సాక్షి, సిద్ధిపేట: ఏదేమైనా దుబ్బాకలో కాషాయ జెండా ఎగురుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. జిల్లాలో మిరుదొడ్డి మండలం మోతె గ్రామం ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్, అభ్యర్థి రఘునందన్ రావు, మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. సిద్దిపేట సీపీ ప్రవర్తన చూస్తే అమరులైన పోలీసులు, తెలంగాణ ఉద్యమ అమరుడు శ్రీకాంత్‌చారి ఆత్మలు ప్రశాంతంగా ఉండవని వ్యాఖ్యానించారు. తప్పుడు ప్రచారం చేస్తున్న టీఆర్‌ఎస్‌కు ఈ ఎన్నికలో గుణపాఠం చెబుతామని పిలుపునిచ్చారు. కేసీఆర్ దొడ్డు వడ్లు పండించి.. రైతులను సన్న వడ్లు పండించమనడం సరైంది కాదన్నారు. దుబ్బాక ప్రజల తీర్పు ముఖ్యమంత్రి అహంకారానికి ప్రతీక కావాలని ఆయన పిలుపునిచ్చారు. దుబ్బాక నియోజకవర్గానికి కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇచ్చిందో తేల్చుకుందామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని అన్నారు. (చదవండి: బండి సంజయ్ అరెస్ట్; సీఎస్, డీజీపీకి నోటీసులు)
రఘునందన్ గెలిచిన వారం రోజుల్లో మల్లన్నసాగర్ బాధితులకు పూర్తి న్యాయం చేస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. మంత్రి పదవి కాపాడుకోడానికే హరీష్ రావు ఓట్లడుగుతున్నారని, కరీంనగర్ తరహాలో యువత ఒక్కటై టీఆర్‌ఎస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. కమలం గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం దుబ్బాక అభ్యర్థి రఘునందన్ రావు మాట్లాడుతూ... దేశంలో రామరాజ్యం నడిస్తే.. తెలంగాణలో రజాకార్ల రాజ్యం నడుస్తుందని ధ్వజమెత్తారు. దుబ్బాక ఉప ఎన్నికల ఫలితాలు కేసీఆర్, హరీష్‌రావు అహంకార పతనానికి నాంది కావాలన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే అది మురిగిపోయినట్టే.. టీఆర్‌ఎస్‌కు పోయినట్టేనని, బీజేపీని గెలిపిస్తే చింతమడక తరహాలో దుబ్బాకలో ఇంటింటికి పది లక్షలు ఇప్పిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. (చదవండి: దుబ్బాక రాజకీయం.. నోట్లకట్టల లొల్లి)
దుబ్బాక నుంచే యుద్ధం మొదలు: బండి సంజయ్
దుబ్బాక నియోజకవర్గం కాసులాబాద్ ఎన్నికల ప్రచారంలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘సీపీ టీఆర్ఎస్ కార్యకర్త. అతడి సంగతి ఎన్నికల తర్వాత చెప్తాం. అందుకే ఇక్కడికి ఎవరిని తేవాలో వారిని తెచ్చాం. సిద్దిపేట సీపీ జోయల్ డేవిస్ ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నారా? వార్డ్ మెంబర్ కూడా కాలేరు. మానసిక క్షోభతో రామలింగారెడ్డి చనిపోయారు. రామలింగారెడ్డి కొడుకును ఎందుకు దాచి పెట్టారు? ఇక్కడ టీఆర్‌ఎస్ గెలిస్తే ముగ్గురు ఎమ్మెల్యేలు అవుతారు. దుబ్బాక నిర్లక్ష్యానికి ఎందుకు గురి అయింది? టీఆర్‌ఎస్‌పై యుద్ధం దుబ్బాక నుంచే మొదలవ్వాల’ని పిలుపునిచ్చారు. (చదవండి: నోటీసులు ఇచ్చే... తనిఖీలు చేశాం)
Comments
Please login to add a commentAdd a comment