పట్నా(బిహార్): కేంద్ర ప్రభుత్వం కుల ప్రాతిపదికన జనాభా గణనను నిర్వహించాలని రాష్ట్రీయ జనతా దళ్(ఆర్‌జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ డిమాండ్ చేశారు. కుల గణన తర్వాత మొత్తం జనాభాలో ఎస్‌సీ, ఎస్‌టీ, ఓబీసీల సంఖ్య సగం కంటే ఎక్కువగా ఉందని తేలితే ఆ మేరకు రిజర్వేషన్లలో తగిన ప్రాధాన్యత దక్కాలని ఆయన అభిలషించారు.
మొత్తం జనాభా కంటే ఈ వర్గాల జనాభా సగం కంటే ఎక్కువగా ఉంటే ఇప్పుడు అమలవుతోన్న 50 శాతం రిజర్వేషన్ పరిమితిని ఎత్తివేయాలని ఆయన అభిప్రాయపడ్డారు. బుధవారం ఆర్‌జేడీ పార్టీ కార్యకర్తల శిక్షణ కార్యక్రమంలో ఢిల్లీ నుంచి వర్చువల్ పద్ధతిలో ఆయన ప్రసంగించారు. ‘ స్వాతంత్య్రం రాక ముందు నాటి జనాభా ప్రాతిపదికనే రిజర్వేషన్ కోటాలను అప్పటి నుంచి ఇప్పటిదాకా కొనసాగిస్తున్నాం.
వేర్వేరు సామాజిక వర్గాల తాజా జనాభాలను లెక్కించి 50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై నిర్ణయాలు తీసుకోవాలి. కుల గణన చేపట్టాలని తొలిసారిగా డిమాండ్ చేసింది నేనే. ఈ డిమాండ్‌ను పార్లమెంట్ వేదికగా గతంలోనే నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. ఇప్పుడున్న కోటా ప్రస్తుత అవసరాలకు సరిపోదు. రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో అమలుకు నోచుకోవట్లేదు’ అని లాలూ వ్యాఖ్యానించారు.
లాలూ చిన్న కుమారుడు, ఆర్‌జేడీ నేత తేజస్వీ యాదవ్ సైతం కుల గణన అంశాన్ని ప్రధాని మోదీ వద్ద ఇటీవల ప్రస్తావించారు. ఆరోగ్యం కుదుటపడ్డాక త్వరలోనే బిహార్‌లో అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని లాలూ చెప్పారు. దాణా కుంభకోణం, తదితర కేసుల్లో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తూ, మరి కొన్ని కేసుల్లో ఆయన నిందితుడిగా ఉన్న సంగతి తెల్సిందే. అనారోగ్యం, మెరుగైన చికిత్స కారణాలతో బెయిల్ లభించడంతో ఈ ఏడాది జైలు నుంచి బయటికొచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో చికిత్స తీసుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment