చంద్రన్న దెబ్బ! చౌదరిగారికి పరాభవం | Boddu Venkataramana Chowdary No Chance On TDP MP Ticket | Sakshi
Sakshi News home page

చంద్రన్న దెబ్బ! చౌదరిగారికి పరాభవం

Published Sat, Mar 23 2024 9:34 AM | Last Updated on Sat, Mar 23 2024 11:40 AM

Boddu Venkataramana Chowdary No Chance On TDP MP Ticket - Sakshi

టీడీపీ మూడో జాబితాలోనూ బొడ్డు వెంకట రమణ చౌదరి పేరు నిల్‌

ఎంపీ స్థానంపై ఆశలు గల్లంతేనా!

ఇప్పటికే చేజారిన రాజానగరం సీటు

లోక్‌సభ బరిలో పురంధేశ్వరిని దింపేందుకుతాజాగా కమలనాథుల కసరత్తు

అదే జరిగితే చౌదరి రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమే

చంద్రబాబు నిర్ణయంపై ఆయన వర్గంలో పెరుగుతున్న ఆగ్రహం

పార్టీ కోసం.. చంద్రబాబు పర్యటనల కోసం ఇప్పటికే కోట్లాది రూపాయల చేతి చమురు వదిలిపోయింది.. మూతికి కర్రతో గడ్డి కట్టి, ఆశ చూపించి, పరుగులు పెట్టించినట్టు.. ఎమ్మెల్యే సీటు ఇస్తామంటూ ఆశ చూపారు. ఆ మాటలు కాస్తా నమ్మి పార్టీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేశారు. కొన్నాళ్లు పోయాక.. అబ్బెబ్బే.. అది కాదు.. ఎంపీ సీటు అన్నారు. తీరా చూస్తే పొత్తులతో ఆ ఆశ కాస్తా చిత్తయిపోతున్న చిత్రం కళ్ల ముందు స్పష్టం కనిపిస్తోంది. మొత్తంమీద చంద్రబాబు జిత్తులతో దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తున్నట్టుగా ఉంది టీడీపీ రాజానగరం నియోజకవర్గ ఇన్‌చార్జి బొడ్డు వెంకట రమణ చౌదరి పరిస్థితి. తాజాగా శుక్రవారం విడుదల చేసిన మూడో జాబితాలో కూడా చౌదరి పేరు లేకపోవడంతో.. ఈ పరాభవాన్ని ఎలా సహించాలంటూ ఆయనతో పాటు ఆయన వర్గం అగ్గిమీద గుగ్గిలంలా మండిపడుతోంది. వ్రతం చెడ్డా ఫలితం కూడా దక్కలేదంటూ ఆక్రోశిస్తోంది.

సాక్షి, రాజమహేంద్రవరం: రాజానగరం అభ్యర్థిత్వం చేజారిన టీడీపీ నేత బొడ్డు వెంకట రమణ చౌదరికి మళ్లీ భంగపాటు తప్పదా? రాజమహేంద్రవరం ఎంపీ స్థానం ఆశిస్తున్న ఆయనకు.. టీడీపీ, జనసేన బీజేపీ కూటమితో ఆశలు గల్లంతైనట్లేనా? కూటమి అభ్యర్థిగా దగ్గుబాటి పురంధేశ్వరిని రంగంలోకి దింపేందుకు కమలనాథులు పావులు కదుపుతున్నారా? ఈ పరిణామంతో చౌదరికి మరోసారి పరాభవం ఎదురు కానుందా? టీడీపీ మూడో జాబితాలో ఆయన పేరు లేకపోవడం ఇందుకు బలాన్ని చేకూరుస్తోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది రాజకీయ విశ్లేషకుల నుంచి.

రెంటికీ చెడ్డ రేవడిలా..
తన పనితీరుపై అధినేత చంద్రబాబు విరుచుకుపడటంతో రాజానగరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పదవికి చాన్నాళ్ల కిందటే గుడ్‌బై చెప్పేశారు. అప్పటి నుంచీ ఆ బాధ్యతలను బొడ్డు వెంకట రమణ చౌదరికి చంద్రబాబు అప్పగించారు. ఆయనే రాజానగరం ఎమ్మెల్యే అభ్యర్థి అనే ప్రచారం విస్తృతంగా సాగింది. అంతలోనే ఆయన ఆశలపై పొత్తుల పిడుగు పడింది. జనసేనతో టీడీపీ పొత్తు కుదుర్చుకోవడం.. రాజానగరంలో జనసేన పోటీ చేస్తుందని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించడంతో చౌదరి వర్గంలో ఒక్కసారిగా ప్రకంపనలు రేగాయి. ఈ పరిణామం చౌదరికి మింగుడు పడని అంశంగా మారింది. 

ఒక దశలో ఇది చంద్రబాబుపై ధిక్కార స్వరం వినిపించే స్థాయికి చేరింది. కొద్ది రోజుల కిందట జిల్లా పర్యటనకు వచ్చిన చంద్రబాబును అడ్డుకోవడం వరకూ వెళ్లింది. ఆ సమయంలో చౌదరిని బుజ్జగించేందుకు చంద్రబాబు టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలన్నీ ప్రదర్శించారు. రాజమహేంద్రవరం ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తానంటూ భరోసా ఇచ్చారు. అందుకు ససేమిరా అన్నప్పటికీ చేసేది లేక చౌదరి మిన్నకుండిపోయారు. అప్పటి నుంచీ టీడీపీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గంలో సైతం పెద్దగా కనిపించడం లేదు. ఆయన వర్గం సైతం అందే పంథా అవలంబిస్తోంది. తనకు ఎంపీ సీటు కేటాయిస్తారులే అనే ఆశతో ఇష్టం లేకపోయినా.. జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి చౌదరికి ఏర్పడింది. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ తాజాగా ప్రకటించిన మూడో జాబితాలో సైతం ఆయన పేరు లేకపోవడంతో ఎంపీ సీటు కూడా గోవిందానేనా? అనే అనుమానం చౌదరి వర్గీయుల్లో వ్యక్తమవుతోంది.

కలవరం రేపుతున్న కూటమి
ఎమ్మెల్యే సీటు ఎటూ దక్కలేదు.. కనీసం ఎంపీగా అయినా అవకాశం వస్తుందని భావిస్తున్న చౌదరి వర్గానికి.. చంద్రబాబు బీజేపీతో కలవడం కొత్త టెన్షన్‌ తెచ్చిపెడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమహేంద్రవరం ఎంపీ సీటు ఆశిస్తున్న విషయం తెలిసిందే. ఆమెను ఎన్నికల బరిలోకి దింపేందుకు కమలనాథులు వ్యూహాలు రచిస్తున్నారు. పొత్తులో భాగంగా రాజమహేంద్రవరం స్థానాన్ని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు నగరంలోని ఓ హోటల్‌లో కొద్ది రోజులుగా బస చేస్తున్నట్లు తెలిసింది.

పురంధేశ్వరి పోటీ చేస్తే అనుసరించాల్సిన వ్యూహాలు, సాధ్యాసాధ్యాలపై వారు సమాలోచనలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇటువంటి పరిస్థితుల్లో పురంధేశ్వరి పోటీ దాదాపు ఖాయమన్న విషయం స్పష్టమవుతోంది. ఇదే తరుణంలో ప్రస్తుతం ఉన్న కేసుల దృష్ట్యా బీజేపీ కోరుకుంటున్న ఈ లోక్‌సభ స్థానాన్ని కాదనే ధైర్యం చంద్రబాబు చేయరు. ఈ పరిణామాలు చౌదరి వర్గంలో ఆందోళన రేపుతోంది. ఎంపీ అవకాశం కూడా లేనట్లేనా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇలాగైతే తన రాజకీయ భవిష్యత్తు ఏమిటనే మీమాంస ఆయన వర్గంలో బలంగా కనిపిస్తోంది. పార్టీని నమ్ముకుంటే నట్టేట మునిగేలా ఉన్నారన్న భావన వ్యక్తమవుతోంది.

రూ.కోట్లు ధారబోసినా కరివేపాకు రాజకీయమేనా!
బీజేపీ నేతలతో చంద్రబాబు కాళ్లబేరానికి వెళ్లడం టీడీపీ నేతలకు తిప్పలు తెచ్చి పెడుతోంది. ఇప్పటికే జనసేనతో జత కట్టడంపై గుర్రుగా ఉన్న తెలుగు తమ్ముళ్లు తాజాగా బీజేపీతో కలవడంపై మరింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వెంకట రమణ చౌదరి హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు నిర్వహిస్తున్నారు. చినబాబు లోకేష్‌కు సంబంధించిన సోషల్‌ మీడియా మొత్తం ఆయనే చూస్తున్నారు. చంద్రబాబు ఎక్కడ పర్యటించినా పబ్లిసిటీ చేసేందుకు సహకరిస్తున్నారు. ఇదే తరుణంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. పార్టీ బలోపేతం, పటిష్టతకు ఇంత చేస్తున్నా తనకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదనే అభిప్రాయం చౌదరి వర్గంలో వ్యక్తమవుతోంది. తన విషయంలో కూడా చంద్రబాబు కరివేపాకు మాదిరిగా వాడుకుని వదిలేసే రాజకీయాలకు తెర తీయడంపై మండిపడుతున్నారు.

లోహిత్‌నూ వాడేసుకున్నారు
ఎన్‌ఆర్‌ఐలు, డబ్బున్న నేతలు, సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తులను వాడుకుని వదిలేయడంలో చంద్రబాబుది అందె వేసిన చేయి. ఇందుకు నిదర్శనమే శిష్ట్లా లోహిత్‌. ఎంపీ స్థానం కేటాయిస్తామనే ఆశ కల్పించి, ఎన్‌ఆర్‌ఐ అయిన లోహిత్‌ను రాజమహేంద్రవరంలో పరిచయం చేశారు. ఆర్థికపరమైన పార్టీ కార్యక్రమాలకు ఆయనను విస్తృతంగా వినియోగించుకున్నారు.

ఆయనను ఏ స్థాయిలో వాడేసుకున్నారంటే.. రాజమహేంద్రవరంలో మహానాడు నిర్వహణకు ఒక్కో నియోజకవర్గానికి రూ.25 లక్షల చొప్పున మొత్తం రూ.1.75 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. అలా లోహిత్‌ ఇచ్చిన డబ్బుతోనే మహానాడుకు పెద్ద పెద్ద ఫ్లెక్సీలు వేసేశారు. అందులో లోహిత్‌కు తగిన గుర్తింపు ఇచ్చిన పాపాన పోలేదు. చివరకు సీటు తనకు కాదని చావు కబురు చల్లగా చెప్పేశారు. దీంతో చేసేది లేక లోహిత్‌ ఇక్కడి నుంచి దుకాణం సర్దుకోవాల్సి వచ్చింది. ఇదేవిధంగా రాజమహేంద్రవరం పార్లమెంటరీ స్థానాన్ని పురంధేశ్వరికి కేటాయిస్తే వెంకట రమణ చౌదరి సైతం దుకాణం ఎత్తేయాల్సిన పరిస్థితి తలెత్తుతుందని ఆయన వర్గంలో చర్చ జరుగుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement