
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ‘బీజేపీ లేఖ రాయడం వల్లే దళిత బంధు ఆగిందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నారు. టీఆర్‌ఎస్ వల్లే పథకం ఆగిపోయిందని నేను నిరూపిస్తా.. నువ్వు రాజీనామా చేస్తావా? ఒకవేళ బీజేపీ వల్లే పథకం ఆగిపోయిందని నువ్వు నిరూపించు.. నేను దేనికైనా సిద్ధం..’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ సవాల్ విసిరారు. హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన జమ్మికుంట రూరల్ గ్రామాల్లో బుధవారం పర్యటించారు.
తొలుత అంకుషాపూర్, మడిపెల్లి గ్రామాల్లో పర్యటించిన ఆయన రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పతనం ఖాయమైందని, హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఓడిపోతుందని తెలిసే కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరదీశారని దుయ్యబట్టారు. హుజూరాబాద్‌లో ఓడిపోతామనే భయంతోనే దళితులకు డబ్బులు ఇవ్వకుండా అకౌంట్లు ఫ్రీజ్ చేయించాడని, ఎన్నికల తరువాత కేసీఆరే కోర్టులో కేసు వేయించి దళిత బంధు డబ్బు దళితులకు అందకుండా చేస్తాడని ఆరోపించారు.
బీజేపీని గెలిపిస్తే.. కేసీఆర్ అహంకారం అణిగిపోయి ఫాంహౌస్‌ను వీడి ఒళ్లు వంచి పనిచేస్తాడని అన్నారు. ఓడిపోయే సీట్ల ప్రచారానికి పంపి హరీశ్‌రావును బలిపశువును చేస్తున్నారని, హరీశన్నా జాగ్రత్త అంటూ హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment