సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు 6 గ్యరంటీలు అంటూ రాష్ట్ర ప్రజలను మరోసారి మోసగించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ సభలో రాహుల్ గాంధీ సహా ఇతర నాయకులు అలవికాని హామీలతో మోసం చేసి అధికారం దక్కించుకోవాలనే కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఈ ఆరు గ్యారంటీ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.
పార్టీనేతలు మాఘం రంగారెడ్డి, మాజీ మేయర్ బండా కార్తీక రెడ్డి, సీహెచ్ విఠల్, రాకేశ్‌రెడ్డి, జె.సంగప్పలతో కలిసి అరుణ మంగళవారం మీడియాతోమాట్లాడారు. ఒక సాధారణ వ్యక్తి దేశ ప్రధాని కావడం, మోదీ నాయకత్వంలో భారత ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతుండటాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోందన్నారు. గాంధీ పేరు పెట్టుకుని రాజకీయాలు చేసిన కాంగ్రెస్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రాభవం కోల్పోవడంతో మతఘర్షణలతో లబ్ధి పొందాలని చూస్తోందని విమర్శించారు.
కవిత లేఖతో బిల్లు పెడుతున్నారనడం హాస్యాస్పదం
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖతో మహిళా రిజర్వేషన్ బిల్లు పెడుతున్నారనడం హాస్యాస్పదమని అరుణ వ్యాఖ్యానించారు. బీఆర్‌ఎస్ ప్రకటించిన అభ్యర్థుల్లో మహిళలకు కనీసం 15% రిజర్వేషన్ ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. పేదలకు ఇళ్లు కట్టించేది కేంద్ర ప్రభుత్వ నిధులతోనా లేక రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనో కాంగ్రెస్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మోదీ చిత్రపటానికి క్షీరాభిషేకం
నూతన పార్లమెంటు భవనంలో తొలిబిల్లుగా మహిళా రిజర్వేషన్ల బిల్లును పెట్టినందుకు బీజేపీ మహిళా నేతలు హర్షం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని మోదీ చిత్రపటానికి డీకే అరుణ ఆధ్వర్యంలో నేతలు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధానకార్యదర్శి బంగారు శ్రుతి, మహిళానేతలు ఆకుల విజయ, బండా కార్తీకారెడ్డి, సునీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment