సాక్షి, ప్రకాశం జిల్లా: ఒంగోలులో పోలీసుల తీరుపై బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు సమతా నగర్ ఘర్షణలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేశారు. తెల్లవారు జామున 4 గంటలకు వైస్సార్సీపీ కార్యకర్తలు ఇండ్లలోకి వెళ్లి పోలీసులు భయబ్రాంతులకు గురి చేశారు. ఘర్షణ పాల్పడిన టీడీపీ కార్యకర్తలను వదిలి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై కేసులు పెట్టడంపై బాలినేని మండిపడ్డారు. తనను కూడా అరెస్ట్ చేయండంటూ వన్ టౌన్ పీఎస్‌కి బాలినేని వెళ్లారు.
ఒంగోలు నగరంలో టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. తప్పులు చేయడం.. ఆ నెపాన్ని అధికార వైఎస్సార్ సీపీపై నెట్టేయడం వారికి రివాజుగా మారింది. ప్రశాంతంగా సాగుతున్న ఎన్నికల ప్రచారంలో మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అండ్ కో అలజడి సృష్టించారు.
పక్కా ప్లాన్ ప్రకారం అధికార వైఎస్సార్ సీపీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు పన్నాగం పన్నారు. అది బెడిసికొట్టేసరికి ఎదురుదాడికి దిగారు. బుధవారం రాత్రంతా హంగామా సృష్టించారు. ఓటమి భయంతో అసలు విషయాన్ని పక్కదోవ పట్టించేలా పచ్చమీడియాను అడ్డం పెట్టుకుని వాస్తవాలు వక్రీకరిస్తూ రెచ్చిపోయారు. మహిళ అని చూడకుండా ప్రచారాన్ని అడ్డుకోవడమే కాకుండా నగరంలో భయానక వాతావరణాన్ని సృష్టించారు.
అసలు జరిగింది ఇదీ..
పార్టీ ఏదైనా తోటి మనిషి పట్ల సంస్కారవంతంగా వ్యవహరించడం ఎంతో ముఖ్యమని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి కోడలు బాలినేని శ్రీకావ్య అన్నారు. నగరంలోని 37వ డివిజన్ సమతానగర్ 4వ లైన్‌లో శ్రీకావ్య, మరోచోట బాలినేని శచీదేవి వేర్వేరుగా గురువారం మహిళలతో మమేకం–సీ్త్రశక్తితో శచీదేవి కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి జరిగిన సమతానగర్ ఘటనపై బాలినేని శ్రీకావ్య మీడియాతో మాట్లాడారు. తాము ఓట్లు అభ్యర్థించడానికి వచ్చామని, వచ్చిన వారిని అవమానించడం మాత్రం సంస్కారం కాదని అన్నారు. బుధవారం జరిగిన ఘటనలో గేటు వేసి తమను లోపలకు రానివ్వకపోగా తమతో పాటు ఉన్న గర్భిణీ అయిన రాజీనామా చేసిన వలంటీర్‌పై భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు.
తాము అవతలివైపు ఉన్న నాలుగు ఇళ్లకు వెళ్లి వస్తామని, ఇక్కడే ఉండమని గర్భిణీకి చెప్పామన్నారు. తాము అక్కడకు వెళ్లి వచ్చేసరికి ఆమెతో టీడీపీ వర్గీయులు గొడవపడుతుండటంతో ఎందుకు ఇలా చేస్తున్నారని తాము మాట్లాడామన్నారు. దానికి అవతలి టీడీపీ మహిళ వినలేని, చెప్పలేని బూతు పదజాలంతో మాట్లాడిందని, అవి మహిళలుగా తాము చెప్పలేని పదాలని అన్నారు. చివరకు పైనుంచి వాళ్ల కుమార్తె వీడియో తీస్తుండటంతో.. ఎందుకు తీస్తున్నావని ప్రశ్నించగా, ఆమె మాట్లాడిన మాటలు కూడా తట్టుకోలేకుండా ఉన్నాయన్నారు.
విషయం తెలుసుకుని మా వద్దకు వచ్చిన మా మమయ్య బాలినేని శ్రీనివాసరెడ్డికి పూర్తి విషయం చెప్పకుండా తామే సర్దిచెప్పి పంపామన్నారు. కానీ, వారు మళ్లీ తమ పక్కన ఉన్న మహిళల పట్ల కూడా అవమానకరంగా మాట్లాడి రెచ్చగొట్టారన్నారు. వారు వీడియో తీస్తూనే ఉన్నారని, తమను మెట్ల వద్దనే అడ్డుకున్నారని, అలాంటప్పుడు తాము వారుండే పైఅంతస్తులోని ఇంట్లోకి ఎలా వెళ్లగలమని అన్నారు. తమకు ఓటు వేయడం ఇష్టం లేకపోతే ఓటు వేయమని చెప్పినా పర్వాలేదని, కానీ, అసభ్యపదజాలంతో దూషిస్తే మాత్రం సహించమని అన్నారు. మన ఇంటికి వచ్చిన వ్యక్తితో నవ్వుతూ మాట్లాడటం అనేది సంస్కారమని, వైఎస్సార్ సీపీ వాళ్ల ఇళ్లకు కూడా టీడీపీ వారు ఓట్లు అభ్యర్థించేందుకు వెళ్లరా అంటూ శ్రీకావ్య ప్రశ్నించారు. ముందస్తుగా ఒక పథకం ప్రకారమే వాళ్లు ఉద్రిక్తత సృష్టించి దురదృష్టకర ఘటనకు కారణంగా నిలిచారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment