కుట్ర ఫలించి.. గడప దాటించి! | Sakshi
Sakshi News home page

కుట్ర ఫలించి.. గడప దాటించి!

Published Wed, Apr 3 2024 10:47 AM

Pensioners Fires On Chandrababu Over AP Volunteers - Sakshi

చంద్రబాబు అండ్‌ కో కుట్ర ఫలించింది. వలంటీర్లు లబ్ధిదారుల ఇంటి వద్దకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేయకూడదనే పంథాన్ని నెగ్గించుకున్నారు. ఫలితంగా పింఛన్‌దారులకు పింఛన్‌ కష్టాలు పునరావృతం కానున్నాయి. తెలుగుదేశం నేతలు, చంద్రబాబు అనుంగు శిష్యుడు నిమ్మగడ్డ రమేష్‌ ఒకవైపు కోర్టుల్లో వలంటీర్లపై కేసులు వేయడం.. మరోవైపు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేయడం తెలిసిందే. దీంతో వలంటీర్లను పింఛన్ల పంపిణీకి ఎన్నికల కమిషన్‌ దూరం పెట్టి సచివాలయాల ద్వారా పంపిణీకి అనుమతి ఇచ్చింది. ఐదేళ్లుగా ఇంటి వద్దే పింఛను అందుకుంటున్న లబి్ధదారులు టీడీపీ కుట్రతో మొదటిసారి గడప దాటాల్సి రావడం గమనార్హం. 

కర్నూలు(అగ్రికల్చర్‌): ఈనెల 3 నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏప్రిల్‌ నెలకు సంబంధించి 4,69,789 పింఛన్లు పంపిణీ చేయనున్నారు. ఇందుకు ప్రభుత్వం రూ.140,15,56,500 బ్యాంకులకు విడుదల చేసింది. గ్రామీణ ప్రాంతాలకు పంచాయతీ సెక్రటరీలు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు, అర్బన్‌ ప్రాంతాల్లో సచివాలయాల అడ్మిన్‌ సెక్రటరీలు, వెల్ఫేర్‌ అసిస్టెంట్లు బ్యాంకుల నుంచి బుధవారం నగదు డ్రా చేయనున్నారు. వీలైనంతవరకు బుధవారమే పంపిణీ చేసే విధంగా ఆదేశాలు జారీ అయినా గురువారం నుంచి పూర్తి స్థాయిలో పింఛన్ల పంపిణీ మొదలవుతుంది.

కర్నూలు జిల్లాలో 672, నంద్యాల జిల్లాలో 516 సచివాలయాల్లో పించన్‌ల పంపిణీ జరుగుతుంది. 6వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. కర్నూలు జిల్లాలో 2,46,863 పింఛన్లకు రూ.73.90 కోట్లు, నంద్యాల జిల్లాలో 2,22,935 పింఛన్లకు రూ.66.24 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. దాదాపు ఐదేళ్ల పాటు వలంటీర్లు ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్‌దారుల ఇళ్లకు వెళ్లి సొమ్ము అందజేసేవారు. దీంతో పింఛన్‌దారులు వలంటీర్లను గుండెల్లో పెట్టుకున్నారు. ఎలాంటి చీకూచింతా లేకుండా పింఛన్‌ పొందుతున్న వారికి పచ్చ కూటమి కారణంగా మళ్లీ కష్టాలు వచ్చి పడ్డాయి. బ్యాంకుల నుంచి నగదు డ్రా చేయాల్సి ఉన్నందున మొదటి రోజు పంపిణీలో జాప్యం జరుగుతుంది. 5, 6 తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి పింఛన్ల పంపిణీ చేపట్టనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 
 
లబ్ధిదారుల్లో ఆందోళన 
ప్రస్తుతం ఉష్ణోగ్రతలు దాదాపు 44 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇంతటి తీవ్రమైన ఎండల్లో పింఛన్‌దారులు కిలో మీటర్ల దూరంలోని గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పింఛన్‌ తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించడం పట్ల సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 4.70 లక్షల మందికి కష్టాలు తెచ్చిపెట్టిన టీడీపీపై పింఛన్‌దారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటికే పింఛన్‌ పంపితే... చంద్రబాబు మళ్లీ పాత పద్ధతిలో సచివాలయాల చుట్టూ తిప్పేలా చేశాడని పింఛన్‌దారుల్లో ఆందోళన వెల్లువెత్తుతోంది. సచివాలయంలో 10 మంది వరకు ఉద్యోగులు ఉంటారు. అందరికీ పింఛన్‌ బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పింఛన్ల పంపిణీ ముగిసే వరకు సచివాలయాల వద్ద షామియానాలు వేయడంతో పాటు నీటి సదు పాయం కలి్పంచేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.  

వీరికి ఇంటి వద్దే పంపిణీ 
► ఉమ్మడి జిల్లాలో 4.69 లక్షల పింఛన్‌లు ఉండగా... ఇందులో వికలాంగులు, వయోవృద్ధులు
(నడవలేని వారు), మంచానికే పరిమితమైనవారు, కిడ్నీ, డయాలసిస్‌ పేషెంట్లకు ఇంటి వద్దే సచివాలయ ఉద్యోగులు పింపిణీ చేస్తారని అధికార వర్గాలు తెలిపాయి.  
► ఇటువంటి వారు దాదాపు 30–40 శాతం మంది ఉంటారు.  
► సచివాలయాలకు దూరంగా ఉన్న గిరిజన ప్రాంతాల్లో పింఛన్ల పంపిణీకి జిల్లా యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.  
► సచివాలయాల్లేని మజరా గ్రామాల్లో పింఛన్ల సంఖ్య ఆధారంగా ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద పింఛన్ల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు.  

► ఒకవైపు 30–40 శాతం మందికి ఇంటి వద్ద.. మిగిలిన వారికి సచివాలయాల్లో పింఛన్ల పంపిణీ చేయనుండటం గందరగోళానికి దారితీసే పరిస్థితి ఏర్పడింది.  

బాబు ఎంత పని చేశావయ్యా..  
జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లూ ఎప్పుడూ పింఛన్‌ కోసం ఆలోచించలేదు. ఠంచన్‌గా ప్రతి నెల 1వ తేదీన వలంటీర్లు ఇంటికొచ్చి ఇచ్చారు. చంద్రబాబు చేసిన పనికి పింఛన్‌ తీసుకునే వాళ్లంతా ఇప్పడు భయపడుతున్నారు. మా లాంటి వారికి ఇంటికొచ్చి ఎవరు వస్తారో తెలియదు. ఎవరినీ అడగాలో అర్థం కావడం లేదు. చంద్రబాబుకు ముసలోళ్ల మీద దయలేదు.  
–కరీంబీ, డబ్ల్యూ.గోవిందిన్నె, దొర్నిపాడు మండలం

లైన్‌లో ఎండకు ఎంత సేపు నిలవాలనో..  
నాకు వితంతు పింఛన్‌ వస్తుంది. ప్రతి నెలా వలంటీర్లు తెల్లవారుజూమున ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారు. కానీ ఈ నెల ఒకటవ తేదీ వచ్చింది కానీ పింఛను అందలేదు. వలంటీర్‌ను అడిగితే సచివాలయానికి రావాలని చెబుతున్నారు. అందరూ అక్కడికి పోతే పెద్ద లైన్‌లో ఎండకు ఎంత సేపు నిలవాలనో తెలియడం లేదు. కూలీకి వెళ్లకుండా పింఛన్‌ కోసం వెళ్లాల్సి వస్తుంది. చంద్రబాబు మాలాంటి పేదల మీద ఎప్పుడూ ఏడుస్తుంటాడు.   
  – తెలుగు వెంకట లక్ష్మమ్మ, గిద్దలూరు గ్రామం, సంజామల మండలం  

మా ఉసురు తగులుతుంది  
టీడీపీ పాలనలో పింఛన్లు సక్రమంగా పంపిణీ చేయలేదు. అప్పట్లో పంచాయతీ కార్యాలయం వద్ద వారాల కొద్ది ఎదురు చూసేటోళ్లం. ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వలంటీర్‌ ద్వారా ఒకటో తేదీ తెల్లవారుజామున ఇంటి వద్దకు పింఛన్‌ ఇచ్చి పంపుతున్నాడు. పింఛన్లు వలంటీర్లు ఇవ్వకుండా చంద్రబాబు అడ్డుకోవడం దారుణం. చంద్రబాబుకు ఓటు వేసే ప్రసక్తే లేదు.  మా ముసలోళ్ల ఉసురు ఆయనకు   తగులుతుంది.
– బోయ నరసమ్మ, నాగలదిన్నె, నందవరం మండలం 

Advertisement
Advertisement