కంచర్ల యాదగిరిరెడ్డి: దాద్రి (యూపీ) నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
అన్నయ్యతో అవ్వట్లేదు...
అయినా అధికార కేంద్రంగా తానే ఉండాలంటాడు అమ్మ సోనియాకు అనారోగ్యం...
ఘనమైన చరిత్ర కలిగిన పార్టీ..
కొడిగట్టిన దీపంలా మారింది..
ఉత్రరప్రదేశ్‌లో ఉనికి చాటగలిగితే...
రేప్పొద్దున జాతీయ రాజకీయాల్లో ముఖం చెల్లుతుంది... ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రియాంకా గాంధీ ఏడాదిగా యూపీలో అలుపెరుగని పోరాటం చేస్తున్నారు...
కాలానికి తగ్గట్టు తన పద్ధతిని మార్చుకోలేకపోవడమే కాంగ్రెసు పార్టీ బలహీనతగా కనిపిస్తోంది. మరింత అప్రతిష్టను మూగగట్టుకునే దిశగా యూపీలో కాంగ్రెస్ సాగుతోందనే భావన కలుగుతోంది. ప్రజలకు... మరీ ముఖ్యంగా రైతులు, మహిళలు, యువతకు మేలు చేసే విధానాలతో ప్రియాంకా గాంధీ చేసిన ప్రయత్నాలు కాంగ్రెస్‌కు ఆశించిన స్థాయిలో ఫలితాలు ఇచ్చేట్టు కనిపించడం లేదు. పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీకి ఒక్కటంటే ఒక్క అసెంబ్లీ సీటు వచ్చే అవకాశం కనుచూపు మేరలో లేదు. కుటుంబ పార్టీగా ముద్ర వేసుకున్న కాంగ్రెస్‌కు ఈ రాష్ట్రంలో ప్రియాంక తప్ప మరో జనాకర్షక నేత లేడు. పార్టీలో ఎదుగుతున్న నేతలను కాంగ్రెస్ చేజేతులా పోగొట్టుకోవడమే ఈ దుస్థితికి కారణమని మీరట్‌కు చెందిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బదరీనాథ్ మిశ్రా అన్నారు. కాంగ్రెస్ అంటే ఇప్పటికీ ప్రజలకు ప్రేమాభిమానాలు ఉన్నాయి. కానీ, ఆ పార్టీని నడిపించే సమర్థులు లేకపోవడంతో ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ వైపు చూడాల్సి వచ్చిందంటున్నారు బదరీనాథ్.
కాంగ్రెస్‌కు సంబంధించినంత వరకు సోనియాగాంధీ వారసత్వం, ప్రియాంకా గాంధీ భవిష్యత్ మధ్య ఇక్కడ పోరు సాగుతోంది. గడచిన (2017) ఎన్నికల కంటే కాస్తన్ని ఎక్కువ సీట్లు వచ్చి నా, ఓట్లు కనీసం ఒక్క శాతం పెరిగినా ప్రియాంక గాంధీ నాయకత్వంపై ఎంతో కొంత నమ్మకం పెరుగుతుంది. కానీ, విచిత్రంగా ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లో ఎవరికీ ప్రత్యామ్నాయం కారు. ఈ ఎన్నికల కంటే వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా ఆమె పని చేస్తున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. కానీ ఓ పది మంది ఎమ్మెల్యేలనైన గెలిపించుకున్నప్పుడు కదా ఆ పాటి విశ్వాసం వచ్చేదంటున్నారు ముజఫర్ నగర్ కాంగ్రెస్ నేత రాజేశ్వర్ తివారీ. ఏడు పదుల వయసు దాటిన తివారీ జీవితమంతా కాంగ్రెస్‌తోనే సాగింది. కాంగ్రెస్ పరిస్థితి ఇలా అవుతుందని కలలో కూడా ఊహించలేదని బాధపడ్డారాయన. కానీ, కాంగ్రెస్ పార్టీ కేడర్ ఇతర పార్టీల వైపునకు వెడుతుండటాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన చెందారు. (చదవండి: టైమ్ చూసి... హ్యాండిస్తున్నారు..!)
ఉదారవాద హిందుత్వపై నమ్మకం
ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట ఉత్తరప్రదేశ్! సుమారు 30 ఏళ్లకు పైచిలుకు రాష్ట్రంలో అధికారాన్ని అనుభవించిన కాంగ్రెస్ ప్రభ క్రమంగా మసకబారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ కేవలం ఒక్క సీటుకు పరిమితమైంది. దీంతో పార్టీ కేడర్ కకావికలు అవుతోంది. 1996 యూపీ అసెంబ్లీ ఎన్నికల నుంచి తీసుకుంటే 2017 వరకు... మధ్యలో ఒకేఒకసారి కాంగ్రెస్ ఓటు శాతం డబుల్ డిజిట్ (2012లో 11.63 శాతం ఓట్లు, 23 సీట్లు వచ్చాయి. 1996లో వచ్చిన 33 సీట్లే కాంగ్రెస్‌కు ఇప్పటిదాకా యూపీలో వచ్చిన అత్యధిక స్కోరు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక, ఆమె అన్నయ్య రాహుల్ గాంధీ కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్‌ను పట్టాలెక్కించాలని శ్రమిస్తున్నారు.
ఉదారవాద హిందుత్వకు వారసులుగా తమను తాము చూపుకోవడం ద్వారా బీజేపీ హిందుత్వను ఎదుర్కోవాలన్నది ప్రియాంక ఆలోచనగా కనిపిస్తోంది. దీంతో పాటు రైతు చట్టాలపై నిరసనలు వ్యక్తమైన యూపీలో రైతులను ఒక ప్రత్యేక తరగతిగా భావించి, వారిని మచ్చిక చేసుకోవాలని ప్రియాంక పావులు కదుపుతున్నారు. ఈ కుల, మత, వర్గ సూత్రాలు కాంగ్రెస్‌ను కాపాడతాయా?... అంటే ఉనికి కోసం పోరాడుతున్న పార్టీకి పునర్‌వైభవం చాలా పెద్ద మాట అవుతుందనే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. (చదవండి: యోగికి దడ పుట్టిస్తున్న ‘ఆలూ’ సినిమా!)
ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పరిస్థితి మెరుగుపడుతుందన్న ఆశ ప్రియాంకకు కూడా లేదు. ఇటీవల ఆగ్రాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడిన తీరు ఆమెలో నిరాశకు అద్దం పడుతోంది. కాంగ్రెస్ పార్టీ పోస్టర్ గర్ల్ ప్రియాంక మౌర్య బీజేపీలో చేరడాన్ని ఆమె జీర్ణించుకోలేక పోయారు. పార్టీ కార్యకర్తల మీటింగుల్లో ఆమె అసహనం వ్యక్తం చేస్తున్నారు. ‘కాంగ్రెసు పార్టీలో గాంధీ కుటుంబ వారసత్వానికి భవిష్యత్ లేదు. ఇకనైనా నాయకత్వం కళ్లు తెరిచి చూడాలి. లేదంటే తుడిచిపెట్టుకుపోతుంది’ అని గుర్మిత్ సింగ్ పూరి అన్నారు. ఖతులీ శాసనసభ నియోజకవర్గంలో ఆర్‌ఎల్డీ తరపున ప్రచారం నిర్వహిస్తున్న గుర్మిత్ గతంలో రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహించిన అమేథి పార్లమెంట్ నియోజకవర్గంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పని చేశారు.
రుద్రాక్ష మాల– సంగమ స్నానం
గతేడాది ప్రియాంక డెహ్రాడూన్ వచ్చినప్పుడు చేతిలో రుద్రాక్ష మాలతో కనిపించారు. అనంతరం మాతా శాకంబరీ దేవీ ఆలయంలో పూజలు చేయడం, ప్రయాగ్ రాజ్ వెళ్లి సంగమంలో పుణ్యస్నానం చేయడం జరిగింది. ఇవన్నీ రాష్ట్రంలో ఉదారవాద హిందూ ఓట్లను కొల్లగొట్టేందుకు చేసే యత్నాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ అనుసరించే హార్డ్‌కోర్ హిందుత్వను హిందువుల్లో చాలామంది వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ భావిస్తోంది. ఇలాంటివారిని తమవైపు తిప్పుకునే యత్నాల్లో భాగంగా అటు ప్రియాంక, ఇటు రాహుల్ తమనుతాము ఉదారవాద హిందూవాదులుగా చూపించుకుంటున్నారు. ఉదారవాద హిందుత్వ ప్రియాంక మొదటి సూత్రం. (చదవండి: పీపీఈ కిట్లో వచ్చినా ఫలితం దక్కలేదు)
Comments
Please login to add a commentAdd a comment