మాట్లాడుతున్న బండి సంజయ్. చిత్రంలో లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: ‘దళితబంధులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్లు తీసుకుంటే.. మరో 30 శాతం కమీషన్ సీఎం కుటుంబానికి పోతోంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సచివాలయ నిర్మాణంతోపాటు భూ దందాల్లోనూ 60 శాతం కమీషన్లు వెళ్తున్నాయి. ఇది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు. సారు–కారు–60 పర్సంట్ భ్రష్టాచార్ సర్కార్’అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ 60 పర్సంట్ సర్కార్‌ను సాగనంపేదాకా తాము పోరాడతామని చెప్పారు.
సోమవారమిక్కడ జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో సంజయ్ మాట్లాడారు. ‘111 జీవో రద్దు అనేది మహా కుట్ర, బీఆర్‌ఎస్ కార్యాలయానికి కోకాపేట భూముల కేటాయింపు వెనుక కూడా కుట్ర ఉంది. వీటిపై న్యాయపోరాటం చేస్తాం’అని ప్రకటించారు. ‘రాష్ట్ర ప్రజలకు ప్రధాన విలన్ కేసీఆరే. కాంగ్రెస్ సైడ్ విలన్ పాత్ర పోషిస్తోంది.
బీఆర్‌ఎస్–కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీల చీకటి ఒప్పందాలను బయటపెడతామని పేర్కొన్నారు. ఈ భేటీలో జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్సీ కేవీఎన్ రెడ్డి, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌రెడ్డి, ఈటల, వివేక్ పాల్గొన్నారు.
జూన్ 30 దాకా ‘మహాజన సంపర్క్ అభియాన్’
కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, తెలంగాణకు చేకూర్చిన ప్రయోజనాలను ఇంటింటికీ తెలియజేసేలా ఈనెల 30 నుంచి జూన్ 30 దాకా ‘మహాజన సంపర్క్ అభియాన్’ నిర్వహిస్తా మని బండి సంజయ్ చెప్పారు. ‘ఒకనాడు ప్రధాని మోదీని విశ్వగురుగా, నిజాయితీపరుడిగా కీర్తించిన కేసీఆరే ఇప్పుడు ఆయనను అవినీతిపరుడు, రాక్షసుడంటూ తిడుతున్నారు.
ఇలాంటి విశ్వాస ఘాతకుడిని నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు’అని సంజయ్ మండిపడ్డారు. పదేళ్ల పాలనలో ఏం సాధించారని వందలకోట్లు ఖర్చుతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని నిలదీశారు. కాగా, బండి, బన్సల్ సమక్షంలో బీఆర్‌ఎస్ నేతలు గోవింద్ రాఠీ, మనోజ్, మాజీ మంత్రి శంకర్ రావు కుమార్తె సుస్మిత బీజేపీలో చేరారు.
పనిచేసేవారికే టికెట్లు: సునీల్‌బన్సల్
‘ఫ్లెక్సీలు పెట్టి, సొంత ఫొటోలతో వ్యక్తిగత ప్రచారం చేసుకునే వాళ్లు లీడర్లు కారు, ప్రజల్లోకి వెళ్లి పనిచేసే వారే నాయకులు. పార్టీ, ప్రజల కోసం పనిచేసే వారికే టికెట్లు ఇస్తాం. పార్టీ క్రమశిక్షణను అందరూ విధిగా పాటించాలి. గీత దాటితే కఠినచర్యలు తప్పవు’అని జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత ఇన్‌చార్జి సునీల్ బన్సల్ చెప్పారు.
‘బీజేపీ ముఖ్యనేతలు పార్టీ మారుతున్నట్టు, వారిలో ఈటల, వివేక్, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వంటి నేతలున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించకండి. మన ప్రత్యర్థులు రేవంత్‌రెడ్డి వర్గానికి చెందిన వారు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు’అని పార్టీ జాతీయ సంస్థాగత సహ ప్రధానకార్యదర్శి శివప్రకాష్ పేర్కొన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment