
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే నెల 15 నుంచి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ విడతలో 20 రోజులపాటు 12, 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 200–240 కి.మీ మేర పాద యాత్ర నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతీమాత ఆలయంలో పూజ చేసి భైంసాలో మొదలుపెట్టి కరీంనగర్‌లో ముగించేలా యాత్రకు రూపకల్పన చేశారు. వచ్చేనెల మొదటివారంలో మునుగోడు ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించిన పక్షంలో యాత్ర తాత్కాలికంగా వాయిదాపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
4 విడతల్లో 1,260 కి.మీ.
గతేడాది ఆగస్టు 28న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి సంజయ్ పాదయాత్ర మొదలుకాగా మధ్య మధ్యలో బ్రేక్‌లు ఇస్తూ 4 విడతలు సాగింది. నాలుగో విడత ఈ నెల 22న రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలో ముగిసింది. నాలుగు దశల్లో మొత్తం 102 రోజులపాటు 48 అసెంబ్లీ స్థానాల్లో 1,260 కి.మీ మేర సాగింది. ఒక్కో విడతలో భిన్నమైన సమస్యలు, అంశాలను ఎంచుకుని యాత్ర సాగింది. (క్లిక్: కేసీఆర్ పర్యటనల కోసం రూ.80 కోట్లతో ప్రత్యేక విమానం)