న్యూఢిల్లీ: ఢిల్లీలో మౌలిక వసతుల అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్ నుంచి రూ. 10,000 కోట్లు కేటాయించాలని ఆప్ మంత్రి అతిషి డిమాండ్ చేశారు. సెంట్రల్ జీఎస్టీ కింద ఢిల్లీ నుంచి కేంద్రానికి రూ. 25,000కోట్లు అందుతోందని ఆమె తెలిపారు. అంతేగాక ఢిల్లీ ప్రజలు రెండున్నర లక్షల కోట్లకుపైగా ఆదాయపు పన్నుల రూపంలో చెల్లిస్తున్నారని, ఇందులో కొంతభాగం తిరిగి దేశ రాజధానికి దక్కడం తమ హక్కని ఆమె పేర్కొన్నారు. ఈ రెండున్నర లక్షల కోట్లలో ఐదు శాతం రాజధానికి కేటాయించాలని అతిషి డిమాండ్ చేశారు.
ఈనెల 23న కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాజధానిలో రోడ్డు, రవాణా, విద్యుత్ రంగాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు నగరాన్ని సుందరీకరించడానికి ఢిల్లీకి మరింత డబ్బు విడుదల చేయాలని అతిషి కోరారు.
2001 నుంచి ఢిల్లీ ప్రభుత్వానికి కేంద్రం పన్నుల కింద కేవలం రూ.325 కోట్లు మాత్రమే చెల్లిస్తోందని ఆమె అన్నారు. అయితే, ఈ చెల్లింపు కూడా గత ఏడాది ఆగిపోయిందని.. ఏడాది కాలంలో నగరానికి ఒక్క రూపాయి కూడా రాలేదని ఆమె ఆరోపించారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు చెల్లించిన పన్నుల సమాహారమే కేంద్ర బడ్జెట్ అని, ఈ పన్నుల్లో ఢిల్లీ వాటా అత్యధికమని ఆమె తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment