బెంగళూరు: అభిమాని హత్య కేసులో బెంగళూరు జైల్‌లో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్.. వీఐపీ ట్రీట్‌మెంట్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపింది.
‘‘దర్శన్ అనుచరుడు ఒకరు వచ్చి తనను సాయం కోరాడంటూ గతంలో డిప్యూటీ సీఎం(డీకే శివకుమార్) చెప్పారు. నాలుగైదు రోజుల కిందట.. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో తనిఖీలు జరిగి కొందరు ఖైదీల నుంచి ఫోన్లు సీజ్ చేసినట్లు ప్రకటించారు. మరి ఇప్పుడు దర్శన్ కాల్ మాట్లాడేందుకు ఫోన్ ఎక్కడి నుంచి వచ్చింది?.. ఈ ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిందే. ఈ వ్యవహారంలో డీకే శివకుమార్ హస్తం కూడా ఉందన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దెబ్బ తిన్నాయనడానికి జైళ్ల పరిస్థితులే నిదర్శనం’’ అని బీజేపీ ఎమ్మెల్యే అశోక ఆరోపించారు.
ఇదీ చదవండి: డీకే శివకుమార్‌తో దర్శన్ భార్య భేటీ
ఇక.. ఈ వ్యవహారంపై జేడీఎస్ అధినేత, కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి సైతం స్పందించారు. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో ఖైదీలకు ఫైవ్ స్టార్ హోటల్ ట్రీట్‌మెంట్ అందుతుందనే చర్చ ఈనాటిదేం కాదు. కొన్నేళ్లుగా ఆ చర్చ నడుస్తోంది. ఇప్పుడు ఈ అంశంపై సంబంధిత శాఖ ఎలా స్పందిస్తుందో చూడాలి అని అన్నారు. పనిలో పనిగా సిద్ధరామయ్య సర్కార్ పని తీరుపైనా ఆయన విమర్శలు గుప్పించారు.
మరోవైపు.. విమర్శల నేపథ్యంలో దర్శన్ వీఐపీ ట్రీట్‌మెంట్ ఎపిసోడ్‌పై సీఎం సిద్ధరామయ్య స్పందించారు. ఈ వ్యవహారంలో జైలు అధికారులదే తప్పని, కొందరు అధికారులు ఉదాసీనంగా వ్యవహరించిన మాట వాస్తవమేనని, ఇప్పటికే చర్యలు తీసుకున్నామని ప్రకటించారాయన.
జైలు గదిలో ఉండాల్సిన కన్నడ నటుడు దర్శన్ తూగుదీపకు.. రాచమర్యాదల అంశం చివరకు తొమ్మిది మంది జైలు అధికారులపై సస్పెన్షన్ వేటుకు దారితీసింది. స్వేచ్ఛగా జైల్లో తిరుగుతూ, సిగరెట్లు కాలుస్తూ, వీడియో కాల్ మాట్లాడినట్లు ఫొటో, వీడియో సామాజిక మాధ్యమాల్లో ప్రత్యక్షమవడంతో కర్ణాటక పోలీసు శాఖ క్రమశిక్షణా చర్యలకు దిగింది. జైల్లో ఉన్న రౌడీషీటర్ వేలు ఈ ఫొటోను రహస్యంగా సెల్‌ఫోన్‌లో తీసి బయట ఉన్న తన భార్య సెల్‌ఫోన్‌కు పంపించడంతో ఇది వెలుగు చూసింది. జైలు చీఫ్ సూపరింటెండెంట్, జైలు సూపరింటెండెంట్‌సహా 9 మందిని సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర హోం మంత్రి జి.పరమేశ్వర సోమవారం ప్రకటించారు.
‘‘చీఫ్ సూపరింటెండెంట్ స్థాయిలో తప్పిదం జరిగింది. అసలు ఫోన్లు, కురీ్చలు, సిగరెట్లు, టీ, కాఫీలు ఎవరు సమకూర్చారో దర్యాప్తుచేస్తున్నాం. సీనియర్ ఐపీఎస్‌తో విచారణ జరిపిస్తున్నాం. దర్శన్‌ను వేరే జైలుకు తరలించే అంశాన్నీ పరిశీలిస్తున్నాం’అని మంత్రి చెప్పారు. ‘‘ఆగస్ట్ 22న ఈ ఘటన జరిగింది. ఇలాంటి ఘటనలు పునరావృతంకాకుండా, జైల్లో ఫోన్లను గుర్తించే కృత్రిమ మేథ పరికరాలను బిగిస్తాం’’అని అదనపు డైరెక్టర్ జనరల్(జైళ్లు) మాలిని కృష్ణమూర్తి చెప్పారు.
జూన్ 9న సుమనహళ్లి వద్ద కాల్వలో రేణుకాస్వామి మృతదేహం లభ్యమైన కేసులో దర్శన్, అతని సన్నిహిత నటి పవిత్రా గౌడ సహా 17 మందిని పోలీసులు అరెస్ట్‌చేసి విచారణఖైదీలుగా కారాగారానికి పంపడం తెల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment