17 తర్వాత పార్టీ లేదు.. తొక్కా లేదు | Atchannaidu Kinjarapu Comments On Lokesh Video Viral | Sakshi
Sakshi News home page

17 తర్వాత పార్టీ లేదు.. తొక్కా లేదు

Published Wed, Apr 14 2021 1:57 AM | Last Updated on Wed, Apr 14 2021 10:54 PM

Atchannaidu Kinjarapu Comments On Lokesh Video Viral - Sakshi

ఆకుల వెంకటేశ్వరరావుతో మాట్లాడుతూ టీడీపీని విమర్శిస్తున్న అచ్చెన్నాయుడు

సాక్షి, అమరావతి: ‘పార్టీ లేదు... బొ.. లేదు..! అంతా అయిపోయింది...! ఎప్పటి నుంచో పార్టీలో ఉన్నాం కాబట్టి పట్టుబట్టి ఉంటున్నాం...!’ టీడీపీ గురించి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలివీ. లోకేష్‌పైనా ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఆ మనిషే సరిగా ఉంటే పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుందని నిర్వేదం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకుడు ఆకుల వెంకటేశ్వరరావుతో అచ్చెన్నాయుడు ఇటీవల తిరుపతిలోని ఓ హోటల్‌లో ఉన్నప్పుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో బహిర్గతమై ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం తెలుగుదేశం పార్టీలో కలకలం రేపుతోంది. పార్టీ అధ్యక్షుడే పార్టీ గురించి చేసిన వ్యాఖ్యలు టీడీపీ దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 2019 ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఆ పార్టీ తీవ్ర నిస్తేజంలో కూరుకుపోయింది.

చంద్రబాబు పార్టీ నడిపిస్తున్న తీరును సీనియర్‌ నాయకులే తప్పు బడుతున్నారు. ఆయనపై నమ్మకం కోల్పోయి, పార్టీకి భవిష్యత్తు లేదని గ్రహించి ఇప్పటికే చాలామంది నేతలు టీడీపీని వీడారు. గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు టీడీపీకి రాజీనామా చేశారు. మిగిలిన వారు సైతం పార్టీతో అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. 80 శాతం మంది నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు స్తబ్దుగా ఉంటూ కార్యకలాపాలే నిర్వహించడంలేదు. చంద్రబాబు ఏదైనా పిలుపు ఇస్తే సోషల్‌ మీడియా, అనుకూల మీడియాలో హడావుడే తప్ప క్షేత్రస్థాయిలో పట్టించుకునే దిక్కులేదు. పార్టీ క్యాడర్‌ మొత్తం నీరుగారిపోయింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికల్లో టీడీపీ ముందుగానే చేతులెత్తేసింది. చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని మెజారిటీ పంచాయతీల్లో సైతం దారుణంగా ఓటమి పాలైంది. మున్సిపల్‌ ఎన్నికల్లో అయితే పూర్తిగా జీరో అయిపోయింది. 11 కార్పొరేషన్లు, 75 మున్సిపాల్టీలకు ఎన్నికలు జరిగితే ఒకే ఒక్క మున్సిపాల్టీలో అతికష్టం మీద గట్టెక్కిందంటే టీడీపీ దుస్థితి అర్థం చేసుకోవచ్చు. 

అచ్చెన్న వ్యాఖ్యలే నిదర్శనం..
తిరుపతి ఉప ఎన్నికలోనూ గెలుస్తామనే ఆశ ఏ టీడీపీ నాయకుడిలోనూ కనిపించడంలేదు. స్వయంగా అచ్చెన్నాయుడు చేసిన తాజా వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం. 17న తిరుపతి ఉప ఎన్నిక పోలింగ్‌ తర్వాత ఇక ఏమీ ఉండదని, పార్టీ పని అయిపోయిందని ఆయన వ్యాఖ్యానించడాన్ని బట్టి టీడీపీకి భవిష్యత్తు లేదని స్పష్టమవుతోంది. తన కుటుంబం మొత్తాన్ని సూసైడ్‌ చేసుకోవాలని లోకేష్‌ అన్నాడని టీడీపీ నేత ఆకుల వెంకట్‌ అచ్చెన్నతో వాపోవడం కలకలం రేపుతోంది.
న్యాయం చేయాలంటూ చంద్రబాబును నిలదీస్తున్న వెంకట్‌. (ఇన్‌సెట్‌)లో మీడియాతో మాట్లాడుతున్న వెంకట్‌ 

లీకైన వీడియోలో అచ్చెన్నాయుడు, వెంకట్‌ సంభాషణ ఇదీ..
అచ్చెన్న : నేను కూడా చెబుతా... బాధపడుతున్నాడని!
వెంకట్‌ : చేయరండీ వీళ్లెవరూ... లోకేష్‌ను కాదని వీళ్లెవరూ చేయరు. ఎందుకంటే బాలకృష్ణ ఇంటికెళ్లా. చూసి వెళ్లిపోయాడు. ఫోన్‌ చేసి మెసేజ్‌లు కూడా పెట్టా. 
అచ్చెన్న : ఎవరికి?
వెంకట్‌ : బాలకృష్ణకి.. అడిగా.. అసలు నేను చేసిన తప్పేంటండీ? అని.. నాది నాకు చెయ్యడానికి వాళ్లు అంతలా ఇబ్బంది పడుతున్నారంటే...
అచ్చెన్న : మరింక వద్దు.. ఇంక మనం అనుకోవడానికి కాదు గానీ.. చెబుతా. బాలకృష్ణకి కూడా నువ్వు తెలుసంట బాగా.
వెంకట్‌ : తెలుసు. ఎందుకంటే 94లో నేనేగా తిప్పా. నా ఎలక్షన్‌కు కూడా వచ్చాడు. 
అచ్చెన్న : పెద్ద గందరగోళంగా ఉంది ఇదంతా.. ఏంచేయాలో ఏమీ అర్థం కావడంలేదు పార్టీ పరిస్థితి కూడా...!
వెంకట్‌ : ఇంకేం పార్టీ సర్‌?.. లోకేష్‌గాడు ఉన్నంత వరకూ. బాలకృష్ణకి డైరెక్ట్‌గా చెప్పా నేను. 
అచ్చెన్న : ఎందుకు అవన్నీ..? లోకేష్‌ గురించి
వెంకట్‌ : అది ఎంత తప్పండి..? నన్ను సూసైడ్‌ చేసుకోమంటాడా? 30 సంవత్సరాలు పార్టీని నమ్ముకుని సర్వీస్‌ చేసినందుకు. నా ఫోన్‌ కూడాఎత్తడం మానేశారు. రాజగోపాల్‌కి చేశా. రమేష్‌కి చేశా. ఎవరూ ఎత్తడంలేదు.
అచ్చెన్న : 17 తర్వాత ఫ్రీ అయిపోతాం. ఇక పార్టీ లేదు... బొ. లేదు..!
వెంకట్‌ : అయిపోయింది సర్‌ పార్టీ పని అయిపోయింది.. జీరో అయిపోయింది. మీరు ఏమైనా అనుకోండి..
అచ్చెన్న : అయిపోయింది... జీరో అయిపోతే ఏం..? ఎప్పటి నుంచో పట్టు పట్టుపట్టి ఉన్నాం కాబట్టి అలా వెళుతున్నాం!
వెంకట్‌ : మరీ ఇంత అన్యాయమా సర్‌? 30 సంవత్సరాలు సర్వీసు చేసినందుకు కనీసం ఫోన్లు ఎత్తడం మానేశారు. ఏమన్నా అంటే లోకేష్‌... సూసైడ్‌ చేస్తే చేసుకోండి ఫ్యామిలీ మొత్తం అంటాడు. ఆ రోజు పార్టీ ఆఫీసులోకి రాము తీసుకెళ్లాడు లోకేష్‌ దగ్గరకు.. ఆరోజు కలిశాంగా.. స్టేట్‌ పార్టీ మీటింగ్‌లో.. పెద్దాయన్ను కలిశాంగా..!
అచ్చెన్న : ఏది విజయవాడలోనా..!
వెంకట్‌ : ఆ.. లోకేష్‌ దగ్గరకు తీసుకెళ్లాడు. వెళితే కనీసం.. ఇంతకుముందు అన్నా అనేవాడు.. వెళ్లి అక్కడ కూర్చోమ్మా అని అంటున్నాడు. మా ఇంటికి సైకిల్‌ గురించి వచ్చాడు. మరీ అంత అన్యాయమా సర్‌..? ఆడికి ఎంత సర్వీసు చేశా?
అచ్చెన్న : నీకనే కాదు.. అందరికీ అలాగే ఉంది. నీకే కాదు.. ఎవడి బాధలు ఆడు చెప్పుకుంటున్నాడు. సరే.. సరే.. సరే.. 
వెంకట్‌ : అది కాదు సర్‌.. నేను పూర్తిగా రోడ్డు మీద పడిపోయా. వాళ్లు నాకేం చేయొద్దు. నాకు రావాల్సిన దాని గురించి ఒక మాట చెబితే 3 కోట్లు ఇస్తారు. మొత్తం 6 కోట్లు అది. ఒక్కమాట..
అచ్చెన్న : ఎవరు అది?
వెంకట్‌ : కేఎల్‌ నారాయణ. ఇంకోమాట చెబుతున్నా... కేఎల్‌ నారాయణ ఇవ్వకపోతే ఏం చేయాలో నాకు తెలుసు. మొత్తం 1,200 కోట్లు అది. మొత్తం స్మాష్‌ చేస్తా. 
అచ్చెన్న : చెప్పిద్దాం. సార్‌తో ఒక మాట చెప్పిద్దాం
వెంకట్‌ : ఏం చెబుతాడు సార్‌? ఆరోజు మూడుసార్లు కలిశాను సార్‌.. ఎన్టీఆర్‌ ఘాట్‌లో. నీకెందుకమ్మా నేను చేస్తా అని పెద్దాయన మాటిచ్చాడు. వీడేమో.. లోకేష్‌ గాడు.. వాడిని పలకరిస్తే దొంగోణ్ణి చూసినట్లు చూస్తున్నాడు. మరీ అంత అన్యాయమా సర్‌? వాడికి ఎంత సర్వీసు చేశా? 
అచ్చెన్న : అదే వద్దంటాను.. నాకూ ఆవేశం ఉంది. రోడ్డు మీద పడిపోతామా?
వెంకట్‌ : అదికాదు సర్‌... మనిషికి కనీసం విలువ ఇవ్వాలి కదా?
అచ్చెన్న : ఒగ్గేయ్‌.. ఆ మనిషి బాగుంటే ఎందుకు ఈ పరిస్థితి మనకి? పార్టీకి ఈ పరిస్థితి ఎందుకు వస్తుంది?
వెంకట్‌ : రోడ్డు మీదకు వచ్చేశాను సార్‌.. ఫ్యామిలీతో రోడ్డు మీదకు వచ్చేశా...! 

బయటపడ్డ అసంతృప్తి
లోకేష్‌ వ్యవహార శైలిపై టీడీపీలో ఎంత అసంతృప్తి, ఆగ్రహం ఉందో తాజాగా అచ్చెన్నాయుడు, వెంకట్‌ మాట్లాడుకుంటున్న వీడియో సంభాషణ ద్వారా బయటపడింది. తనను ఎత్తుకుని తిప్పిన వ్యక్తిని ‘ఏమ్మా..?’ అని పిలిచాడంటే లోకేష్‌కు ఎంత గర్వమో అర్థం చేసుకోవచ్చని పార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు.  అచ్చెన్నాయుడు, యనమల లాంటి నాయకులను లోకేష్‌ అవమానిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అందుకే లోకేష్‌ సరిగా ఉంటే పార్టీ పరిస్థితి ఇలా ఎందుకు ఉంటుందని అచ్చెన్న అసహనం వ్యక్తం చేసినట్లు స్పష్టమవుతోంది. సీనియర్‌ నాయకులకు ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా అంతా తాను చెప్పినట్లే చేయాలని, అందరూ తన కనుసన్నల్లో ఉండాలంటూ దర్పం ప్రదర్శిస్తుండడాన్ని పార్టీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నట్లు చెబుతున్నారు. తనయుడి వ్యవహార శైలి గురించి తెలిసినా పార్టీ వ్యవహారాలను చంద్రబాబు ఆయనకే అప్పగించడం, భవిష్యత్తు నాయకుడు ఆయనేనని  చెబుతుండడంతో పార్టీ నాయకులు హడలెత్తిపోతున్నారు. ఇప్పటికే అసమర్థుడిగా, జనంలో పప్పుగా ముద్రపడిన వ్యక్తి చేతుల్లో పార్టీని పెడితే పరిస్థితి ఏమిటనే చర్చ అన్ని స్థాయిల్లోనూ తరచూ జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement