ప్రముఖ నటుడు, హిందూపూర్ టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక డిజిటల్ ఒటిటి ఫ్లాట్ ఫామ్ మీదకు వచ్చి తెలుగుదేశం పక్షాన ప్రచారం చేస్తున్న తీరు ఆసక్తికరంగానే ఉంది కాని, దీనివల్ల ఆ ప్లాట్ ఫామ్ కు లాభం ఎంత ఉంటుందో, నష్టం కూడా అంతే ఉండే అవకాశం ఉంది.
ఆహా అనే ఈ వేదికలో ఆయన అన్ స్టాపబుల్ అంటూ ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అది సాధారణంగా వినోదాత్మక ఓటీటీగా ఉండాలి. బాలకృష్ణ సినీ నటుడు కనుక, ఆయన గ్లామర్ ను తమకు ఉపయోగపడుతుందని ఆ ఓటీటీ నిర్వాహకులు భావించి ఉండవచ్చు.
కాని అది ఒక రాజకీయ పార్టీ ప్రచారం కోసం వాడుతున్నట్లుగా ఉంది. ఆ మద్య టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ ని బాలకృష్ణ చేశారు. ఇద్దరు కలిసి టిడిపి పక్షాన ప్రచారం సాగించారు. చంద్రబాబు రాష్ట్రానికి చాలా చేసేసినట్లు, ఎన్.టి.ఆర్.ను పదవీచ్యుతుడిని చేయడం రైట్ అయినట్లు తమ వాదనను తెలివిగా చెప్పే యత్నం చేశారు. కాని వారు ఎన్.టి.ఆర్.ను ఒక అసమర్ధుడిగా చిత్రీకరించిన విషయాన్ని సోషల్ మీడియాలో ఎత్తి చూపారు. చంద్రబాబును అయినా, మరెవరిని అయినా ప్రొఫెషనల్ గా ఇంటర్వ్యూ చేస్తే తప్పుకాదు.
కాని కేవలం ఒక రాజకీయ లక్ష్యంతో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లుగా కనబడుతుంది. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో ఇంటర్వ్యూ క్లిప్పింగ్ లు సోషల్ మీడియాలో వచ్చాయి. సడన్ గా బాలకృష్ణకు పవన్ పై ఎక్కడ లేని ప్రేమ పుట్టుకొచ్చింది. అందులో ఆయన పవన్ ను ఉద్దేశించి రాష్ట్రం అంతటా మీకు ఫాన్స్ కానివారు ఉండరు.. అంటూ అయినా మీరెందుకు ఓడిపోయారు అని ప్రశ్నించారు. బాలకృష్ణ సొంతంగా ఈ ప్రశ్న వేశారో, లేక ఎవరైనా రాసిచ్చారో తెలియదు కాని తెలివిగానే ఉంది.
పవన్ కళ్యాణ్ గాలి తెలియకుండా తీయడం, అదే సమయంలో జనసేన కార్యకర్తలను ఆకర్షించడం అందులోని ఉద్దేశంగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఇదే బాలకృష్ణ జనసేనవారిని అలగాజనంతో పోల్చడం, సంకర జాతి అంటూ అనుచిత వ్యాఖ్య చేయడం, దానిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. ఎన్.టి.ఆర్.కుమారుడిగా తమకు బాలకృష్ణ అంటే గౌరవమేనని, కాని తన అభిమానులను అలగా జనం అంటారా అని మండిపడ్డారు.
అలాగే మరో సందర్భంలో పవన్ సోదరుడు చిరంజీవి గురించి అడిగిన ప్రశ్నకు బాలకృష్ణ బదులు ఇస్తూ తమ బ్లడ్ వేరు, తమ బ్రీడ్ వేరు అంటూ వ్యాఖ్యానించారు. అలాంటి బాలకృష్ణ ముందు పవన్ కూర్చుని అన్ స్టాపబుల్ గా నవ్వుతూ ఎంజాయ్ చేయడం ఆశ్చర్యం కలిగిస్తుంది. రాజకీయాలలో రాజీలు ఉంటాయి కాని, ఇంతలా దూషించినా రాజీపడవలసిన అగత్యం పవన్ కు ఏముందో తెలియదు. బహుశా తెలుగుదేశంతో పొత్తు ఉంటే కనీసం తాను అయినా ఎమ్మెల్యే కావచ్చన్న భావనో, లేక మరేమిటో తెలియదు. ఈ విషయంలో బాలకృష్ణను తప్పు పట్టజాలం.
ఆయన చేసిన అలగా జనం వ్యాఖ్యలనుకాని, తమ బ్రీడ్ వేరు అన్న అభిప్రాయాన్ని కాని మార్చుకున్నట్లు చెప్పలేదు. క్షమాపణలు అసలు కోరలేదు. కాని పవన్ కళ్యాణే ఆ అవమానాలను మర్చిపోయి బాలకృష్ణ ఎదురుగా కూర్చున్నారు. అది ఆయన ఇష్టం. కాని బూతులు తిన్న జనసేన కార్యకర్తల పరిస్థితి ఏమిటి? వారు ఇలాంటి విషయాలు ఆలోచించరన్నది పవన్ భావనా? లేక బాలకృష్ణ గతంలో అలా అంటే అన్నారులే.. ఇప్పుడు రాజకీయం వేరులే అనుకోవడమా? ఏదైనా కావచ్చు.
మరో సంగతి కూడా చెప్పాలి. బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా లో కూడా రాజకీయ డైలాగులు చొప్పించి వైఎస్ ఆర్ కాంగ్రెస్ ను, ముఖ్యమంత్రి జగన్ పట్ల అనుచితంగా వ్యవహరించారు. ఇలా రాజకీయ కక్షలతోసినిమాలు తీస్తే నిర్మాతలకు నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. కాని కొందరు హీరోలు తమ ఇష్టం వచ్చినట్లు డైలాగులు మార్చుకుంటుంటారట. రచయితలతో రాయిస్తుంటారట. దీంతో ఒక వర్గం ప్రేక్షకులు ఈ సినిమాకు దూరం అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు.
ఇందులో ఆరోగ్యయూనివర్శిటీకి ఎన్.టి.ఆర్.పేరు బదులు వైఎస్ ఆర్ పేరు పెట్టడాన్ని తప్పుపడుతూ ఇష్టారీతిన డైలాగులు చెప్పారు. మరి ఇదే పెద్ద మనిషికి ఒక జిల్లాకు ఎన్.టి.ఆర్. పేరు పెట్టిన సంగతి కూడా గుర్తుండాలి కదా? అప్పుడు ఏమైనా పొగిడారా? తన బావ ముఖ్యమంత్రిగా అన్నేళ్లు ఉన్నా ఒక జిల్లాకు ఎన్.టి.ఆర్.పేరు ఎందుకు పెట్టలేకపోయారు? రాజకీయం, సినిమా ఒకప్పుడు కలగలిసి ఉన్న మాట నిజమే అయినా, కాలం మారిందన్న సంగతిని బాలకృష్ణ గుర్తించకపోతే ఆయనకే నష్టం.
ఇప్పుడు ప్రత్యర్ధి పార్టీలపై దూషణలతో కూడిన డైలాగులు చెబితే వాటిని ఆ పార్టీలవారు సహిస్తారని అనుకోవడం పొరపాటు. ఏదైనా చమత్కారంగా డైలాగులు ఉండాలి కాని బండగా, మొద్దుగా ఉండకూడదు. బాలకృష్ణ తానేదో అన్ స్టాపబుల్ అనుకుంటున్నారు. కాని ఆయన తండ్రి, స్వయానా టిడిపిని స్థాపించిన ఎన్.టి.రామారావే అన్ స్టాపబుల్ గా ఉండలేకపోయారు. చివరికి బాలకృష్ణ తో సహా తన కుటుంబ సభ్యుల చేతిలో ఘోర పరాభవానికి గురై, కుమిలిపోయారు. ఈ విషయాన్ని బాలకృష్ణ గుర్తు పెట్టుకుంటే ఆయనకే ప్రయోజనం అని చెప్పాలి.
-హితైషి
Comments
Please login to add a commentAdd a comment