సాక్షి, హైదరాబాద్: ’’ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని మేము అడిగితే తలకాయ ఉన్నోడు చేయడు అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడ్డాయని ప్రకటన చేశారు. బిల్లును పెండింగ్‌లో పడేటట్టు చేసి తప్పించుకునే పనిలో కేసీఆర్ ఉన్నారు.
అని కాంగ్రెస్ శాససనసభా పక్షం నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. బిల్లు విషయంలో కుంటి సాకులు ఎందుకని ప్రశ్నించారు. శనివారం సభ వాయిదా పడిన అనంతరం ఎమ్మెల్యేలు శ్రీధర్ బాబు, సీతక్కలతో కలిసి ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. 60 రోజులు జరగాల్సిన శాసనసభా సమావేశాలను గరిష్టంగా 10 రోజులకు కుదించిన ఘనత బీఆర్‌ఎస్ ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు.
కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
ప్రతిపక్షాలు లేవనెత్తిన సమస్యలపై కేటీఆర్ అసెంబ్లీలో అడ్డగోలుగా మాట్లాడారని భట్టి విమర్శించారు. ప్రతిపక్ష నేతలను పందులు, కుక్కలు, గాడిదలు అని మాట్లాడటం చూస్తుంటే సభకు ఎందుకు వస్తున్నామా అని అనిపిస్తోందన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉండేది రెండు నెలలేనని, ఇప్పుడు బుకాయించినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వారి తప్పులు తేలుస్తామని హెచ్చరించారు.
సభ నడిపే విధానం ఇది కాదని, ఈ విషయంపై ఆదివారం స్పీకర్‌ని కలుస్తామని చెప్పారు. ఎమ్మెల్యే శ్రీధర్ బాబు మాట్లాడుతూ సమస్యలు చెప్తే ఓపికగా వినాల్సిన మంత్రులు అసహనంతో మాట్లాడుతున్నారని, మంత్రుల తీరును రాష్ట్ర ప్రజలు గమనించాలని కోరారు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా ప్రజల పక్షాన బాధ్యతతో తాము చెపుతున్నామని, ప్రతిపక్షాలకు అవకాశం ఇచ్చే విషయంలో సభ హుందాతనం కాపాడే విధంగా స్పీకర్ వ్యవహరించాలని కోరారు.
అసెంబ్లీనా. బీఆర్‌ఎస్ కార్యాలయమా?: శ్రీధర్
ఈ అసెంబ్లీ తీరు చూస్తుంటే ప్రజలకు భరోసా ఇచ్చే వేదికలా లేదని, బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలా మారిందని శ్రీధర్‌బాబు వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ వరద బాధితులకు అసెంబ్లీ ద్వారా భరోసా ఇస్తారని తాము అనుకున్నామని, అలా కాకుండా అసెంబ్లీని పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. టిఫిన్ చేయడానికి తాము బయటకు వెళితే సభలో కాంగ్రెస్ సభ్యులు లేరనే ప్రజలకు అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment