చంఢీగఢ్: సార్వత్రిక ఎన్నికలు బీజేపీ 400 సీట్లలో గెలిచి నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని కావాలని దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు జాబితాల్లో 267 మంది అభ్యర్థులను లోక్‌సభ ఎన్నికలకు ప్రకటించి.. ప్రచారంలో సైతం స్పీడ్ పెంచింది. మరోవైపు బీజేపీ.. ఎన్డీయే కూటమి విస్తరణపై కూడా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. పంజాబ్‌లోని శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఏడీ) బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమిలో చేరడానికి చర్చలు జరగుతున్నాయని బీజేపీ పార్టీ సీనియర్ నేత ఎస్‌ఎస్ చన్నీ తెలిపారు.
‘ఇరుపార్టీల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. మరికొంత సమయం పడుతుంది. శిరోమణి అకాలీదళ్ మార్చి 22న కోర్ కమిటీ సమావేశం నిర్వహించనుంది. అనంతరం వాళ్లు నిర్ణయం తీసుకోనున్నారు. ఇరు పార్టీల మర్యాదపూర్వక సమావేశం జరగనుంది. ఇరుపార్టీల పొత్తుకు సంబంధించి బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది’ అని ఎస్‌ఎస్ చన్నీ వెల్లడించారు.
శిరోమణి అకాలీదళ్ కోర్ కమిటీ సమావేశం ఛండీగఢ్‌లో జరుగనుంది. ఎస్‌ఏడీ పార్టీ జనరల్ సెక్రటరీ దల్జీత్ సింగ్ చీమా తమ కోర్ కమిటీ సమావేశంలో ఎన్నికల వ్యహరించాల్సిన వ్యూహాలు, పొత్తులపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కోర్ కమిటీలో మీటింగ్‌లో దేశం, రాష్ట్రంలోని అన్ని విషయాలపై చర్చిస్తామని తెలిపారు. అదేవిధంగా తమతో భావ సారూప్యత ఉన్న పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉన్నట్లు చెప్పకనే చెప్పారు. అయితే బీజీపీతో మళ్లీ పొత్తు విషయంలో శిరోమణి అకాలీదళ్ ముందు నుంచి వెనకడుగు వేస్తోంది. అయితే రైతుల పంటలకు మద్దతు ధర, సిక్కు ఖైదీల విడుదల విషయంలో ఎస్‌ఏడీ బీజేపీని వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.
పొత్తు వ్యవహారంపై పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా స్పందిస్తూ.. శిరోమణి అకాలీదళ్ ఆసక్తికే వదిలేస్తున్నామని తెలిపారు. ఎందుకంటే వారిది రైతు సమస్యలపై పోరాడే, మత సిద్ధాంతాలతో కూడుకున్న పార్టీ అని అన్నారు. ఇక.. ఎస్‌ఏడీ బీజేపీతో పొత్తుపెట్టుకుంటే బీజేపీ బలపడుతుంది. కానీ.. రైతుల సమస్యలపై పోరాటం చేసే ఎస్‌ఏడీకి ఈ పొత్తు నష్టం కలిగిస్తుందన్నారు.
ఇక.. 2020లో కేంద్ర తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ.. శిరోమణి అకాలీదళ్ ఎన్డీయే కూటమి నుంచి వైదోలగింది. అయినప్పటికీ ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చే పలు చట్టాలకు ఎస్‌ఏడీ మద్దతు ఇస్తూ వస్తోంది. మరోవైపు బీజేపీ ప్రభుత్వం తీసుకు వచ్చిన ‘ఒకే దేశం-ఒకే ఎన్నిక’, పౌరసత్వ సవరణ చట్టాన్ని మాత్రం ఎస్‌ఏడీ బహిరంగానే వ్యతిరేకించింది.
చదవండి: CAAపై స్టేకు సుప్రీం నిరాకరణ.. పిటిషన్లపై కేంద్రానికి నోటీసులు
Comments
Please login to add a commentAdd a comment