సాక్షి, న్యూఢిల్లీ: బెంగాల్ రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఎవరికి వారు సామాజిక వర్గాల ఆధారంగా ప్రజలకు తాయిలాలు ప్రకటిస్తూ తమవైపు ఆకర్షించుకునే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే గెలుపే లక్ష్యంగా బిహార్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా పశ్చిమ బెంగాల్‌లో కుల సమీకరణాలే కీలక పాత్ర పోషించే పరిస్థితి ఏర్పడింది. దీంతో బెంగాల్ గద్దెనెక్కేందుకు రాజకీయ పార్టీలు తమ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు దూరంగా ఉన్న మతువా, ఆదివాసీ, రాజవంశీ, బౌరి, బాగ్డి వంటి కులాల ప్రజలకు తాయిలాలు ప్రకటించడం ద్వారా తమవైపు తిప్పుకునేందుకు మమతా బెనర్జీ ప్రయత్నిస్తోంది. బీజేపీ నాయకులు కూడా ఈ వర్గాలను ఆకర్షించేందుకు తీవ్రంగా కృషిచేస్తున్నారు. ముఖ్యంగా రాజవంశీలు, మతువాలపై కమలదళం ప్రత్యేక దృష్టిపెట్టింది.
మతువాలకు సంబంధించి అనేక అంశాల్లో కీలక ప్రకటనలు, 2019 సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్ని అమలు చేసే ప్రక్రియపై కమలనాథులు ప్రణాళికలు అమలు చేస్తున్నారు. ఇటీవల పశ్చిమబెంగాల్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. మతువా సామాజిక వర్గానికి పౌరసత్వం ఇచ్చేందుకు సవరించిన పౌరసత్వ చట్టం(సీఏఏ)ను అమలు చేయడంపై హామీ ఇచ్చారు. బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి శరణార్థుల సంక్షేమ పథకం, మాతువా వర్గంలోని వృద్ధులకు పింఛన్, యువతకు స్కాలర్‌షిప్ వంటి ఇతర పథకాలను అమలు చేస్తామని బీజేపీ నాయకులు ఇప్పటికే ప్రకటించారు.
గుడాకాందీకి ప్రధాని మోదీ
బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమైన పాత్ర పోషించే 70కిపైగా స్థానాల్లో కీలక ఓటుబ్యాంక్‌గా ఉన్న మతువా సామాజిక వర్గాన్ని ఆకర్షించేందుకు కమలదళం మరో మాస్టర్ స్ట్రోక్ ఆడనుంది. మతువా సామాజిక వర్గం తీర్థస్థలంగా భావించే ప్రాంతాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. బెంగాల్‌లో మార్చి 27న తొలిదశ ఓటింగ్ ప్రక్రియతో మొత్తం ఎనిమిది దశల పోలింగ్ ప్రక్రియ ప్రారంభంకానుంంది. తొలిదశ పోలింగ్‌కు ఒక్కరోజు ముందు 26న బంగ్లాదేశ్‌కు మోదీ వెళ్లనున్నారు. 27న మతువా సామాజిక వర్గం దైవంగా కొలిచే హరిచంద్ ఠాకూర్ జన్మస్థలం, మతువాలకు తీర్థస్థలం అయిన గుడాకాందీని మోదీ సందర్శిస్తారు.
ప్రధాని పర్యటనపై కమలదళం పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకుంది. ఎందుకంటే ఈ ప్రాంతాన్ని సందర్శించే తొలి భారత ప్రధానిగా మోదీ నిలువనున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐదు కోట్లకుపైగా మతువా సామాజిక వర్గ ప్రజల మనసుల్లో మోదీ చోటు సంపాదించగలరని బీజేపీ నాయకత్వం, మాతువా మహాసంఘ్ నాయకులు భావిస్తున్నారు. ప్రధానితో పాటు బెంగాల్‌లోని మాతువా వర్గానికి చెందిన బీజేపీ పార్లమెంట్ సభ్యుడు శాంతను ఠాకూర్ సైతం గుడాకాందీని సందర్శించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మతువా సామాజిక వర్గాన్ని తమవైపు తిప్పుకొనేందుకు 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో కమలదళం చేసిన ప్రయత్నాలు సఫలయ్యాయి. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా మతువా సమాజ పెద్ద, 100 ఏళ్ల బోరో మా బీనాపాణి దేవి ఆశీర్వాదం తీసుకొని ప్రధాని మోదీ తన బెంగాల్ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత బోరో మా మనవడు శాంతనును బొంగావ్ లోక్‌సభ స్థానంలో నిలబెట్టి, మతువా ఓటుపై దృష్టి పెట్టిన బీజేపీ, తమ వ్యూహంలో సఫలీకృతమైంది. బీజేపీ తొలిసారిగా ఈ లోక్‌సభ స్థానాన్ని కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో అదే వ్యూహాన్ని అమలు చేయడం ద్వారా మమతా దూకుడుకు అడ్డుకట్ట వేసేందుకు కమలదళం సంసిద్ధమైంది.
ఎవరీ మతువాలు?
ఎస్సీలుగా ఉన్న మతువాలు దశాబ్దాల క్రితమే పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి పశ్చిమబెంగాల్‌కు వలస వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం మతువాలు పశ్చిమ బెంగాల్‌లో రెండో అతిపెద్ద షెడ్యూల్డ్ కుల జనాభా. మతువాలు ఎక్కువగా ఉత్తర, దక్షిణ 24 పరగణాల్లో నివాసం ఉన్నారు. నాడియా, హౌరా, కూచ్ బెహార్, ఉత్తర– దక్షిణ దినజ్‌పూర్, మాల్డా వంటి సరిహద్దు జిల్లాల్లోనూ వీరు విస్తరించి ఉన్నారు. మొత్తం ఎస్సీ జనాభాలో మతువాల జనాభా 17.4 శాతం. బెంగాల్‌లో 1.8 కోట్ల ఎస్సీ జనాభా కారణంగా రాష్ట్రంలోని 42 లోక్‌సభ స్థానాల్లో 10 స్థానాలను షెడ్యూల్డ్ కులాల కోసం రిజర్వ్ చేశారు. వీటిలో కూచ్ బెహార్, జల్పాయిగురి, బిష్ణుపూర్, బొంగావ్ లోక్‌సభ స్థానాలను 2019 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్‌సీల్లో తమకున్న పాపులారిటీని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ తీవ్రంగా కృషిచేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment