టీడీపీలో సీనియర్ నేత అయ్యన్నపాత్రుడికి పార్టీలో ప్రాధాన్యం తగ్గిపోతోందా? అయ్యన్నకు అడుగడుగానే అవమానాలేనా? కొడుకును ఎంపీగా చూసుకోవాలనే ఆశ అయ్యన్నకు నెరవేరదా? చంద్రబాబు నుంచి అయ్యన్న కుమారుడికి సీటు విషయంలో క్లారిటీ ఎందుకు రాలేదు. దీనికి అడ్డు పడుతున్నదెవరు?
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా మంత్రిగా పనిచేసిన చింతకాయల అయ్యన్నపాత్రుడు తన కుమారుడు విజయ్ రాజకీయ భవిష్యత్ గురించి ఆందోళన పడుతున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికత తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ అవుదామనుకుంటున్న అయ్యన్న.. తాను యాక్టివ్‌గా ఉండగానే కొడుకును ఎంపీగా చూడాలని కలలు కంటున్నారు.
కాని ఆ కలలు కల్లలవుతాయేమోనని ఆయన ఆందోళన చెందుతున్నట్లు పచ్చ పార్టీలో టాక్ నడుస్తోంది. అనకాపల్లి నుంచి కొడుకు ఎంపీగా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని చంద్రబాబుకు విన్నవించుకున్నారు. అయితే అనకాపల్లి ఎంపీ టిక్కెట్ కోసం చంద్రబాబు పరిశీలిస్తున్న పేర్లంటూ రోజుకో పేరు ప్రచారంలోకి వస్తుండటంతో అయ్యన్న తన కొడుకు భవిష్యత్ గురించి బెంగ పడుతున్నారని టాక్.
అచ్యుతాపురం సెజ్ లోని ఒక కంపెనీ అధిపతి పేరు ఇటీవల తెరపైకి వచ్చింది. అదేవిధంగా అనకాపల్లిలోని ప్రముఖ వస్త్ర వ్యాపారి పేరు కూడా టీడీపీలో వినిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు మధ్య పొత్తు కుదిరితే జనసేన కచ్చితంగా అనకాపల్లి ఎంపీ సీటు అడుగుతుంది. ఎందుకంటే ఆ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కాపుల ఓట్లు అధికంగా ఉన్నాయి. ఒక వేళ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకపోయినా..ఆ సీటు కాపు సామాజికవర్గ నేతకే ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సమీకరణాల మధ్య తన కొడుక్కు సీటు రాకుండా పోతుందేమోనన్న బాధ అయ్యన్నను వేధిస్తోంది.
చదవండి: వీరి పొత్తుల ఎత్తులు చూడాల్సిందే!
తన సమకాలీకుడైన ఎర్రన్నాయుడి కుటుంబం నుంచి ఆయన తమ్ముడు, కొడుకు, కూతురు కూడా టీడీపీ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. దశాబ్దాలుగా టీడీపీనే నమ్ముకున్న తనకు మాత్రం రెండో సీటు సాధించుకోవడం అనేది కలగానే మిగులుతోందని అయ్యన వాపోతున్నట్లు ఆయన సన్నిహితులు అంటున్నారు. తన తండ్రి రాజకీయ అనుభవం తన రాజకీయ ప్రవేశానికి సరిపోలేదని గ్రహించిన చింతకాయల విజయ్.. నారా లోకేష్ టీమ్‌లో చేరి ఐటీడీపీ పేరుతో టీడీపీ సోషల్ మీడియా నిర్వహిస్తూ.. రాష్ట్రంలో అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబాన్ని టార్గెట్ చేసి వైఎస్‌ఆర్‌సీ నాయకత్వం, పోలీసులు దృష్టి తనపై పడేటట్లు చూసుకుంటున్నాడు. ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా అనకాపల్లి ఎంపీ సీటుపై మాత్రం తనకి క్లారిటీ రాకపోవడంపై తండ్రీ కొడుకుల్లో ఆందోళన కనిపిస్తోంది.
ఎంపీ సీటు మీద ఆశ పెట్టుకుని, చంద్రబాబు నాయుడు మీద నమ్మకంతో అయ్యన్నపాత్రుడు ప్రభుత్వంపైన, సీఎం జగన్‌పైన లేనిపోని ఆరోపణలు గుప్పించారు. ఇప్పుడు పరిస్థితులు ఆయనకు సానుకూలంగా కనిపించడంలేదు. చింతకాయల విజయ్ కు ఎంపీ సీటు ఇవ్వకపోతే నోటు దురుసు ఎక్కువున్న అయ్యన్న పార్టీలో రచ్చలేపుతారనే చర్చ తెలుగుదేశం పార్టీ నేతల్లోనే సాగుతోంది.
చదవండి: మళ్లీ కులపిచ్చి బయటపెట్టుకున్న చంద్రబాబు
Comments
Please login to add a commentAdd a comment