
నందిగ్రామ్: బీజేపీ కార్యకర్త అని చెబుతున్న వ్యక్తి తల్లి మృతి ఘటన పశ్చిమ బెంగాల్‌లో సంచలనాత్మకంగా మారింది. దీనిపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత, సీఎం మమతా బెనర్జీ స్పందించారు. మహిళలపై హింసను తాను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించబోనని పేర్కొన్నారు. వృద్ధురాలి మరణానికి గల అసలు కారణం ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఆమె సోమవారం నందిగ్రామ్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బెంగాల్ గురించి మాట్లాడుతున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లో మహిళలపై జరుగుతున్న అరాచకాల విషయంలో ఎందుకు నోరు విప్పడం లేదని ప్రశ్నించారు. హథ్రాస్ ఘటనపై ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. బెంగాల్‌లో తన తల్లులు, సోదరీమణులపై హింసను సహించే ప్రసక్తే లేదన్నారు. బీజేపీ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తోందని విమర్శించారు. తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరుగుతున్నాయని, ఇటీవలే ముగ్గురు చనిపోయారని అన్నారు. బెంగాల్‌లో ప్రస్తుతం శాంతిభద్రతలు ఎన్నికల సంఘం పరిధిలో ఉన్నాయని, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉందని వెల్లడించారు.
నందిగ్రామ్‌లో దీదీ భారీ రోడ్ షో
అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్ స్థానం నుంచి మంచి మెజార్టీలో విజయం సాధించాలని మమత సంకల్పించారు. ఇక్కడ తన బలాన్ని ప్రదర్శించుకొనేందుకు సోమవారం భారీ రోడ్ షో నిర్వహించారు. రేయపారా ఖుదీరామ్ మోరే నుంచి ఠాకూర్‌చౌక్ వరకూ 8 కిలోమీటర్ల మేర జరిగిన ర్యాలీలో దీదీ ఉత్సాహంగా పాలు పంచుకున్నారు. నందిగ్రామ్‌లో ఏప్రిల్ 1న ఎన్నికలు జరుగనున్నాయి. అప్పటిదాకా తాను ఇక్కడే ఉంటానని మమతా బెనర్జీ ప్రకటించారు. ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని, ఆ పార్టీ ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment