
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో భారతీయ జనతా పార్టీ కార్యకర్త తల్లి మరణం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) మద్దతుదారులు దాడి చేయడంతో ఆమె గాయాలపాలై మృతి చెందిందని బీజేపీ ఆరోపిస్తుండగా, ఈ ఘటనతో తమకు సంబంధం లేదని తృణమూల్‌కాంగ్రెస్ పార్టీ తేల్చిచెప్పింది. వయసుతో వచ్చే అనారోగ్య సమస్యలే ఆమె మృతికి కారణమని తృణమూల్ వెల్లడించింది. వృద్ధురాలి మృతిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా ట్విట్టర్‌లో స్పందిస్తూ టీఎంసీపై ఆరోపణలు గుప్పించడంతో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది.
అసలేం జరిగింది?
పశ్చిమబెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో నిమ్తా పోలీసు స్టేషన్ పరిధిలోని నార్త్ డమ్‌డమ్ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్త గోపాల్ మజుందార్ తన తల్లి శోభా మజుందార్‌తో (82) కలిసి నివసిస్తున్నాడు. ఫిబ్రవరి 27న కొందరు వ్యక్తులు ముఖాలు గుర్తుపట్టకుండా ముసుగులతో వచ్చి గోపాల్ ఇంటిపై దాడి చేశారు. గోపాల్‌తోపాటు వృద్ధురాలైన అతడి తల్లి తీవ్రంగా గాయపడ్డారు. దీనిపై నిమ్తా పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ గూండాలే తమపై దాడి చేశారని శోభా మజుందార్ చెప్పారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మార్చి 27న కన్నుమూశారు. శోభా మజుందార్ చావుకు టీఎంసీ కార్యకర్తలే కారణమని, వారిని శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు, కార్యకర్తలు సోమవారం నిమ్తా పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేపట్టారు. రోడ్లను దిగ్బంధించారు. దర్యాప్తు జరుగుతోందని పోలీసులు వారికి నచ్చజెప్పారు.
హింస లేని రేపటి కోసం పోరాటం
తమ పార్టీ కార్యకర్త తల్లి చనిపోవడం పట్ల కేంద్ర హోంమంత్రి అమిత్ షా విచారం వ్యక్తం చేశారు. టీఎంసీ గూండాలు కొట్టడం వల్లే శోభా మజుందార్ మరణించారని ధ్వజమెత్తారు. ‘బాధిత కుటుంబం అనుభవిస్తున్న బాధ, గాయాలు మమతను వెంటాడడం ఖాయం. హింస లేని రేపటి కోసం మన తల్లులు, చెల్లెళ్లకు రక్షణ ఉండే రాష్ట్రం కోసం బెంగాల్ పోరాడుతోంది’ అని షా ట్వీట్‌చేశారు. బెంగాల్‌లో హింస రాజ్యమేలుతోందని కేంద్ర మంత్రి దేబశ్రీ చౌదరి మండిపడ్డారు. 82 ఏళ్ల వృద్ధురాలిని కూడా వదలకుండా కొట్టి చంపడం దారుణమని దుయ్యబట్టారు. ఈ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. బీజేపీ ఆరోపణలపై టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ స్పందించారు. వృద్ధురాలి మరణానికి రాజకీయాలతో సంబంధం లేదన్నారు. చావును కూడా బీజేపీ సొమ్ము చేసుకుంటోందని విమర్శించారు. వృద్ధాప్యం వల్ల తలెత్తే అనారోగ్యం కారణంగానే శోభా మజుందార్ మరణించినట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు. దర్యాప్తు ప్రక్రియకు ఆటంకం కలిగించరాదని టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓ బ్రెయిన్ అమిత్ షాకు హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment