
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన పాదయాత్రను ఎవరూ పట్టించుకోవడం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ విమర్శించారు. బేకార్ సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో మంగళవారం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బురదలో బొర్లే పందికి పన్నీర్ వాసన తెల్వదని, బండి సంజయ్‌కు ప్రగతి భవన్ విలువ తెలియదన్నారు. ఎన్నో సాగునీటి ప్రాజెక్టులకు పురుడు పోసిన స్థలం ప్రగతి భవన్ అని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు వస్తున్న ప్రజాదరణ బీజేపీ నాయకులు ఓర్వలేకపోతున్నారని దుయ్యబట్టారు.
తెలంగాణ ప్రజల ప్రేమాభిమానాలే సీఎం కేసీఆర్ వెలకట్టలేని ఆస్తి అని బాల్క సుమన్ తెలిపారు. ‘సన్నాసి సంజయ్‌కు ఇది తెలియదు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై అక్కసుతో బండి సంజయ్ మాట్లాడుతున్నాడు. తెలంగాణ ప్రజలు బికార్లు అన్న మాటల్ని బండి సంజయ్ వెనక్కి తీసుకోవాలి. తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. విషయం లేని లేఖ రాశారు సంజయ్. వినాయక నిమజ్జనం ముగిసింది. ఇక రాబోయేది ప్రతిపక్షాల నిమజ్జనమే. హుజురాబాద్‌లో వందకు వంద శాతం టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుస్తాడు. టీఆర్ఎస్ అంటే నమ్మకం బీజేపీ అంటే అమ్మకం. హుజురాబాద్‌లో జరిగే ఎన్నిక అబద్ధాల బీజేపీకి అభివృద్ధి చేసిన టీఆర్ఎస్‌కు మధ్య జరిగేది’ అని బాల్క సుమన్ పేర్కొన్నారు.
చదవండి: యాక్సిడెంటల్ డెత్: సుమేధ ఘటనపై కోర్టులో ప్రొటెస్ట్ పిటిషన్