సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీఆర్‌ఎస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. బీజేపీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.
కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత బండి సంజయ్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పాదయాత్రకు బదులుగా బస్సు యాత్ర చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కాగా, ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగిసిన వెంటనే హైదరాబాద్‌లో బండి సంజయ్ ఆరో విడత పాదయాత్ర 10 రోజుల్లో ముగించేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు.
ఇదిలా ఉండగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన సోమ, మంగళవారాల్లో బీజేపీ జాతీయపదాధికారుల సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి డీకే అరుణ, ఎంపీ లక్ష్మణ్, మురళీధర్ రావు, పొంగులేటి హాజరుకానున్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్ బిజీగా ఉండటంతో ఈ సమావేశానికి హాజరుకావడం లేదు. ఇక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రత్యేకంగా తెలంగాణ పాలిటిక్స్‌పైనే బీజేపీ ఎక్కువ దృష్టి సారించినట్టు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment