‘‘మునుగోడు’’ను జల్లెడ పట్టండి | Bandi Sanjay fires On TRS in tele conference with BJP leaders | Sakshi
Sakshi News home page

‘‘మునుగోడు’’ను జల్లెడ పట్టండి

Published Tue, Oct 4 2022 11:31 PM | Last Updated on Wed, Oct 5 2022 5:40 AM

Bandi Sanjay fires On TRS in tele conference with BJP leaders - Sakshi

మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల తరువాత టీఆర్ఎస్ కనుమరుగు కాబోతుందని, బీజేపీ గెలుపు ఎప్పుడో ఖాయమైందని రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ఈ ఉప ఎన్నికపై చర్చ జరుగుతోందన్నారు.' ఓటుకు రూ.30 వేలు పంచి గెలవాలని టీఆర్ఎస్ చూస్తోంది. బీజేపీ దమ్ము ఏంటో చూపించే అవకాశం మనకు ఈ ఎన్నిక ద్వారా మరోసారి  వచ్చింది. ఇది మనందరికీ పరీక్షా సమయం. మీరంతా ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు బిస్తర్ సర్దుకుని మునుగోడులోనే మకాం వేయండి. ప్రతి ఒక్క ఓటర్ ను పోలింగ్ బూత్ వరకు రప్పించి పువ్వు గుర్తుకు ఓటేయించండి‘‘అని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.

► దాదాపు 40 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో తొలుత వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సర్వేలన్నీ బీజేపీ గెలుపు ఖాయమని స్సష్టం చేస్తున్నాయన్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. మునుగోడులో పార్టీ బలోపేతం కోసం మనోహర్ రెడ్డి చేస్తున్న క్రుషిని ప్రత్యేకంగా అభినందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీపై నమ్మకంతో రాజీనామా చేసిన నేపథ్యంలో పార్టీ గెలుపే లక్ష్యంగా మనోహర్ రెడ్డి ఎంతగానో కష్టపడుతున్నారని కొనియాడారు. 

► అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘‘ మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్ ను నిర్ణయించబోతోంది.  అన్ని సర్వేలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. కేసీఆర్ మాత్రం ఓటుకు రూ.30 వేలు ఇచ్చి గెలవాలని కుట్ర చేస్తున్నడు. ఇది మనందరికీ పరీక్షా సమయం. ఎన్నికయ్యే వరకు అప్రమత్తంగా ఉందాం. మీరంతా బిల్లా బిస్తర్ సర్దుకుని ఎన్నికలయ్యే వరకు మునుగోడులోనే మకాం వేయండి. నియోజకవర్గం మొత్తం జల్లెడ పట్టండి... ప్రతి ఓటర్ ను ఒకటికి నాలుగు సార్లు కలవండి. అందరినీ పోలింగ్ కు తీసుకొచ్చి పువ్వు గుర్తుకు ఓటేయించండి’’అని కోరారు.

► ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని, అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి నిధులిస్తోందని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలు సహా అన్ని పార్టీలకు టీఆర్ఎస్ ఆర్ధిక సాయం చేస్తోందన్నారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రజల ఆశీర్వాదం, అమ్మవారి క్రుప బీజేపీపై ఉందన్నారు.  

► దేవీ నవరాత్రి ఉత్సవాల సమయంలో వచ్చిన ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనన్నారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ లో బీజేపీ కార్యకర్తలు తిండి తిప్పలు లేకుండా కష్టపడి పనిచేయడంవల్లే బీజేపీ గెలిచిందన్నారు. మునుగోడులోనూ తాడో పేడో తేల్చుకుందామని, ప్రతి కార్యకర్త మునుగోడులో మకాం వేయాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల తరువాతే బీజేపీ కార్యకర్తలకు అసలైన దసరా, దీపావళి పండుగ రాబోతోందని పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement