సమావేశంలో మాట్లాడుతున్న బండి సంజయ్. చిత్రంలో ప్రధాని మోదీ, నడ్డా
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రజా సంగ్రామ యాత్ర స్ఫూర్తిని ఇతర రాష్ట్రాలూ కొనసాగించాలని ప్రధాని మోదీ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలకు పార్టీని చేరువ చేసిన మాదిరే ఇతర రాష్ట్రాల్లోనూ యాత్రలు నిర్వహించి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల చివరి రోజున ప్రధాని మోదీ ముగింపు ఉపన్యాసం చేశారు.
ఈ సందర్భంగా బండి ప్రజా సంగ్రామ యాత్రను ప్రస్తావించారు. ‘సార్వత్రిక ఎన్నికలకు కేవలం 400 రోజులే సమయముంది. ఈ ఏడాదే 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల రాష్ట్రాలతో పాటు, కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలంటే పార్టీ శ్రేణులు, నేతలు మరింతగా ప్రజల్లోకి వెళ్లాలి. వారితో మమేకం కావాలి. అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్లారు. ప్రభుత్వ అణిచివేతను ఎదుర్కొని నిర్వహించిన ఈ యాత్రకు మంచి స్పందన లభించింది.
ఇలాంటి యాత్రల ద్వారా ప్రజలతో మమేకం అవ్వొచ్చు. వారి సమస్యలు వినే అవకాశం ఉంటుంది. తద్వారా వాటికి పరిష్కారాలు దొరుకుతాయి. ఇలాంటి యాత్రలే దేశంలో అవసరమైన అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించండి’ అని మోదీ చెప్పారు. ఇదే సమయంలో యాత్ర జరుగుతున్న తీరును ప్రతి రాష్ట్రం నుంచి ఐదుగురు సభ్యులు బృందాలుగా వెళ్లి యాత్ర అనుభవాలు గమనించాలని, ప్రజల స్పందనను వినాలని ఆయన సూచించారు.
తెలంగాణలో పార్టీ మెరుగు: అమిత్ షా
ఇక జాతీయ కార్యవర్గాల సమావేశాల భేటీ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ జేపీ నడ్డా నేతృత్వంలో పార్టీ అద్భుతంగా పనిచేసిందని, ప్రజలకు సేవ చేసిందని కొనియాడారు.
నడ్డా అధ్యక్షతన మహారాష్ట్ర, హరియాణాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయగా, యూపీ ఉత్తరాఖండ్, మణిపూర్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించిందని కొనియాడారు. ఆయన నేతృత్వంలోనే పశ్చిమబెంగాల్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పార్టీ గణనీయంగా మెరుగుపడిందని, చెప్పుకోదగ్గ విజయాలు సాధించిందని అన్నారు.
రెండో రోజు మరో ముగ్గురు: కాగా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణకు పార్టీ నాయకత్వం చాలా ప్రాధాన్యాన్నిచ్చింది. సమావేశాల మొదటి రోజున తెలంగాణలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్రపై బండి సంజయ్ ప్రజెంటేషన్‌ను ఇవ్వగా, రెండో రోజు దేశంలోని పరిస్థితులపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టగా, సామాజిక, ఆర్ధిక అంశాలపై వివేక్ వెంకట్‌స్వామి, కేంద్ర పథకాలపై పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడారు.
అధికారమే లక్ష్యంగా కొట్లాడండి: నడ్డా
తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా కొట్లాడాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర నేతలకు పిలుపునిచ్చారు. నడ్డా పదవీకా లాన్ని పొడిగించిన నేపథ్యంలో కార్యవర్గ సమావేశం అనంతరం బండి సంజయ్, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఇంద్రసేనారెడ్డి తదితరులు ఆయన్ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించిన నడ్డా తెలంగాణలో పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. తాను కూడా తరచూ తెలంగాణలో పర్యటిస్తానని నేతలకు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment