అటు అడ్డుపడి ఈసీకి ఫిర్యాదు
ఇటు పంచాలంటూ లేఖలు
ప్రజాగ్రహంతో బాబు బృందంలో ఆందోళన
సాక్షి, అమరావతి: అటుపక్క సామాజిక పింఛన్లను అడ్డుకోవడం.. ఇటుపక్క సకాలంలో ఇచ్చేయాలంటూ ఎన్నికల సంఘానికి లేఖలు రాయడం! ఇదీ చంద్రబాబు రెండు నాలుకల వైఖరి! స్వార్థ ప్రయోజనాల కోసం దిగజారుడు రాజకీయాలు, పేదల నోట్లో మట్టి కొట్టే ఆలోచనలు తనకు మినహా మరెవరికీ ఉండవని మరోసారి రుజువు చేసుకున్నారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో భాగంగా ప్రభుత్వం నియమించిన వలంటీర్లు ప్రతి నెలా ఒకటో తేదీన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ఇంటివద్దే పింఛన్లు అందిస్తూ పాలనను ప్రతి గడపకూ చేరువ చేశారు.
దేశంలోనే తొలిసారిగా సీఎం జగన్ తీసుకొచ్చిన ఈ వ్యవస్థపై చంద్రబాబు వేయని నింద లేదు, చేయని ఆరోపణ లేదు. వివక్ష, లంచాలు లేకుండా ప్రభుత్వ పథకాల ద్వారా పేదలు పారదర్శకంగా లబ్ధి పొందడం టీడీపీకి, ఎల్లో మీడియాకు కంటగింపుగా మారింది. చంద్రబాబు, ఆయన పార్ట్‌నర్ పవన్ కళ్యాణ్, ఎల్లో మీడియా నిత్యం అభాండాలు వేయడమే పనిగా వ్యవహరించారు.
వలంటీర్లు రాత్రిళ్లు వెళ్లి తలుపులు కొడుతున్నారని, వారి వల్ల ఆడపిల్లలకు రక్షణ లేదని, ఆ వ్యవస్థను రద్దు చేయాలని కుట్రపూరిత ఆరోపణలు చేశారు. పవన్ కళ్యాణ్ అయితే రాష్ట్రంలో వేలమంది యువతులు కనిపించకుండా పోయారని, అందుకు వలంటీర్లే కారణమంటూ దారుణంగా మాట్లాడారు. ఇలా అడుగడుగునా విపక్షం వేధించి అవమానించినా వలంటీర్లు పేదల సంక్షేమమే లక్ష్యంగా సేవాభావంతో విధులు నిర్వహించారు.
నిమ్మగడ్డ ద్వారా..
సంక్షేమ పథకాలను ప్రజలకు అందకుండా చేయడం ద్వారా ప్రభుత్వంపై బురద చల్లాలన్నది చంద్రబాబు కుతంత్రం. ఈ పనిని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు ఆయన ప్రత్యేకంగా అప్పగించారు. నిమ్మగడ్డ రాష్ట్ర ఎన్నికల అధికారిగా ఉన్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబుకు అనుకూలంగా ఏ స్థాయిలో పని చేశారో అందరికీ తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ కోసం హఠాత్తుగా వాయిదా వేసి రాజ్యాంగాన్నే అపహాస్యం చేసిన చరిత్ర ఆయనది.
రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉంటూనే హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో చంద్రబాబు బినామీలు సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్‌ను కలసి చంద్రబాబు కోసం ఏం చేయడానికైనా వెనుకాడబోనని చాటుకున్నారు. పదవీ విరమణ తరువాత కూడా నిస్సిగ్గుగా చంద్రబాబుకు మేలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందుకోసం కొంతమందిని పోగుచేసి సిటిజన్ డెమొక్రటిక్ ఫోరం పేరుతో తెర వెనుక రాజకీయాలు నడిపారు. అందులో భాగంగానే వలంటీర్ల వ్యవస్థ లేకుండా చేసేందుకు కోర్టులో కేసు వేశారు. పింఛన్ల పంపిణీకి అడ్డుపడి ఈసీకి ఫిర్యాదులు చేశారు.
ప్రజాగ్రహంతో...
పింఛన్ల పంపిణీకి అడ్డంకులు సృష్టించడంలో సక్సెస్ అయిన చంద్రబాబు, నిమ్మగడ్డ కుట్రపూరిత రాజకీయాలతో వలంటీర్లను ప్రజలకు దూరం చేయగలిగామని చంద్రబాబు బృందం చంకలు గుద్దుకున్నా ఒకటో తేదీ రావడంతో వారిలో వణుకు మొదలైంది.
చంద్రబాబు, నిమ్మగడ్డ నిర్వాకాల కారణంగా ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ ఆగిపోయే పరిస్థితి నెలకొంది. దీనిపై ప్రజల్లో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నట్లు పసిగట్టిన చంద్రబాబు బృందం ప్లేటు ఫిరాయించింది. తాము అడ్డుకున్న కార్యక్రమం గురించి మళ్లీ వారే ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడం గమనార్హం. పింఛన్ల పంపిణీకి తక్షణమే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలంటూ అందులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment