా అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ నేపథ్యంలో పశ్చిమ యూపీలో ఫిబ్రవరి 10న తొలివిడత ఎన్నికలు జరగనున్న 58 నియోజకవర్గాల పరిస్థితిపై సవివర విశ్లేషణ...
తొలిదశ ఎన్నికలు జరగనున్న 58 నియోజకవర్గాల్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏకంగా 53 స్థానాలను గెలిచింది. దీనికి కారణం 2013 ముజఫర్‌నగర్‌లో జరిగిన మతఘర్షణలు. అందులో 43 మంది చనిపోయారు. తర్వాత 2014–16 మధ్యకాలంలో కైరానా పట్టణం నుంచి ముస్లింల వేధింపులు భరించలేక దాదాపు 350 దాకా హిందువుల కుటుంబాలు వలసపోయాయి. పశ్చిమ యూపీలో ముస్లిం జనాభా ఎక్కువ. మొత్తం ఉత్తరప్రదేశ్ జనాభాలో ముస్లింలు 19.3 శాతం ఉండగా... పశ్చిమ యూపీలో ఏకంగా 26 శాతం కేంద్రీకృతమై ఉన్నారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో హిందూత్వ నినాదాన్ని పతాకస్థాయికి తీసుకెళ్లిన బీజేపీ... ముజఫర్‌నగర్, కైరానా ఘటనలను పదేపదే ఎత్తిచూపుతూ... ముస్లింలకు కొమ్ముకాసే సమాజ్‌వాదీ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే ఈ ఆగడాలు మరింతగా మితిమీరుతాయని ప్రచారం చేసింది. తద్వారా హిందువుల ఓట్లను విజయవంతంగా సంఘటితం చేసి పశ్చిమ యూపీని ఏకపక్షంగా కైవసం చేసుకుంది.
ఈసారి సీన్ మారింది
ప్రస్తుత ఎన్నికల విషయానికి వస్తే... ఈసారి సీన్ పూర్తిగా మారిపోయింది. హిందూత్వ కార్డు ఫలించే పరిస్థితులు కనిపించడం లేదు. దాంతో హిందూత్వ సెంటిమెంటును మరోస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగా... అయోధ్య రామాలయ నిర్మాణం, కాశీ విశ్వనాథ ఆలయ అభివృద్ధి బీజేపీ ఉండబట్టే జరుగుతున్నాయని.. మరోసారి అధికారమిస్తే మథురలో శ్రీకృష్ణ ఆలయాన్ని నిర్మిస్తామని కాషాయపార్టీ చెబుతోంది. ఈ పాచిక కూడా పారేటట్లు కనిపించడం లేదు. దాంతో బీజేపీ ఇక్కడ ప్రభావవంతంగా ఉండే చెరకు రైతులను దృష్టిలో పెట్టుకొని... యోగి ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో రూ 1.55 లక్షల కోట్లను చెరకు రైతులకు చెల్లింపులు చేసిందని, ఎప్పటికప్పుడు బకాయిలు లేకుండా చూశామని చెబుతోంది. అలాగే నోయిడాలో నిర్మితం కానున్న అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చూపుతూ... అభివృద్ధి మంత్రం పఠిస్తోంది.
క్షేత్రస్థాయిలో ఎస్పీకి సానుకూలంగా..
పశ్చిమ యూపీలో ముస్లింలు 26 శాతం పైచిలుకు ఉన్నారు. ఎనిమిది జిల్లాల్లో అయితే ఏకంగా 40.43 శాతం ఉన్నారు. ముస్లింల ప్రయోజనాలను కాపాడటంలో చాంపియన్‌గా పేరుపడ్డ సమాజ్‌వాదీ పార్టీతోనే ముస్లిం యూపీలో ఉంటున్నారు. దీనికి తోడు... ఈసారి బీజేపీని నిలువరించాలంటే తమ ఓట్లు లౌకిక పార్టీల మధ్యన చీలిపోకూడదని, గెలిచే అవకాశాలున్న ఎస్పీకే గంపగుత్తగా ముస్లిం ఓట్లన్నీ పడితేనే కమలదళాన్ని ఓడించడం సాధ్యమనే సందేశాన్ని ముస్లిం మతపెద్దలు, నాయకులు సామాన్యులకు నూరిపోస్తున్నారు. మసీదుల్లో ఈ అంశాన్ని నొక్కి చెబుతున్నారు. మరోవైపు దాదాపు 3.5 శాతం మంది జాట్‌లు ఉన్నారు. జాట్‌ల పార్టీగా గుర్తింపు పొందిన రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డీ)– సమాజ్‌వాదీతో పొత్తు పెట్టుకుంది. అంటే... దాదాపు 30 శాతం ఓట్ల బలం పశ్చిమ యూపీలో ఎస్పీకి ఏకపక్షంగా అనుకూలంగా మారినట్లే. పైగా ఎస్పీ ప్రధాన బలమైన, యూపీలో శక్తివంతమైన సామాజికవర్గం యాదవుల మద్దతు ఎలాగూ ఉంటుంది.
చదవండి: (పొలిటికల్ సిద్ధూయిజం: క్రికెట్‌లో అజారుద్దీన్‌నీ వదల్లేదు.. రాజకీయాల్లో..)
మాజీ మంత్రులు స్వామి ప్రసాద్ మౌర్య, దారాసింగ్ చౌహాన్‌ల చేరికతో ఇతర వెనుకబడిన వర్గాల్లోనూ (ఓబీసీ) ఎస్పీకి బాగా సానుకూలత ఏర్పడింది. దానికి తోడు మూడు సాగుచట్టాలకు వ్యతిరేకంగా 14 నెలల సుదీర్ఘకాలం పాటు జరిగిన రైతు ఉద్యమంలో పశ్చిమ యూపీకి చెందిన రైతులు ప్రధాన భూమిక పోషించారు. అందులోనూ జాట్ రైతు నాయకులు ముందుండి అన్నదాతలను నడిపించారు. ఇదే ప్రాంతానికి చెందిన భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు నరేశ్ తికాయత్ ఎస్పీ– ఆర్‌ఎల్‌డీ కూటమికి బాహటంగా మద్దతు ప్రకటించారు. రైతు ఉద్యమం చివరి దశకు చేరుకున్న దశలో ఘజియాబాద్‌లో నిర్వహించిన మహాపంచాయత్‌కు ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. ఆ సభలోనే బీకేయూ మరోనేత రాకేశ్ తికాయత్ మాట్లాడుతూ ప్రధాని మోదీ, బీజేపీ రైతులను గోస పెట్టాయని ఆరోపించారు.
బీజేపీని అడ్డుకోవడానికి ముస్లింలు– రైతులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. తామిక ప్రతీ వేదికపై అల్లా హో అక్బర్‌తో పాటు హరహర మహదేవ్ అంటూ నినదిస్తామని ప్రకటించారు. ఘజియాబాద్ సభకు అంచనాలకు అందని విధంగా రైతులు తరలిరావడం, నగర రోడ్లన్నీ జనంతో కిక్కిరిసి పోవడం చూసి బీజేపీకి డేంజర్ బెల్స్ మోగినట్లేనని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానించారు. అంటే క్షేత్రస్థాయిలో ఎస్పీకి మంచి సానుకూల వాతావరణం ఉంది. సమాజ్‌వాదీ పార్టీ తొలి దశలో సునాయాసంగా 45 నుంచి 50 శాతం ఓట్లు సాధించే అవకాశాలున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ కూడా ఎన్నికలు జరిగే 58 స్థానాల్లో తమ కూటమి 45– 50 స్థానాలు గెలుచుకుంటుందనే ధీమాతో ఉన్నారు.
చదవండి: (Mayawati: ఆమె మౌనం.. ఎవరికి లాభం!)
ఆరంభమే అదిరితే..!
యూపీలో ఫిబ్రవరి 10న మొదలై మార్చి 7వ తేదీదాకా మొత్తం ఏడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలిదశలో పశ్చిమ యూపీలో పోలింగ్ ఉండటం ఎస్పీకి బాగా కలిసొచ్చే అంశం. బోణీ బాగుంటుంది కాబట్టి ఎస్పీ ఉత్సాహంగా మిగతా ఆరు దశల్లో ఎన్నికలను ఎదుర్కొంటుంది. తొలిదశలోనే సైకిల్ (సమాజ్‌వాదీ పార్టీ ఎన్నికల చిహ్నం) స్పీడు పెరుగుతుందని... ఇక తమను ఆపడం ఎవరితరం కాదని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి ఇటీవల అన్నారు. ఓపెనర్ సెంచరీ చేస్తే ఆ జట్టు మంచిస్కోరు సాధించే అవకాశాలు మెరుగ్గా ఉన్నట్లే... తాము మంచి స్థితిలో ఉన్నామనేది ఎస్పీ వ్యూహకర్తల భావన. పశ్చిమాన మొదలైన ఈ గాలి క్రమేపీ బలపడి తూర్పుకు వెళ్లేసరికి సుడిగుండంలా మారుతుందని, బీజేపీని తుడిచిపెట్టేస్తుందని అఖిలేశ్ గట్టి నమ్మకంతో ఉన్నారు.
ఈటెల్లాంటి మాటలే..
ఎన్నికల షెడ్యూల్ రావడానికి రెండు మూడు నెలల ముందు నుంచే యూపీలో రాజకీయ నాయకుల మాటలు పదునెక్కాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ ‘చాచా జాన్’ అనే వారికి ఎస్పీ హయాంతో రేషన్‌తో సహా అన్ని దక్కేవని పరోక్షంగా ఎస్పీ పూర్తిగా ముస్లింకు కొమ్ముకాసే పార్టీ అని ఎత్తిచూపే ప్రయత్నం చేశారు. తర్వాత ప్రధాని మోదీ ఇటీవల యూపీ పర్యటనకు వెళ్లినపుడు up+yogi=upyogi(యూపీ + యోగీ.. కలిపితే ఉపయోగి అవుతుందని, ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్‌కు ఎంతో చేశారని.. మరో అవకాశమిస్తే బాగా ఉపయోగపడగలరని చెప్పే ప్రయత్నం చేశారు.
బెంగాల్ ఎన్నికల సమయంలో మమతా బెనర్జీ ఇచ్చిన ‘ఖేలా హోబే (ఆట మొదలైంది)’ అనే నినాదం ప్రజల్లోకి బాగా వెళ్లిపోయిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని... అదే లైన్‌లో అఖిలేశ్ నాలుగైదు రోజుల కిందట ’మేళా హోబే (ఐక్యత ఉంటుంది... బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఎస్పీ నేతృత్వంలో ఏకమవుతాయన్న అర్థంలో) అంటూ ట్వీట్ చేశారు. కరోనా థర్డ్‌వేవ్ నేపథ్యంలో ఎన్నికల ర్యాలీలు, సభలు, సమావేశాలపై ఈసీ కఠిన ఆంక్షలు విధించింది. ఇప్పుడప్పుడే కరోనా ఉధృతి తగ్గేలా లేదు కాబట్టి ఇవే ఆంక్షలూ ఇకపైనా కొనసాగుతాయి. అందువల్ల నేతలు వర్చువల్‌గా ప్రచారం చేయాల్సిందే. సోషల్‌మీడియాలో నాయకుల పోస్టులు తప్పకుండా హీటును పెంచేటట్లుగా ఉంటాయి. ఈటెల్లాంటి మాటలతో ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ... యువతరాన్ని, విద్యావంతులైన ఓటర్లను, తటస్థులను ఆకర్షించే ప్రయత్నం చేస్తాయి రాజకీయపార్టీలు.
– నేషనల్ డెస్క్, సాక్షి
Comments
Please login to add a commentAdd a comment