Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
పోరాటాల పురిటి గడ్డగా పేరొందిన పంజాబ్‌లో ఎన్నికల పోరు ఎప్పుడూ హై ఓల్టేజ్‌లో ఉంటుంది. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ)లను గత అసెంబ్లీ ఎన్నికల్లో ఊడ్చిపారేసిన ఆమ్ ఆద్మీ పార్టీ లోక్‌సభ ఎన్నికల్లోనూ దుమ్ము రేపే ప్రయత్నంలో ఉంది. జాతీయ స్థాయిలో ఇండియా కూటమి భాగస్వాములైన ఆప్, కాంగ్రెస్ పంజాబ్‌లో మాత్రం విడిగా పోటీ చేస్తూ పరస్పరం తలపడుతుండటం విశేషం. గత లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కొల్లగొట్టిన కాంగ్రెస్ ఈసారీ సత్తా చాటాలని చూస్తోంది. అకాలీ–బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమికి ఆ ఎన్నికల్లో అంతంత ఫలితాలే వచ్చాయి. రైతు ఉద్యమం నేపథ్యంలో బీజేపీకి అకాలీ కటీఫ్‌తో పంజాబ్‌లో ఈసారి పారీ్టలన్నీ ఒంటరి పోరాటమే చేస్తున్నాయి... స్టేట్స్కాన్పంజాబ్ ఎన్నికల్లో కొన్నేళ్లుగా అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ మొత్తం 13 చోట్లా ఒంటరి పోరాటం చేసి ఏకంగా 8 స్థానాలు చేజిక్కించుకుంది. అకాలీదళ్ 10, బీజేపీ మూడు చోట్ల పోటీపడ్డా చెరో రెండు సీట్లతో సరిపెట్టుకున్నాయి. 2014 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్యంగా 4 సీట్లు కొల్లగొట్టిన కేజ్రీవాల్ పార్టీ అన్నిచోట్లా పోటీ చేసి ఒక్క స్థానానికే పరిమితమైంది. ఆ తర్వాత పంజాబ్‌లో రాజకీయాలు సమూలంగా మారిపోయాయి. 2020లో మోదీ సర్కారు వ్యవసాయ సంస్కరణ చట్టాలపై వ్యతిరేకంగా పంజాబ్‌లో వ్యతిరేకత తారస్థాయిలో వ్యక్తమైంది. ఆ దెబ్బకు 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, అకాలీదళ్ కుదేలయ్యాయి. సరికొత్త రాజకీయాల వాగ్దానంతో ఆప్ అధికారాన్ని తన్నుకుపోయింది. బీజేపీకి మళ్లీ ‘రైతు’ గండం... హస్తినతో పాటు దేశాన్నీ కుదిపేసిన సాగు చట్టాల వ్యతిరేక ఉద్యమ సారథులు పంజాబ్ రైతులే. వారి ఆగ్రహ ప్రభావం ఎక్కడ తమపై పడుతుందోననే ఆందోళనతో అకాలీదళ్ 2020లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నా లాభం లేకపోయింది. సుర్జీత్ సింగ్ బర్నాలా, ప్రకాశ్ సింగ్ బాదల్ వంటి దిగ్గజాల సారథ్యంలో వెలుగు వెలిగిన పార్టీ ఇప్పుడు పంజాబ్‌లో ఎదురీదుతోంది. తాజాగా మరోసారి రైతులు ‘చలో ఢిల్లీ’ అంటూ ఆందోళనల బాట పట్టడం పంజాబ్‌లో బీజేపీకి విషమ పరీక్షగా మారింది. ప్రచారంలోనూ కమలనాథులకు రైతుల నుంచి నిరసనల సెగ బాగానే తగులుతోంది. అభివృద్ధి నినాదం, మోదీ ఫ్యాక్టర్‌తోనే తదితరాలనే నమ్ముకుని బీజేపీ ఒంటరి పోరాటం చేస్తోంది. కెపె్టన్ అమరీందర్ తన పంజాబ్ లోక్ కాంగ్రెస్‌ను 2022లో బీజేపీలో విలీనం చేశారు. కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆయన భార్య ప్రణీత్ కౌర్ కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోవడం విశేషం. లూధియానా కాంగ్రెస్ ఎంపీ రవ్నీత్ సింగ్ బిట్టూ కూడా బీజేపీలో చేరి పార్టీ టికెట్‌పై అక్కడి నుంచే పోటీ చేస్తున్నారు.కలి‘విడి‘గా కాంగ్రెస్, ఆప్... పంజాబ్‌లో నవ్‌జోత్‌సింగ్ సిద్ధూ, కెప్టెన్ అమరీందర్ సింగ్ వర్గ పోరు కాంగ్రెస్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. సిద్ధూకు పీసీసీ చీఫ్ పదవి కట్టబెట్టిన అధిష్ఠానం పార్టీ వీర విధేయుడైన కెపె్టన్‌కు పొమ్మనకుండా పొగబెట్టింది. దాంతో ఆయన వేరుకుంపటి పెట్టుకున్నారు. పర్యవసానంగా రెండేళ్లకే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తల బొప్పికట్టింది. 117 సీట్లకు ఏకంగా 92 చోట్ల గెలిచి ఆప్ ప్రభంజనం సృష్టించింది. ఢిల్లీ ఆవలా దుమ్ము రేపగలమని నిరూపించింది. ఆప్ నేత భగవంత్ మాన్ సీఎం అయ్యారు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమితో జట్టుకట్టిన ఆప్ పంజాబ్‌లో మాత్రం పొత్తుకు ససేమిరా అంది. దాంతో కాంగ్రెస్, ఆప్ విడిగానే పోటీ చేస్తున్నాయి. గతంలో రైతుల పోరాటానికి దన్నుగా నిలిచిన ఆ పార్టీలకు ఎన్నికల ముందు మళ్లీ రైతులు ఆందోళనలకు దిగడం కలిసి రానుంది. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత వంటి రైతుల డిమాండ్లను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో చేర్చడం విశేషం. 6 న్యాయాలు, 25 గ్యాంరటీలనూ విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కార్పొరేట్లతో బీజేపీ కుమ్మక్కు, అధిక ధరలు, నిరుద్యోగం వంటి అంశాలనూ గట్టిగా ప్రచారం చేస్తోంది.కేజ్రీవాల్ అరెస్టు ఆప్‌కు ప్లస్సా, మైనస్సా! ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో లోక్‌సభ ఎన్నికల ముందు కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడం సంచలనంగా మారింది. బీజేపీ కక్షగట్టి విపక్ష నేతలను జైల్లో పెడుతోందంటూ ఇండియా కూటమి దేశవ్యాప్తంగా మూకుమ్మడి ఆందోళనలకు దిగింది. తొలుత కాస్త తడబడ్డ ఆప్ నేతలు ప్రచారంలో జోరు పెంచారు. ‘జైల్ కా జవాబ్ ఓట్ సే’ (జైల్లో పెట్టినందుకు ఓటుతో జవాబిద్దాం) నినాదంతో దూసుకెళ్తున్నారు. కేజ్రీవాల్ భార్య సునీత ప్రచార బరిలో దిగడంతో ఆప్ కార్యకర్తల్లో ఉత్సాహం పెరిగింది. ఏమైనా ఎన్నికల ముంగిట అధినేత అందుబాటులో లేకపోవడం ఆప్‌కు ఇబ్బందికరమేనని కొందరంటుండగా, ఆప్‌కు సానుభూతి కలిసొస్తుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.సర్వేల సంగతేంటి.. పంజాబ్ రైతుల తాజా ఆందోళనలు బీజేపీపై ప్రభావం చూపవచ్చని సర్వేలు అంచనా వేస్తున్నాయి. 13 సీట్లలో ఆప్, కాంగ్రెస్‌లకే చెరో సగం దక్కవచ్చని లెక్కలేస్తున్నాయి. బీజేపీకి 2, అకాలీదళ్‌కు ఒక సీటు రావచ్చని కొన్ని సర్వేలు అంటున్నాయి.చిన్న రాష్ట్రమే అయినా ఐకే గుజ్రాల్, మన్మోహన్ సింగ్ రూపంలో పంజాబ్ ఏకంగా ఇద్దరు ప్రధానులను అందించింది. వారి జన్మస్థలాలు దేశ విభజనతో ప్రస్తుత పాకిస్తాన్‌లోని పంజాబ్‌లోకి వెళ్లిపోయాయి. పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీష్ జన్మస్థలమేమో మన పంజాబ్‌లో ఉండటం విశేషం.కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టినా ఆయన సిద్ధాంతాలను అరెస్టు చేయగలరా!? దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతు పలుకుతున్న లక్షలాది కేజ్రీవాల్‌లను ఏ జైల్లో పెడతారు? కేజ్రీవాల్ వ్యక్తి కాదు, భావజాలం. మోదీ సర్కారు వేధింపులను ఇండియా కూటమి కలిసికట్టుగా ఎదుర్కొంటుంది. బీజేపీ భారతీయ జుమ్లా పార్టీగా మారింది. – ఎన్నికల ర్యాలీలో పంజాబ్ సీఎం భగవంత్ మాన్ – సాక్షి, నేషనల్ డెస్క్