సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతులందరికీ రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నారు బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. రాష్ట్రంలో 17వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఎంటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక, రైతుభరోసా ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు.
కాగా, ఏలేటీ మహేశ్వర్ రెడ్డి శనివారం అసెంబ్లీ ప్రెస్ కాన్ఫరెన్స్ హాల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. స్పెషల్ డ్రైవ్ పెడుతున్నారు అంటే.. అందరికీ రుణమాఫీ కాలేదని ఒప్పుకుంటున్నారు కదా?. మీరు చెప్పిన గ్రామానికే వెళ్దాం. అక్కడ రైతులను అడుగుదాం. సీఎం రేవంత్ మీరు వస్తారా? లేక మీ వ్యవసాయశాఖ మంత్రి వస్తారా? రండి. రైతులందరికీ రుణ మాఫీ జరిగిందని నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటా.. లేదంటే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా?. కేవలం 17వేల కోట్లతో రుణమాఫీ చేసిన ఫార్ములా ఎంటో చెప్పాలి. తీసుకున్న రెండు లక్షల రుణానికి నాలుగు ఐదు వేల వడ్డీ అయ్యిందని రుణమాఫీ కాలేదని గ్రామాల్లో రైతులు ఆందోళన చెందుతున్నారు.
రుణమాఫీ విషయాన్ని డైవర్ట్ చేసేందుకు బీఆర్‌ఎస్, బీజేపీ విలీనం అని రేవంత్ కొత్త డ్రామా ఆడుతున్నారు. బీజేపీ ఏం చేసినా ప్రజాస్వామ్య పద్ధతిలో ఉంటుంది. లోకల్ బాడీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. ఇది కేవలం డైవర్ట్ పాలిటిక్స్. బీఆర్‌ఎస్ విలీనానికి బీజేపీ ఎందుకు ఒప్పుకుంటుంది?. అంత అవసరం మాకేముంది?. పూర్తి రుణమాఫీ ఎప్పుడు చేస్తారో చెప్పాలి. కాంగ్రెస్ అసలు రూపం బయటపడింది. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి రైతాంగాన్ని మోసం చేసింది. అన్ని దేవుళ్ళ మీద ఒట్టు వేసి రైతులందరికీ రుణమాఫీ చేస్తానని రేవంత్ చెప్పారు.
తెలంగాణలో 60 లక్షల మంది రైతులు ఉన్నారు. వీరందరికీ రుణమాఫీ కావాలంటే రూ.49వేల కోట్లకుపైగా డబ్బులు అవసరం. ఏరోజు వరంగల్‌లో సభ పెడతారో చెప్పండి. ఆ సభలో రుణమాఫీ చేయని రైతులతో సభ నిండుతుంది. రుణమాఫీ అయిన అర్హుల జాబితాను బయట పెట్టండి. పెట్టుబడి సహాయాన్ని రుణమాఫీకి ఉపయోగించారు. రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదు.. ఎప్పటి లోపు ఇస్తారు?. రైతు భరోసా ఇవ్వకుండా ఎన్నికలకి ఎలా వెళ్తారు?. రుణమాఫీ చేయలేదు కాబట్టి రేవంత్ కట్టుకథలు ఆడుతూ ఎమ్మెల్యేల ఆఫీసుల మీద దాడులు చేయిస్తున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment