ఒకవైపు ఇంట్లో ప్రత్యర్థి.. మరోవైపు బయటి ప్రత్యర్థి. నిజామాబాద్ ఎంపీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న ఇంటా బయటా ప్రత్యర్థులు. ఎవరెంత ఇబ్బంది పెట్టినా తగ్గేదే లే అంటున్నా ఎంపీ అరవింద్. అదే రేంజ్‌లో ప్రత్యర్థులకు సవాళ్ళు విసురుతున్నారాయన. ఇంతకీ నిజామాబాద్‌లో రసవత్తర రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతుందో తెలుసుకోవాల్సిందే..
నిజామాబాద్ నగరంలో హఠాత్తుగా దర్శనమిచ్చిన వెలిసిపోయిన పసుపు కలర్ ఫ్లెక్సీలు తీవ్ర కలకలం రేపాయి. బీజేపీ ఎంపీ అరవింద్ ను ప్రశ్నిస్తూ.. ఆయనపై సెటైర్స్ వేసే రీతిలో ఫ్లెక్సీలు వెలిశాయి. ఇదే మా ఎంపీగారు తెచ్చిన పసుపు బోర్డ్ అంటూ రంగు వెలసిన పసుపు కలర్ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం రాజకీయంగా పెద్ద దుమారాన్నే రేపింది. జిల్లా కేంద్రంలో ప్రధాన కూడళ్లన్నింటి దగ్గరా ఈ ఫ్లెక్సీలు దారినపోయే అందరి దృష్టినీ ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీల వ్యవహారం బీఆర్ఎస్ ముఖ్యనేతల సోషల్ మీడియా గ్రూపుల్లోనూ వైరల్‌గా మారింది.
దాంతో పాటు.. ఆయా గ్రూపుల్లో బీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్ సమావేశాల్లో అడిగిన పసుపు బోర్డ్ ప్రతిపాదనకు సంబంధించిన ప్రశ్నావళి కాపీనీ.. అలాగే పసుపు బోర్డుపై గతంలో జిల్లాకు వచ్చినప్పుడు కేంద్రమంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత రాంమాధవ్ వంటివారిచ్చిన హామీలను వీడియోల రూపంలో విడుదల చేశారు. ఈ నేపథ్యంలో మరోసారి బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ.. కాదు కాదు ఎమ్మెల్సీ కవిత వర్సెస్ ఎంపీ అరవింద్ ఫైట్‌కు బీజం పడినట్లయింది.
సీఎం కేసీఆర్‌కు కౌంటర్..
పసుపు బోర్డు గురించి బీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై ఎంపీ అరవింద్ కూడా కొద్ది గంటల్లోనే స్పందించారు. అసలు ప్రశ్నలడగడం కూడా చేతకాని వాళ్లుగా బీఆర్ఎస్ ఎంపీలను అభివర్ణించారాయన. తమ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే.. మేము ఊరుకుంటామా అంటూ ప్రశ్నించారాయన. మీ నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కథ, రైతు రుణమాఫీ వంటి అంశాలన్నింటినీ పైకి తీసుకొస్తామని.. ఇకపై మా తడాఖా చూపిస్తామంటూ కౌంటర్ ఇచ్చారు అరవింద్. అంతేకాదు... వాళ్ల ప్రశ్నలు తనకే మెప్పు లభించేలా ఉన్నాయని గులాబీ పార్టీ ఎంపీలను ఎద్దేవా చేశారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా 30 కోట్ల రూపాయల వ్యయంతో స్పైస్ బోర్డును నిజామాబాద్‌లో ఏర్పాటు చేశారన్నారు. పసుపుకు మద్దతు ధర ఇవ్వడానికి కేంద్రం సిద్ధంగా ఉన్నా.. కనీసం లేఖ రాయడం కూడా చేతకాని వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నారంటూ సీఎం కేసీఆర్‌ను విమర్శించారు. పసుపు కూలీల ధరల పెరుగుదల సమస్య పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏం పరిష్కారం చూపిస్తుందని ఎంపీ అరవింద్ ప్రశ్నించారు.
రెండు సవాళ్లు ఇవే..
తండ్రి ధర్మపురి శ్రీనివాస్ 9 ఏళ్ళ తర్వాత కాంగ్రెస్ తీర్థం మరోసారి పుచ్చుకున్న 24 గంటల్లోపే.. ఆయనతో పార్టీకి రాజీనామా లేఖను విడుదల చేయించడంలో అరవింద్ సక్సెస్ అయ్యారు. అయితే తన సోదరుడైన సంజయ్‌తో మొదలైన ఇంటి పంచాయితీతో తలబొప్పి కట్టిన క్రమంలో అరవింద్‌కు ఇప్పుడు మళ్లీ బీఆర్ఎస్ నుంచి పసుపు బోర్డ్ పేరిట పోరు మొదలవ్వడంతో రెండు సవాళ్లనూ సమర్థవంతంగా ఎదుర్కొనడం ఓ సవాల్‌గానే మారింది.
మరోవైపు కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన కామెంట్స్ .. ఆయనపై అరవింద్ చేసిన కామెంట్స్ విషయంలో బీజేపీ అధిష్ఠానం కూడా అరవింద్ మీద గుర్రుగా ఉన్నట్లు ప్రచారంలోకొచ్చింది. ఈ క్రమంలో ఇంతకాలం అరవింద్‌తో అంటీముంటనట్టుగా ఉంటూ ఈ మధ్య ఆయనకు దూరమైన వారంతా బండి సంజయ్ వర్గంలో చేరుతున్నారనే టాక్ నడుస్తోంది. ఇలా పార్టీలోని అంతర్గత విభేదాలు కూడా అరవింద్‌ను ఎటూ మసలకుండా చేస్తున్నాయనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న ఓ ప్రధాన చర్చ.
-పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్
Comments
Please login to add a commentAdd a comment