వారణాసి: జీవితంలో ఆఖరి రోజుల్లోనే చాలామంది వారణాసి(కాశి)కి వస్తుంటారని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ చేసిన వ్యాఖ్యలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిప్పికొట్టారు. తాను తుదిశ్వాస విడిచేదాకా వారణాసి ప్రజలకు సేవలందిస్తూనే ఉంటానని చెప్పారు. మోదీ తన సొంత నియోజకవర్గమైన వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆదివారం బీజేపీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. ప్రతిపక్ష నేతలు వారి పార్టీలను సొంత ఆస్తులుగా భావిస్తున్నారని, అలాంటివారు కార్యకర్తల పార్టీ అయిన బీజేపీని ఎప్పటికీ చాలెంజ్ చేయలేరని పేర్కొన్నారు. తాను కాశీలోనే చనిపోవాలని ఎవరైనా ప్రార్థిస్తే సంతోషిస్తానని తెలిపారు.
వారణాసి గానీ, వారణాసి ప్రజలు గానీ తనను ఎప్పటికీ వదులుకోరనే విషయం తనకు అర్థమైందని చెప్పారు. బీజేపీ కార్యకర్తలే తనకు ఒక విశ్వవిద్యాలయమని, వారి నుంచి ఎంతో నేర్చుకుంటున్నానని ప్రధాని మోదీ వివరించారు. గత ప్రభుత్వాల హయాంలో వారణాసి అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఈ చరిత్రాత్మక, ఆధ్యాత్మిక నగరాన్ని గొప్పగా అభివృద్ధి చేస్తున్నామని ఉద్ఘాటించారు. చాలా సంవత్సరాల తర్వాత కాశీ విశ్వనాథ ఆలయం పవిత్ర గంగానది తీరాన్ని తాకిందని హర్షం వ్యక్తం చేశారు. కాశీ విశ్వనాథ్ ధామ్ ప్రాజెక్టును అందరూ గర్వకారణంగా భావిస్తుంటే, కొందరు మాత్రం మతం కోణంలో చూస్తున్నారని మోదీ ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment