నేతల ఉత్సాహ పూరిత ప్రసంగాల్లో అప్పుడప్పుడు పొరపాట్లు దొర్లుతుంటాయి. తాజాగా బీహార్ సీఎం నితీష్ కుమార్ పొరపాటుగా ఒక వ్యాఖ్యానం చేసి, నలుగురిలో నవ్వులపాలయ్యారు.
సీఎం నితీశ్ కుమార్ ఎన్నికల ప్రసంగాల్లో జనాన్ని ఉత్సాహపరిచేందుకు రకరకాల వ్యాఖ్యానాలు చేస్తుంటారు. ఈ నేపధ్యంలో ఒక్కోసారి తడబటడం, నోరు జారడం లాంటివి జరుగుతుంటాయి. తాజాగా ఆదివారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో సీఎం నితీష్ టంగ్ స్లిప్ అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలను కోరారు.
బీహార్‌లోని పట్నా సాహిబ్ లోక్‌సభ నియోజకవర్గంలోని దానియావాన్‌లో బీజేపీ నేత, ఎన్డీఏ అభ్యర్థి రవిశంకర్ ప్రసాద్‌కు మద్దతుగా బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా వేదికపై ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ ప్రసంగిస్తూ, లోక్‌సభలో బీజేపీ 400కు పైగా సీట్లను గెలుచుకుంటుందని, ప్రజలంతా మరోసారి ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రిని చేయాలని కోరారు. నితీష్ నోటివెంట ఈ మాట రాగానే అక్కడున్నవారంతా షాక్ అయ్యారు. అయితే వేదికపై ఉన్న ఇతర నేతలు జరిగిన పొరపాటును సీఎంకు గుర్తు చేశారు. దీంతో ఆయన.. ప్రధాని మోదీ మరోసారి దేశానికి ప్రధాని అవుతారని సర్దిచెప్పారు.
గతంలోనూ సీఎం నితీష్ కుమార్ ఇలా పలుమార్లు నోరు జారారు. వైశాలిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన లోక్ జనశక్తి పార్టీ అభ్యర్థి వీణా దేవికి మద్దతుగా ప్రసంగిస్తూ, బీహార్‌లోని 40 స్థానాల్లో ఎన్‌డీఏ గెలవాలని కోరుకుంటున్నానని, మన కూటమి దేశం మొత్తం మీద నాలుగు వేల సీట్లు గెలవాలని అభిలషిస్తున్నానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment