రాజమహేంద్రవరం ఎంపీ స్థానంపై పట్టు.. అనపర్తిపై ఆశలు వదులుకున్న టీడీపీ
బీజేపీకి ఆఫర్ చేస్తున్న చంద్రబాబు
‘నల్లమిల్లి’కి ఎసరుపెట్టే ఎత్తుగడ
పరిశీలనలో సోము వీర్రాజు పేరు
పి.గన్నవరం నుంచి అయ్యాజీ వేమా సాక్షి ప్రతినిధి, కాకినాడ: బీజేపీకి ‘మూడొ’చ్చింది. విపక్ష కూటమిలోకి వచ్చీ రాగానే ఉమ్మడి తూర్పు గోదావరిలోని మూడు జిల్లాల్లో మూడు ఎమ్మెల్యే సీట్ల కోసం ఆ పార్టీ పట్టుపడుతోంది. లోక్‌సభ స్థానాలకు వచ్చేసరికి గతంలో తాము గెలుపొందిన రాజమహేంద్రవరం తమకు ఇవ్వాల్సిందేనని కమలనాథులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
ఇక్కడి నుంచి పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి, పార్టీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు, తణుకు మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ముళ్లపూడి రేణుక పేర్లు పరిశీలనలో ఉన్నాయని అంటున్నారు. దీంతోపాటు మూడు అసెంబ్లీ స్థానాలు కూడా కావాలనేది బీజేపీ ప్రధాన డిమాండ్‌గా ఉంది.
ఆ మూడు ఏవంటే
కమలనాథుల దృష్టి కాకినాడ సిటీ, అమలాపురం, పి.గన్నవరం, అనపర్తి అసెంబ్లీ స్థానాలపై పడింది. ఈ నాలుగింటిలో మూడింటిని బీజేపీ గట్టిగా డిమాండ్ చేస్తోంది. పట్టణ ఓటర్లు అధికంగా ఉన్న కాకినాడ సిటీ, గతంలో గెలుపొందిన పి.గన్నవరం (ఎస్సీ) స్థానంపై వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. పి.గన్నవరం నుంచి టీడీపీ తన అభ్యర్థిగా తొలుత సరిపల్లి రాజేష్ ను ప్రకటించింది. దీనిపై సొంత పార్టీతోపాటు వివిధ వర్గాల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు మిన్నంటాయి. ఈ నేపథ్యంలో రాజేష్ తనంత తానుగానే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు సామాజిక మాధ్యమాలలో వీడియో వైరల్ అయింది.
ఇక్కడ వివాదాల కారణంగా ఈ సీటును బీజేపీకి విడిచిపెట్టేస్తే ఎలా ఉంటుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు సహచర నేతలతో ఆలోచిస్తున్నట్టు కనిపిస్తోంది. పి.గన్నవరం నుంచి మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమాకు మద్దతుగా బీజేపీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నేతలు ఇప్పటికే పార్టీ పెద్దలకు ప్రతిపాదించారు. అమలాపురం సీటు కోసం టీడీపీ, జనసేనల్లో ఆశావహులు బస్తీ మే సవాల్ అంటూ కాలు దువ్వుతున్నారు. రోడ్డెక్కి రచ్చరచ్చ చేస్తున్నా ఇరు పార్టీల అగ్ర నాయకత్వాలు మాత్రం నోరు మెదపడం లేదు. దీనిపై ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో కూటమి నేతలున్నారు. ఇంకా తర్జనభర్జనలే
జనసేన తొలుత ఆశించిన కాకినాడ సిటీ విషయంలో కూటమి నుంచి ఇంతవరకూ స్పష్టత రాలేదు. కాకినాడ రూరల్ ఎలాగూ ఆ పార్టీకి ఖరారు చేయడం, పిఠాపురం నుంచి పోటీ చేయనున్నట్టు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించడంతో సిటీపై జనసేన ఆశలు వదిలేసుకుంది. పట్టణ ఓటర్లపై దృష్టి పెట్టిన బీజేపీ ఇప్పుడా సీటును ఆశిస్తోంది. సిటీ సీటు కోసం కైట్ విద్యా సంస్థల చైర్మన్ పోతుల విశ్వం, బీజేపీ నాయకుడు డాక్టర్ ముత్తా వంశీ పేర్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ రెండింటితోపాటు రాజమహేంద్రవరం సిటీ స్థానాన్ని కూడా బీజేపీ మొదటి నుంచీ కోరుతోంది.
ఈ స్థానానికి టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసును టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజమహేంద్రవరం సిటీ కాదన్న చంద్రబాబు..ఇదే జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉన్న అనపర్తిని బీజేపీకి వదిలేయాలని ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు. దీనిపై టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలు రావడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోంది. టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని పక్కన పెట్టి బీజేపీకి అనపర్తి సీటుని కేటాయిస్తారంటూ బలమైన ప్రచారమే జరుగుతోంది.
బీజేపీ నుంచి సోము వీర్రాజు పేరు ప్రతిపాదిస్తున్నారని కమలనాథులు చెబుతున్నారు. ఇందులో వాస్తవం ఉండబట్టే టీడీపీ ఇన్‌చార్జి నల్లమిల్లి కనుసన్నల్లోనే ఆయన అనుచరులు అనపర్తి ఎస్‌ఎన్‌ఆర్ కల్యాణ మండపంలో శనివారం హడావిడిగా మూడు మండలాల పార్టీ నేతలు సమావేశం ఏర్పాటు చేశారు. నల్లమిల్లికి సీటు ఇవ్వాల్సిందేనని తీర్మానించడమే కాకుండా రామవరంలోని ఆయన ఇంటికి ర్యాలీగా వెళ్లి సీటు విషయంలో సంఘీభావం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment