బీజేపీకే దక్షిణ భారత్‌: అమిత్‌ షా | BJP Leader Amit Shah On South India Winning | Sakshi
Sakshi News home page

బీజేపీకే దక్షిణ భారత్‌: అమిత్‌ షా

Published Sun, May 12 2024 5:23 AM | Last Updated on Sun, May 12 2024 5:23 AM

BJP Leader Amit Shah On South India Winning

దక్షిణ భారత రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు సాధిస్తాం: అమిత్‌ షా

తెలంగాణలో బీజేపీకి 10కిపైగా ఎంపీ సీట్లు వస్తాయి 

కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లు తెలంగాణను భ్రష్టుపట్టించాయి 

కాంగ్రెస్‌ సర్కారు హామీల అమల్లో పూర్తిగా విఫలమైంది 

ఇండియా కూటమి దేశాన్ని రెండుగా విభజిస్తోంది 

బీజేపీ ఉన్నంత వరకు అలా విభజన జరగనీయం 

రిజర్వేషన్లను రద్దు చేసే ఉద్దేశం మాకు లేదు.. 

మాకు పూర్తి మెజారిటీ ఉన్నా వాటి జోలికి వెళ్లలేదు 

ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన ముస్లింలు, క్రిస్టియన్లకు రిజర్వేషన్‌ హక్కు ఉంటుంది 

మత ప్రాతిపదికన ఇస్తున్న ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని పునరుద్ఘాటన

ఎన్నికల ప్రచారం ముగింపు సందర్భంగా మీడియాతో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి

సాక్షి, హైదరాబాద్‌: దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ అత్యధిక లోక్‌సభ సీట్లను సాధించి, అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించబోతోందని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో పది స్థానాలకుపైగా కచ్చితంగా గెలుస్తామని.. 13 సీట్లలో పార్టీ పరిస్థితి సంతృప్తికరంగా ఉందని చెప్పారు. కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల్లో ఎక్కువ సీట్లను బీజేపీయే గెలవబోతోందని పేర్కొన్నారు. ఈసారి 400 సీట్లు దాటుతామని చెప్పారు. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ముగియడానికి ముందు శనివారం సాయంత్రం కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, ఎంపీ కె.లక్ష్మణ్, బీజేపీ మల్కాజిగిరి అభ్యర్థి ఈటల రాజేందర్‌లతో కలసి అమిత్‌ షా మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 

‘‘అవినీతి, అక్రమాలు, కుటుంబ రాజకీయాలతో తెలంగాణ రాజకీయాలు భ్రషు్టపట్టాయి. దీనిని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే ఈసారి వీలైనన్ని ఎక్కువ సీట్లలో బీజేపీకి విజయాన్ని కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు. తెలంగాణలో 4% ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వడం ఎస్సీ, ఎస్టీ, బీసీల హక్కులను కాలరాయడమే. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే వాటిని రద్దు చేస్తాం. 

గ్యారంటీల అమల్లో కాంగ్రెస్‌ విఫలం: కాంగ్రెస్‌ ఆరు గ్యారంటీల అమల్లో విఫలమైంది. సోనియా పుట్టినరోజున రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కానీ సోనియా ఎన్నో పుట్టినరోజున అనేది చెప్పలేదు. రైతులకు రూ.15 వేల భరోసా, ధాన్యానికి రూ.500 బోనస్, మహిళలకు నెలకు రూ.2,500 ఇవ్వలేదు. అవేవీ చేయలేదు. కానీ కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలు హైకమాండ్‌కు ఇచ్చిన ఒక హామీ ని మాత్రం పూర్తిచేస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్‌ ఎన్నికల ఖర్చు కోసం తెలంగాణ నుంచి వసూలు చేసి పంపిస్తున్నారు. 

పీవోకే భారత్‌లో భాగమే.. 
ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా.. పాకిస్తాన్‌ దగ్గర అణుబాంబు ఉందంటూ కాంగ్రెస్‌ నాయకుడు మణిశంకర్‌ అయ్యర్, కూటమి నాయకుడు ఫారూఖ్‌ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు దేశ సమగ్రతను దెబ్బతీసేలా ఉన్నాయి. కశీ్మర్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోబోం. పీవోకే భారత్‌లో అంతర్భాగమే. రేవంత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు భారత్‌ జరిపిన సర్జికల్‌ స్ట్రైక్స్‌కు ఆధారాలు అడుగుతున్నారు. అలా స్ట్రైక్స్‌ చేసిన మూడో దేశం భారత్‌ మాత్రమే. దేశ సరిహద్దులు, అంతర్గత అంశాల్లో చొరబడేందుకు ఎవరు ప్రయత్నించినా చూస్తూ ఊరుకోబోం. వారి భూభాగంలోకి చొచ్చుకుని వెళ్లి మరీ దాడిచేస్తాం. 

ఇండియా కూటమి దేశాన్ని విభజిస్తోంది.. 
దేశాన్ని ఉత్తర, దక్షిణాలుగా కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీలు విభజన చేస్తున్నాయి. ఇప్పటికే దేశాన్ని కాంగ్రెస్‌ ఒకసారి విడగొట్టింది. వారికి అంతకన్నా ఇంకేం రాదు. బీజేపీ ఉన్నంత వరకు విభజన జరగనివ్వం. అరవింద్‌ కేజ్రీవాల్‌ నిర్దోషి అని కోర్టు తీర్పు ఇవ్వలేదు. కేవలం ఎన్నికల ప్రచారం కోసమే సమయం ఇచ్చింది. బెయిల్‌ రావడమే క్లీన్‌ చిట్‌ అనుకుంటే.. అంతకన్నా అమాయకత్వం ఇంకోటి ఉండదు. కాంగ్రెస్‌ రాహుల్‌ గాం«దీని 20సార్లు లాంచ్‌ చేసినా విజయవంతం కాలేదు. 21వసారి కూడా అదే విఫల ప్రయత్నం చేస్తోంది. 

వారి తీరుతో ఆర్థికంగా వెనుకబాటు 
2014లో తెలంగాణ రెవెన్యూ సర్‌ప్లస్‌ స్టేట్‌గా ఉంది. కానీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల కుటుంబ పాలన, అవినీతి, ఓటు బ్యాంకు రాజకీయాలతో రాష్ట్రం ఆర్థికంగా వెనుకబడింది. లక్షల కోట్లు అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఏటా రూ.80 వేల కోట్లు వడ్డీల కిందే కట్టాల్సిన దుస్థితి నెలకొంది. విభజనకు ముందు కేంద్రం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రూ.15వేల కోట్లు అందితే.. ఇవాళ ఒక్క తెలంగాణకే కేంద్రం నుంచి రూ.60వేల కోట్లు గ్రాంట్లుగా వస్తోంది. తెలంగాణలో మౌలిక వసతుల కోసం స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు అందిన నిధులకంటే.. మోదీ సర్కారు గత పదేళ్లలో రెట్టింపు నిధులు ఇచ్చింది. 

రిజర్వేషన్ల రద్దు ఉద్దేశమేదీ లేదు 
బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే కాంగ్రెస్‌ ప్రచారాన్ని అవాస్తవం. గత పదేళ్లుగా ఎన్డీయేకు లోక్‌సభలో మూడింట రెండొంతుల మెజారిటీ ఉంది. మేం రిజర్వేషన్లు రద్దు చేయాలనుకుంటే ఎప్పుడో చేసేవాళ్లం. కానీ మాకు ఆ ఉద్దేశం లేదు. మేం మా మెజారిటీని ఆర్టికల్‌ 370, ట్రిపుల్‌ తలాక్‌ రద్దుకు, రామాలయ నిర్మాణానికి వాడాం. ఏవైనా మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం. ఆర్థికంగా, సామాజికంగా, విద్యపరంగా వెనుకబాటుదనం ప్రాతిపదికన రిజర్వేషన్లను ముస్లింలు, క్రిస్టియన్లు పొందవచ్చు. 

దానికి మేం వ్యతిరేకం కాదు. నేరుగా ముస్లింలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి వ్యతిరేకం. ఈ అంశంపై నా మాటలను మారి్ఫంగ్‌ చేసి ప్రచారం చేశారు. ప్రధానిగా మోదీ వచ్చే ఐదేళ్ల టర్మ్‌ను పూర్తిచేస్తారు. దానిపై బీజేపీలో ఎలాంటి అనుమానాల్లేవు. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి పథంలో నిలపాలని మోదీ ప్రయత్నిస్తున్నారు. బీజేపీ ఇచ్చిన హామీల్లో 92 శాతం అమలు చేశాం. మూడు దశల ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారు. నాలుగో దశలోనూ మద్దతివ్వాలని కోరుతున్నాం’’అని అమిత్‌ షా పేర్కొన్నారు. 

మా ప్రగతి ఓవైపు.. వారి అవినీతి మరోవైపు.. 
ఓ వైపు ఇండి కూటమి.. మరోవైపు ఎన్డీయే కూటమి బరిలో ఉన్నాయి. ఓవైపు రూ.12 లక్షల కోట్ల అవినీతి కూటమి.. మరోవైపు 23 ఏళ్లుగా సీఎంగా, ప్రధానిగా ఉన్న మోదీపై 25 పైసల అవినీతి కూడా లేని కూటమి. అధికార అహంకారం తలకెక్కిన ఇండి కూటమి అటు.. సెలవు లేకుండా దీపావళిని కూడా సైనికుల మధ్య జరుపుకొనే మోదీ ఇటు.. నోట్లో బంగారు స్పూన్‌తో పుట్టి, కాస్త ఎండలు కాస్త పెరగగానే థాయ్‌లాండ్‌కో. మరో చోటికో వెళ్లే యువనేత అటు.. పేదింట్లో పుట్టి పెరిగి, పేదల కష్టాలు తెలిసి వాటిని దూరం చేస్తున్న మోదీ ఇటు.. గత పదేళ్లలో మేం దేశ అంతర్గత భద్రత, ఆరి్ధక వ్యవస్థ, మౌలిక వసతుల అభివృద్ధి, డిజిటల్‌ ఇండియా వంటివాటిలో గణనీయ ప్రగతి సాధించాం. 

రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థ రహితం 
తెలంగాణకు పెట్టుబడులు రాకుండా కేంద్రం కుట్రచేస్తోందన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం. రాష్ట్రాన్ని వారు నడుపుతున్న తీరును చూసి ఎవరూ పెట్టుబడులకు ముందుకు రావడం లేదు. అయినా పెట్టుబడులు కావాలంటే ప్రధానిని కలసి, అడిగితే బాగుంటుంది. అనవసర విమర్శలు సరికాదు. ప్రాంతీయ పార్టీలు తమ వాణిని వినిపించే అధికారం ఉంటుంది. కేసీఆర్‌కు కూడా ఆ అధికారం ఉంది. అంతే తప్ప బీజేపీతో పోల్చుకోవాలనుకోవడం హాస్యాస్పదం. ఎండోమెంట్‌ చట్టం తొలగింపు అంశం కోర్టు ముందుంది. కోర్టు ఏం చెబితే అదే చేస్తాం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement