ఒంగోలు : ‘పేదలకు ఇళ్ల పట్టాలిస్తుంటే ఎవరైనా సంతోషిస్తారు.. కానీ అందుకు భిన్నంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు మాత్రం ఈ ప్రక్రియను ఎలా ఆపాలా అంటూ రోజూ తప్పుడు కథనాలు రాయడం ఆశ్చర్యంగా ఉంద’ని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల పట్టాల పంపిణీ కోసం రాజకీయ జీవితాన్ని సైతం ఫణంగా పెట్టి తాను పోరాడుతున్నానని, ఇచ్చిన మాటకు కట్టుబడి కృషిచేస్తుంటే, ఎలాగైనా పట్టాల పంపిణీ నిలిచిపోయేలా కుతంత్రాలు చేస్తూ పేట్రేగితే మాత్రం సహించే ప్రసక్తేలేదని ఆ రెండు పత్రికలపై ఆయన తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.
స్థానిక నర్సాపురం అగ్రహారం–మల్లేశ్వరపురం రైతుల వద్ద నుంచి జగనన్న కాలనీ కోసం పేదలకు పట్టాలిచ్చేందుకు కొనుగోలు చేసిన భూముల్లో అభివృద్ధి పనులను ఆదివారం బాలినేని స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల రాతలను తూర్పారబట్టారు.
ఒక్క రూపాయి తీసుకున్నా చెప్పుతో కొట్టండి..
తానేదో రైతుల వద్ద నుంచి కమీషన్లు తీసుకుంటున్నట్లు కథనాలు రాయడం ఏమిటంటూ బాలినేని మండిపడ్డారు. ఒక్క రూపాయి తాను తీసుకున్నా తనను చెప్పుతో కొట్టాలన్నారు. ఇప్పటికే భూములకు సంబంధించి రైతులకు చెల్లించాల్సిన డబ్బులు రూ.231 కోట్లు కలెక్టర్ బ్యాంకు ఖాతాలో జమయ్యాయని.. ఇందులో ఇప్పటికే 80 శాతం మందికి నగదు కూడా జమచేశారన్నారు.
ఆదివారం కూడా 29 మందికి జమచేసినట్లు తెలిపారు. మిగిలిన కొంత భూమికి సంబంధించిన వివాదాలు ఉండడంతో వాటిని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారని బాలినేని చెప్పారు. రోడ్లు, విద్యుత్, గుడి, బడి, పార్కులు ఇలా అన్ని రకాల మౌలిక వసతులతో ఒక సిటీని నిరి్మస్తున్నామన్నారు. రైతులు కూడా ముందుకొచ్చి సహకరిస్తున్నందుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
ఇళ్లు కూడా మంజూరు చేయిస్తా..
ఇక ఈనెల 20 నుంచి 25లోగా 25 వేల మందికి సీఎం వైఎస్ చేతుల మీదుగా పట్టాలను ఇప్పించడమే కాక ఇళ్లు కూడా ప్రభుత్వం ద్వారా మంజూరు చేయిస్తానని బాలినేని హామీ ఇచ్చారు. పేదలకు పట్టాలు ఇచ్చేందుకు తాను ఇంతగా తాపత్రయపడుతుంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు మాత్రం డబ్బులు పడవు, డబ్బులు రావు, పట్టాలు ఇవ్వరంటూ అడ్డగోలుగా కథనాలు రాశారని, తీరా నేడు ప్రభుత్వం డబ్బులు విడుదల చేయగానే కాగితాలు మాత్రమే ఇస్తారు, స్థలం చూపరు అంటూ వేరే కథనాలు అల్లుతున్నారని మండిపడ్డారు. టిడ్కో ఇళ్లకు భూసేకరణ సమయంలో భూములను ఎలా సేకరించారో, ఇప్పుడు భూముల కొనుగోలు ఎలా జరుగుతుందో ప్రజలందరికీ తెలుసునన్నారు.
అడ్డుకుంటే ముట్టడిస్తా..
ఏదో ఒక రూపంలో పేదల పట్టాలను అడ్డుకోవాలని చూస్తే మాత్రం సహించేదిలేదని, ఇంటికి ముగ్గురు చొప్పున 25 వేల పట్టాలకు సంబంధించి 75 వేల మందితో ఆ రెండు పత్రికల కార్యాలయాలను సైతం ముట్టడిస్తానని బాలినేని హెచ్చరించారు. పేదల సంక్షేమమే తనకు ముఖ్యమని తనపై ఎన్ని కేసులు పెట్టినా డోంట్ కేర్ అని స్పష్టంచేశారు. సమావేశంలో నగర మేయర్ గంగాడ సుజాత, నగరపాలక సంస్థ కమిషనర్ జస్వంత్‌రావు తదితరులు ఉన్నారు.
నేను పార్టీలోనే ఉంటా..
అనంతరం.. టంగుటూరు మండలం అనంతవరం గ్రామంలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ సచివాలయ సముదాయాన్ని మంత్రి, కొండపి నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ తో కలిసి బాలినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఆదిమూలపు సురే‹Ùను కొండపి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఒక మాట చెప్పారు.. పార్టీ తల్లిలాంటిది.. పార్టీలో ఉండి ద్రోహం చేస్తే తల్లిపాలు తాగి రొమ్ము గుద్దడమే.. అధికారం ఉంటేనే ఏ పనైనా చేసుకోగలం. మంత్రి పదవులు ఇచ్చినా ఇవ్వకపోయినా పార్టీ అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యే అయితే చాలు. నా గుండె నుంచి వస్తున్న మాటలివి. నేను పార్టీలోనే ఉంటాను’’ అని బాలినేని స్పష్టంచేశారు. జగనన్న నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో వైఎస్సార్‌సీపీ గెలుపు తథ్యమని ఆయన ధీమా వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment