సాక్షి, న్యూఢిల్లీ : ఆపరేషన్ ఆకర్శ్, మిత్రపక్ష ఒత్తిళ్ళతో బిహార్ రాజకీయాలు మరోసారి వేడెక్కుతున్నాయి. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జేడీయూ, జీతన్ రాం మాంఝీ నేతృత్వంలోని హిందూస్థానీ అవామ్ మోర్చాలు ఈసారి రాజకీయ దుమారాలకు వేదికగా నిలవనున్నాయి. చాలా మంది ఆర్జేడీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమతో సంప్రదింపులు జరుపుతున్నారని, పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారని జేడీయూ నేతలు తరుచూ చేస్తున్న వ్యాఖ్యలకు ఒక కాంగ్రెస్ నేత మరింత బలాన్ని చేకూర్చారు. 11 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎన్‌డీఏలో చేరేందుకు సిద్ధపడుతున్నారని కాంగ్రెస్ నాయకుడు భరత్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బిహార్ రాజకీయాల్లో ఆరోపణలకు కేంద్రబిందువుగా మారాయి.
బిహార్‌లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలే పరిస్థితులున్నాయని కాంగ్రెస్ నేత భరత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నేత అజిత్ శర్మతో చెప్పానని కూడా ఆయన తెలిపారు. పార్టీ మారేందుకు సిద్ధమైన 11 మంది ఎమ్మెల్యేల పేర్లను సైతం సీఎల్పీ నాయకుడికి ఇచ్చానని, పార్టీని వీడేందుకు సిద్ధమైన వారిలో బిహార్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ మోహన్ ఝా కూడా ఉన్నారని భరత్ సింగ్ వ్యాఖ్యానించారు. మదన్ మోహన్ ఝా ఇప్పుడు మాజీ పీసీసీ అధ్యక్షుడు అశోక్ చౌదరి బాటలో పయనిస్తున్నారని భరత్ సింగ్ ఆరోపించారు. ఈ 11 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డబ్బు ఇచ్చి టికెట్ తీసుకొని ఎన్నికల్లో గెలిచారని ఆయన ఆరోపణలు చేశారు. వీరంతా త్వరలోనే ఎన్డీఏలో చేరుతారని ఆయన జోస్యం చెప్పారు. అంతేగాక 2020 అసెంబ్లీ ఎన్నికలలో పేలవమైన ప్రదర్శన కనబరిచిన తరువాత బిహార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య పరస్పర విభేదాలు తరచూ చర్చల్లో నిలుస్తున్నాయి.
అశోక్ చౌదరి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 2015 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 27 స్థానాలు గెలుచుకుంది. అప్పుడు జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్‌లు కలిసి నితీశ్ కుమార్ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అశోక్ చౌదరి ఆ ప్రభుత్వంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఆయన నితీశ్‌తోనే ఉన్నారు. ఆ తరువాత నితీశ్ మహాకూటమి నుంచి వైదొలిగి బీజేపీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు సైతం అశోక్ చౌదరి కాంగ్రెస్ పార్టీని వీడి జేడీయూలో చేరారు. ప్రస్తుతం చౌదరి విద్యా శాఖ మంత్రిగా, జేడీయూ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే రాష్ట్ర కాంగ్రెస్ పూర్తిగా చీలిపోతుందని అందరూ భావించారు. అయితే గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు.
ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే విషయంలో ఊగిసలాడుతున్నారు. ఒకవేళ బీజేపీ, జేడీయూల మధ్య అంతరాలు పెరిగి, ఆర్జేడీ ప్రయత్నాలు విజయవంతమైతే అప్పుడు పార్టీని ఎందుకు వీడామనే పశ్చాత్తాపం ఎదురవుతుందనే భయం కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఉందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
మరో మంత్రి పదవి కావాలంటున్న మాంఝీ
బిహార్ రాజకీయాల్లో రాజకీయ ఒత్తిళ్ళు ఊపందుకుంటున్నాయి. ఎన్డీఏ భాగస్వామ్యపక్షంగా ఉన్న హిందూస్థానీ అవామ్ మోర్చా (హెచ్‌ఏఎం) జాతీయ అధ్యక్షుడు జీతన్ రాం మాంఝీ ఎన్డీఏపై తనదైన శైలిలో ఒత్తిడి పెంచుతున్నారు. త్వరలో శాసన మండలికి నామినేట్ చేయబోయే 12 నుంచి 14 సీట్లలో కనీసం ఒకటైనా తమకు కచ్చితంగా కేటాయించాలని మాంఝీ తెలిపారు. బుధవారం హెచ్‌ఏఎం జాతీయ కార్యకారిణి సమావేశం అనంతరం మాంఝీ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. బిహార్ కేబినెట్ విస్తరణలో ఎలాంటి ప్రతిష్టంభన లేదని, జనవరి 14 తర్వాత జరుగబోయే విస్తరణలో తమ పార్టీకి మరో మంత్రి పదవి ఇవ్వాలని కోరారు. ఈ విషయంలో నితీశ్ కుమార్‌ను నమ్ముతున్నామన్న ఆయన, ఎన్నికల్లో ఒకవేళ ఏడు స్థానాల్లోనూ గెలిచి ఉంటే, అధికార పీఠంపై ఎవరు కూర్చోవాలో నిర్ణయించేవారమని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment