కొత్తపల్లి (కరీంనగర్): రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని, తెలంగాణలో అధికారంలోకి రాగానే రైతురాజ్యం తీసుకొస్తామని కరీంనగర్ బీజేపీ అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట ప్రకారం వరికి రూ. 3,100 మద్దతు ధర చెల్లిస్తామని, ఎకరానికి రూ. 24 వేల సాయం చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి (హెచ్)లో చేపట్టిన సభలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం రెండు పంటలకు కలిపి రైతులకు ఏటా రూ. 12 వేలు ఇవ్వడంతోపాటు డీఏపీ, ఇతర ఎరువుల సబ్సిడీ పేరుతో ఎకరానికి రూ. 18 వేలు చెల్లిస్తోందన్నారు.
కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో ఎకరాకు రూ. 6 వేలను బ్యాంకులో జమ చేస్తోందని చెప్పారు. ఈ లెక్కన రైతులకు మోదీ ప్రభుత్వం రూ. 24 వేలు సాయం చేస్తుంటే కేసీఆర్ ప్రభుత్వం అన్ని సబ్సిడీలు బంద్ పెట్టి రైతుబంధు పేరుతో రూ. 10 వేలు మాత్రమే సాయం చేస్తోందని బండి సంజయ్ వివరించారు. పేదలకు ఇప్పటికే ఉచితంగా ‘ఉజ్వల’సిలిండర్లు ఇస్తున్నామని, బీజేపీ అధికారంలోకి రాగానే ఏటా ఉచితంగా 4 సిలిండర్లు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు.
మంత్రి గంగుల కమలాకర్ అధికారంలో ఉండి ఏమీ చేయలేక.. తనపై అవినీతి ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. మంత్రి తెచ్చిన ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయని... ఇప్పటివరకు ఒక్క కంపెనీ కూడా ఆ భవనంలోకి రాలేదని, ఒక్కరికీ ఉద్యోగం దొరకలేదని బండి సంజయ్ ఆరోపించారు. గొల్లకుర్మలకు గొర్రెలు ఇస్తామని రూ. 46 వేలు డిపాజిట్ చేయించుకొని మోసం చేసిన చరిత్ర బీఆర్‌ఎస్‌దని ఆయన దుయ్యబట్టారు.
రేషన్ మంత్రిగా ఉండి ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని, బీసీ మంత్రిగా ఉండి ఒక్కరికి బీసీ బంధు ఇవ్వలేదని ఆరోపించారు. పౌరసరఫరాలశాఖ మంత్రిగా రూ. 1,300 కోట్లను గోల్‌మాల్ చేశారని తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు భూకబ్జాదారులని, ఎవరి చరిత్ర ఏమిటో బేరీజు వేసుకొని ఓటేయాలని ప్రజలను సంజయ్ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment