సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. వచ్చే 160 రోజుల కార్యక్రమాలకు బీజేపీ జాతీయ నాయకత్వం రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేసింది. పోలింగ్ బూత్ స్థాయి వరకు పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడం, ఎన్నికల సందర్భంగా ఎలాంటి సవాళ్లు ఎదురైనా ఎదుర్కొనేలా పార్టీ యంత్రాంగాన్ని సిద్ధం చేసుకోవడంపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటినుంచి సెప్టెంబర్ చివరిదాకా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాలతోపాటు కేంద్ర ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని ప్రచారం చేస్తూ.. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ నేతలకు సూచించింది.
మే రెండో వారంలో ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో 500 మంది ముఖ్య కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించాలని సూచించింది. ఇక ఎన్నికల మోడ్‌లోకి వచ్చేసినట్టేనని, ముందూ వెనకా చూడకుండా అంతా సమష్టిగా మెరుగైన సమన్వయంతో పార్టీ విజయానికి కృషి చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం జరిగిన రాష్ట్ర పార్టీ కోర్ కమిటీ, ముఖ్యనేతల సమావేశంలో.. బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శులు, రాష్ట్ర ఇన్‌చార్జులు తరుణ్‌చుగ్, సునీల్ బన్సల్, పార్టీ సంస్థాగత సహ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్, రాష్ట్రపార్టీ సహ ఇన్‌చార్జి అర్వింద్ మీనన్ దిశానిర్దేశం చేశారు.
అమిత్‌షా సభను సక్సెస్ చేయాలి
ఈ నెల 23న చేవెళ్లలో కేంద్రమంత్రి అమిత్‌షా బహిరంగ సభను విజయవంతం చేయాలని.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకునే విషయంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నిత్యం ప్రజల్లో ఉండే విధంగా వివిధ రూపాల్లో కార్యక్రమాలను చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్ర, జిల్లా, మండల పార్టీ కమిటీల్లో ఖాళీగా ఉన్నస్థానాలను వెంటనే భర్తీ చేయాలని.. పార్టీ పదవుల్లో ఉండి కార్యక్రమాలు, ఆందోళనల్లో పాల్గొనని వారిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇవ్వాలని సూచించారు.
సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ ధర్మపురి అర్వింద్, పార్టీనేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, పి.మురళీధర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి, విజయశాంతి, గరికపాటి మోహన్‌రావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి తదితరులు పాల్గొన్నారు. పార్టీ నేతలు గురు, శుక్రవారాల్లోనూ సమావేశాలు నిర్వహించి, వివిధ అంశాలను సమీక్షించనున్నారు.
కార్యక్రమాల తీరు ఇలా..
♦ మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కారు తొమ్మిదేళ్ల పాలన పూర్తిచేసుకుంటున్న సందర్భంగా మే 15 నుంచి జూన్ 15 వరకు ‘జన సంకల్ప్ అభియాన్’ కార్యక్రమాలను నిర్వహిస్తారు. కేంద్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలను, వివిధ రంగాల్లో సాధించిన విజయాలను ప్రచారం చేస్తారు.
♦ జూన్, జూలై మాసాల్లో ‘సాలు దొర.. సెలవు దొర’ పేరుతో తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో అవినీతి, అక్రమాలు, స్కామ్‌లు, వివిధ రంగాల సమస్యలు, ప్రజల ఇబ్బందులపై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు.
♦ ఆగస్టు, సెప్టెంబర్‌లలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, యువత, విద్యార్థులు, రైతులు, కూలీలు తదితర వర్గాలను స్వయంగా కలుసుకుని.. బీజేపీ అధికారంలోకి వస్తే వారికి జరిగే ప్రయోజనాలను వివరిస్తారు.
తాగేందుకు నీళ్లే లేవు.. అభివృద్ధి ఎక్కడ?: సంజయ్
బుధవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తరుణ్‌చుగ్, బండి సంజయ్‌ల సమక్షంలో బాన్సువాడ నియోజకవర్గానికి చెందిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎంలకు చెందిన నాయకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడారు. తాగడానికి మంచి నీళ్లు అందించలేని సీఎం కేసీఆర్.. అభివృద్ధి గురించి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ‘‘మంచి నీళ్లు అందక జనం అల్లాడుతున్నారు. ఎండలో కిలోమీటర్లు నడిచి వెళ్లి వ్యవసాయ బోర్ల వద్ద నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నారు. దీనిని బట్టి మిషన్ భగీరథ ఎంత పెద్ద స్కామో తెలిసిపోతుంది..’’ అని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment